పొలంలో మందు చల్లుతూ జాగ్రత్తలు పాటించకపోవడంతో తొమ్మిది మంది రైతు కూలీల అస్వస్థత
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఒకేసారి తొమ్మిది మంది రైతు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.పొలంలో మందు చల్లుతూ తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో వారంతా అస్వస్థతకు లోనయ్యారు. బాధితులను కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. అయితే ప్రస్తుత పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు.అయితే రైతులు, రైతు కూలీలు పొలాల్లో మందు కొట్టే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒంటిపై మందు పడకుండా శరీరం మెుత్తం ప్రత్యేకమైన వస్త్రాలతో కప్పుకోవాలని చెప్తున్నారు. అలాగే శ్వాస ద్వారా మందు లోపలికి వెళ్లి కళ్లు తిరగడం, వాంతులు లేదా తల తిరగడం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.