ప్రపంచాన్ని కలిపిన మహాకుంభమేళా
ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. చివరి రోజైన మహా శివరాత్రి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హరహర మహాదేవ్ నామస్మరణంతో త్రివేణీ సంగమ ఘాట్లు మార్మోగిపోయాయి. కుంభమేళాలో చివరి అమృతస్నానం ఆచరించేందుకు భక్తులు అర్ధరాత్రి నుంచే ఘాట్ల వద్దకు చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో కలిసి గోరఖ్ పూర్ కంట్రోల్ రూమ్‌లో ఉదయం నుంచే ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జనవరి 13 న మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. సాధువులు, నాగ సాధువులు, అఖారాలు, సామాన్య భక్తులు, విదేశీయులు కూడా తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరించారు. 45 రోజులపాటు మహాకుంభమేళా అంగరంగ వైభవంగా సాగింది. దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మహాకుంభమేళాతో ఆధ్యాత్మికంతో పాటు ఆర్థికంగా కూడా ఆ ప్రాంతం పరిపుష్టమైంది. మహా కుంభం అటు భక్తికీ, ఇటు ఆర్థిక వనరులకు కూడా కేంద్రమైంది.
యూపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపు 3 లక్షల కోట్లకు పైగా ఏర్పాట్లకు ఖర్చు చేసింది. పరిశ్రమ నిపుణులు, వాణిజ్య సంస్థలు, కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్‌తో సహా, ఖీవీజG, టెక్నాలజీ, స్టార్టప్‌ల వరకూ అన్న రంగాలలోని వ్యాపారాల విస్తరణకు మహా కుంభమేళా ఉపయోగపడిరది.
45 రోజుల మహాకుంభమేళా..
* 66 కోట్లమంది పుణ్యస్నానాలు
* 15 లక్షలమంది విదేశీయులు
* 13 కోట్లకు పైగా కాశీ, అయోధ్య ధర్శనం
* శివరాత్రి రోజున 2.5 కోట్ల మంది పుణ్యస్నానాలు
* 10 వేల ఎకరాల్లో తాత్కాలిక నగర నిర్మాణం
* ఏర్పాట్లకు రూ.7500 కోట్ల ఖర్చు
* 12 లక్షల మందికి ఉపాధి
* రూ.3లక్షలకోట్ల ఆర్థిక కార్యకలాపాలు
మహాకుంభ్ చరిత్రలో మొదటి సారిగా కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 1,800 AI ప్రారంభించిన వాటితో సహా 3,000 కెమెరాలను భద్రత కోసం ఉపయోగించారు. అలాగే డ్రోన్లను కూడా వాడారు. 60,000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.
మహా కుంభమేళా అధికారికంగా ముగిసినా… ఇప్పటికీ భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో యథావిథిగా అక్కడి ఏర్పాట్లను కొనసాగిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు అధికారులందరూ అత్యంత సమర్థవంతంగా, నిష్ఠతో పనిచేశారని యూపీ ప్రభుత్వం ప్రశంసించింది. మహా కుంభమేళాలో దాదాపు 14 అఖాడాలకు సంబంధించిన నాగసాధువులు తరలివచ్చి, కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. కేవలం కుంభమేళా సమయంలోనే వీరు దర్శనమిస్తారు. ఒండినిండా భస్మాన్ని పూసుకొని, ఈటెలు, త్రిశూలాలు చేతపట్టి, డమరుక నాదాల మధ్య వేలమంది నాగ సాధువులు తరలివచ్చారు. మఠ, పీఠాధిపతులు, యోగులు, అఘోరీలు, సిద్ధ పురుషులు, నాగసాధువులందర్నీ ప్రత్యక్ష దర్శనం చేసుకునే అవకాశం వచ్చింది. విదేశీయులు కూడా ఆకర్షితులయ్యారు. మహా కుంభమేళాలో స్నానాలు చేసి, కొందరు సన్యాసాశ్రమం కూడా తీసుకున్నారు. మహాకుంభమేళా అత్యద్భుత ఘట్టంగా అభివర్ణించారు.
సేవా కార్యక్రమాలలో స్వయంసేవకులు
మహా కుంభమేళా సందర్భంగా 16 వేల మంది స్వయంసేవకులు సేవా కార్యక్రమాల్లో నిమగ్న మయ్యారు. యాత్రికులకు భోజనం అందించారు. కుంభమేళా ప్రాంతంలోని దారాగంజ్, సుబేదర్ గంజ్‌లోని రజ్జుభయ్యా నగర్‌లో స్వయంసేవకులు యాత్రికుల కోసం టీ, బిస్కెట్లు, ఆహార ప్యాకెట్లు అందజేశారు. అలాగే ప్రభుత్వసిబ్బందికి సహాయం చేస్తూ, ట్రాఫిక్ నియంత్రణ కూడా చేశారు.
మరో ఆసక్తికర ఘటన
మహా కుంభమేళాలో అద్భుతఘట్టం చోటుచేసుకుంది. జగద్గురువు శ్రీ శంకరాచార్యులు వారు స్థాపించిన పీఠాలకు చెందిన ముగ్గురు శంకరాచార్యులు ఒకే వేదికపై సమావేశమయ్యారు. సనాతన ధర్మ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు. ముగ్గురు శంకరాచార్యులు కలిసి సనాతన ధర్మ రక్షణ కోసం కీలక తీర్మానాలు చేశారు. గో వధను నిలిపివేయాలని ధర్మాదేశం ఇచ్చారు. అలాగే గోవును దేశమాతగా ప్రకటించా లని తీర్మానం చేయగా సమావేశానికి హాజరైన వారు కరతాళధ్వనులతో ఆమోదించారు.
దేశ ఐక్యత, సమగ్రత, సనాతన సంప్రదాయ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను పేర్కొన్నారు. కుంభమేళా సమయంలో ప్రయాగ్‌రాజ్‌కు ప్రతీ ఒక్కరూ రావాలని పిలుపునిచ్చారు.
దేశంలోని మూడు ఆమ్నాయ పీఠాలకు చెందిన శంకరాచార్యలు భేటీ కావడం ఇదే మొదటిసారి. సనాతన సంస్కృతి వృద్ధి, రక్షణపై 27 మార్గదర్శ కాలు విడుదల చేశారు. సంస్కృత భాష ప్రాముఖ్య తపై దృష్టి పెట్టాలని శంకరాచార్య శ్రీ సదానంద సరస్వతి సూచించారు. గోవును దేశమాతగా గుర్తించాలని కోరుతూ శృంగేరి పీఠాధిపతి శ్రీ విధు శేఖర భారతి తీర్మానించారు.
ఐక్యతను చాటిన కుంభమేళా
అనేకత్వంలోని ఐక్యతను చాటి చెప్పిన పర్వం మహా కుంభమేళా. భారత్ సమగ్ర స్వరూప చిత్రాన్ని దర్శింపజేసింది. ప్రజలలో నైతిక, ఆధ్యాత్మిక, జాతీయభావ వికాసానికి, దిశా దర్శనం చేసింది. హిందుత్వం అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. అలాగే 3 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది.
పర్యావరణ హితానికి ఆర్‌ఎస్‌ఎస్ సంచులు, కంచాలు
ప్రయాగరాజ్‌లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని నెలకొల్పడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ` ఆర్‌ఎస్‌ఎస్ నడుం బిగించింది. ప్లాస్టిక్ సంచులు, ప్లేట్లకు బదులుగా గుడ్డ సంచులు, స్టీలు కంచాలు వాడాలని కుంభమేళా సందర్శకులకు పిలుపునిచ్చింది. ఒక సంచీ ` ఒక కంచం నినాదాన్ని భక్త జన సందోహంలోకి తీసుకొని వెళ్లింది. ఆర్‌ఎస్‌ఎస్ లక్షలాదిగా గుడ్డ సంచులు, స్టీలు కంచాలు, లోటాలను యాత్రికులకు పంచిపెట్టింది.
లక్షలాది చెట్లతో పర్యావరణ పరిరక్షణ
సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం మహాకుంభమేళాలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేయాలనే లక్ష్యంతో మియవకి అటవీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ క్రమంలో 2023, 2024 మధ్య కాలంలో 34,200 చ.మీ.ల విస్తీర్ణంలో 63 జాతులకు చెందిన 1,19,700 మొక్కలను నాటారు. వాటిలో మామిడి, వేప, చింత, రావి, తులసి, తురాయి, ఔషధ మొక్కలు ఉన్నాయి. అప్పటిదాకా వ్యర్థ పదార్థాలకు పారవేయడానికి ఉపయోగించే బుస్వర్ డంపింగ్ యార్డులో 27 వేల మొక్కలు నాటడంతో అది కాస్త పచ్చదనంతో నిండిపోయింది.