బుడగ జంగాల కుటుంబాల్లో కుమారి పూజ
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మన హిందూ సంప్రదాయంలో కుమారి పూజ నిర్వహిస్తారు. సామాజిక సమరసత అధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలోని బుడగ జంగాల కాలనీలో సంచార జాతులకు కుమారి పూజ చేయటం జరిగింది.
సృష్టికి సందేశం కుమారి పూజ!! కుమారి పూజ కోసం కన్యను ఎన్నుకోవడంలో జాతి, మతం లేదా కుల భేదం లేదు. సిద్ధాంతపరంగా ఏ కన్యను అయినా దేవతగా భావించి పూజించవచ్చు.. అలాగే నవరాత్రులలో తొమ్మిది రోజుల పూజకు తొమ్మది మంది కన్యలను తొమ్మిది రూపాల్లో ఉన్న అమ్మవారికి ప్రతిరూపంగా పూజిస్తారు. మన ధర్మం లో కుమారి పూజ భక్తులకు అనేక ఆశీర్వాదాలను ఇస్తుందని నమ్ముతారు. ఇది అన్ని ప్రమాదాలనూ తొలగిస్తుందని, శుభాలను ఇస్తుంది అని చెప్పబడింది. కుమారి పూజ యొక్క తాత్విక ఆధారం మహిళల విలువను స్థాపించడమే. సృష్టి, స్థిరత్వం మరియు విధ్వంసాన్ని నియంత్రించే శక్తుల ఆరంభాన్ని ఈ కుమారి పూజ సూచిస్తుంది.
సమాజంలోనూ మరియు సృష్టికి స్త్రీయే మూలం. స్త్రీ అంటే ప్రకృతి స్వరూపం అని సత్వ తమో రజో గుణాల కలయిక నే స్త్రీ అని మహాపురుషులు చెప్పడం జరిగింది. స్త్రీకి కూడా మొదట బాల్య దశ సహజం. అయితే స్త్రీ ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో కూడా ఈ కుమారి పూజను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న అమానుష దాడులలో సమాజంలో అందరు స్త్రీలను లేదా బాలికలను దేవతా స్వరూపాలుగా చూస్తే ఎలాంటి దురాగతాలు జరగవని అనిపిస్తుంది. ప్రతి స్త్రీ, ప్రతి ఆడపిల్ల ఆ పరాశక్తితో సమానమే, ఆ పరాశక్తి స్వరూపమే అని చాటి చెప్పడం ఈ కుమారి పూజలో ఒక భాగమని చెప్పవచ్చు. బుడగ జంగాల కాలనీలో సంచార జాతులకు చేసిన ఈ కుమారి పూజా కార్యక్రమంలో కరినగర్ జిల్లా సామాజిక సమరసత జిల్లా బృందం పాల్గొన్నది.