దైవ భక్తిలో స్వార్థం… దేశ భక్తిలో త్యాగం : భరత్ కుమార్

దేశం కోసం జీవించే వ్యక్తులను, అవసరమైతే ప్రాణాలు సైతం అర్పించే వ్యక్తులను కూడా తయారు చేసే కేంద్రం ఆరెస్సెస్ శాఖ అని క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు లక్ష స్థలాల్లో 20 లేదా 30 మంది చొప్పున సుమారుగా 25 లక్షల మంది నమస్తే సదా వత్సలే మాతృభూమే అని ప్రార్థన చేస్తున్నారని, అలాంటి వ్యవస్థ ఆరెస్సెస్ లోనే వుందని గుర్తు చేశారు. ‘‘గోవా విముక్తి పోరాటంలో RSS స్వయంసేవకులు’’ అన్న అంశంపై హైదరాబాద్ లో చింతన్, సూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో భరత్ కుమార్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లి ఒడి ఖాళీ కావొచ్చు కానీ.. తల్లి గర్భం ఎప్పుడూ ఖాళీగా వుండదని, అలాంటి గొప్ప చరిత్ర భారత మాతది అని చెప్పారు. స్వాతంత్ర సమరయోధుల చరిత్ర, దేశం కోసం ఉరితాళ్లను కూడా ముద్దాడే చరిత్ర కేవలం భారత్ లోనే వుందన్నారు. శత్రువుల తలలతో బంతులాట లాడిన భూమి భారత్ భూమి అని తెలిపారు.
స్వాతంత్రం తర్వాత కొన్ని రోజులకు నైజాం నుంచి విముక్తం అయ్యామని, అలాగే చిన్న ప్రాంతమైన గోవాను విముక్తం చేసుకోవడానికి 14 సంవత్సరాలు పట్టిందన్నారు. గోవా విముక్తి సమయంలో పోర్చుగ్రీసు సైనికులు 3 వేలకు పైగా వున్నారని, అదే ప్రజలు సుమారు 4 లక్షల వరకున్నారని, అయితే.. విముక్తం చేసుకోలేకపోయామన్నారు. మన బలహీనత ఎంత వుందో అర్థం చేసుకోవచ్చని, ఈ బలహీనతను కాస్తా బలంగా మార్చుకోవాలన్నారు.కళ్లు మూస్తే దైవం.. కళ్లు తెరిస్తే దేశం కనిపించాలని అంటారని, దైవం పట్ల శ్రద్ధ, విశ్వాసం వుండటం ఎంత ముఖ్యమో… ఈ భూమి పట్ల అలాంటి భక్త భావన వుండాలని సూచించారు. 2017 లో విజయవాడ ఆరెస్సెస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతీ వారు వచ్చారని, దైవ భక్తి కంటే దేశభక్తే గొప్పదని చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత విజయేంద్ర సరస్వతీ స్వామి వార్ని దీనిపై అడిగితే.. దైవభక్తిలో వ్యక్తిగత స్వార్థం వుంటుందని, దేశ భక్తిలో ఆ స్వార్థం కూడా వుండదని, అందుకే దైవ భక్తి కంటే దేశభక్తే గొప్పదని వివరించారని పేర్కొన్నారు.
ఇదే స్ఫూర్తితో 18 ఏళ్ల సీతారాం శాఖకు వస్తూ.. ఇక్కడ వుండే వ్యక్తికి గోవా మట్టి ముద్ద మాత్రమే కాదని, ఈ దేశంలో భాగమని, దీని విముక్తి కోసం ఆరుగుర్ని తీసుకొని వెళ్లారని అన్నారు. మాతృదేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులు వున్నారని, ఇలాంటి భావాలను జాగృతం చేసి, హృదయంలో నింపేదే ఆరెస్సెస్, ఆరెస్సెస్ శాఖ అని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *