భాగ్యనగరంలో లక్ష యువ గళార్చన
భాగ్యనగరంలోని లాల్ బహదూర్ స్టేడియం లక్ష యువగళ గీతార్చనతో మారుమ్రోగింది. గీతాజయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన గీతాపారాయణ కార్యక్రమానికి తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన యువతీయువకులు కూడా ఇందులో పాల్గొన్నారు. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగాధర శాస్త్రి గీతా పారాయణ నిర్వహించారు. ఎంపిక చేసిన 40 శ్లోకాలను ఆయన ఆలపిస్తుండగా సభికులందరూ ఆయనతోపాటు కలిసి పఠించారు.
పూజ్యులు త్రిదండి చినజీయ్యర్ స్వామీజీ, విశ్వప్రసన్న స్వామీజీ, గోవిందగిరి మహరాజ్ లతోపాటు అనేకమంది సాధుసంతులు, విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీ మిళింద్ పరాండే, జాతీయ సంయుక్త కార్యదర్శి శ్రీ వై రాఘవులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామరాజు, తదితరులు ఇందులో పాల్గొన్నారు.
పూజ్య త్రిదండి చినజియ్యర్ స్వామి ఆశీ ప్రసంగం చేశారు. భగవద్గీతా సందేశం నిత్య నూతనమైనదని, మన బాధ్యతలను గుర్తుచేసేదని అన్నారు. మహోన్నతమైన ఈ దేశంలో పుట్టినందుకు ఇక్కడి సంస్కృతి సభ్యతలు, సంస్కారాలను కాపాడు కోవలసిన బాధ్యత మనందరిపై ఉందని స్వామీజీ ఉద్బోధించారు.
ఉడిపి పెజావర్ పీఠాధిపతి పూజ్య విశ్వప్రసన్న స్వామీజీ మాట్లాడుతూ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఉన్నాడని, ఉంటాడని, కానీ ఇప్పుడు అర్జునుడే అవసరమని, దైవభక్తి ఎంతో దేశభక్తి కూడా అంతే ముఖ్యమని అన్నారు.
అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మిళింద్ పరాండే మాట్లాడుతూ.. రాగల వారం రోజులలో దేశం మొత్తంలో ఇటువంటి కార్యక్రమాలు అనేకం జరుగుతాయని తెలిపారు. శ్రీకృష్ణుడు అర్జునిడికేకాక మనందరికీ కర్తవ్య బోధ చేశాడని అన్నారు. హృదయదౌర్బల్యాన్ని వదలి ధర్మ రక్షణకు సన్నద్ధం కావాలని గీత మనకు చెపుతుందని ఆయన అన్నారు.
విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి రాఘవులు గారు గీతా పారాయణ కార్యక్రమ ప్రణాళిక, ప్రధాన ఉద్దేశ్యాలను తెలియజేశారు.
భగవద్గీత ఎవరైనా చనిపోయి నప్పుడు వినిపించే మృత్యుగీత కాదని జీవితాన్ని చక్కదిద్దు కునేందుకు ఉపకరించే జీవన గీత అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మరోసారి అందరికీ గుర్తుచేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని రూపొం దించామని తెలియజేశారు.
స్టేడియం అన్ని వైపులా ఏర్పాటు చేసిన పురాణ పురుషుల చిత్రాలతోపాటు దేశ భక్తుల చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్టేడియం మొత్తం కాషాయ జెండాలతో కళకళలాడిరది.