ప్రీ వెడ్డింగ్ షూట్ లు వద్దు : లంబాడాల తీర్మానం
లంబాడా సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కీలక తీర్మానం చేశారు. లంబాడాలు ఎవ్వరూ ప్రీవెడ్డింగ్ షూట్ నిర్వహించవద్దని అన్నారు. ఈ మేరకు ఓ తీర్మానం కూడా చేశారు. లంబాడీ గిరిజనుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భరత్ చౌహాన్ అధ్యక్షతన ఉట్నూరు కేంద్రంగా కీలక సమావేశం జరిగింది. అందులోనే ప్రీవెడ్డింగ్ షూట్ తమ సంప్రదాయాలకు విరుద్ధమని, నిర్వహించవద్దని తీర్మానించారు. లంబాడీలు తమ పిల్లల వివాహం నిశ్చయమైనప్పుడు ప్రీవెడ్డింగ్ చేయకుండా నిషేధిస్తామన్నారు. వివాహం అయిన తర్వాత ఆసక్తివుంటే పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలని సూచించారు. హల్ది ఫంక్షన్ చేయవద్దని, డీజే ఉపయోగించవద్దని కూడా తీర్మానించారు. లంబాడీ సంస్కృతికి అద్దం పట్టే విధంగానే వివాహాలు చేసుకోవాలని తీర్మానించారు.