భూ సుపోషణ
మన భారతదేశం అనాదిగా సమృద్ధమైన సుసంపన్నమైన ప్రకృతితో అవినాభావ సంబంధం కలిగిన దేశమే కాకుండా తన వ్యవస్థల ఆధారంగా అత్యున్నత వైభవమును సంతరించుకున్నది. భారత దృష్టికోణము ప్రకారంగా సృష్టి, ప్రకృతి మరియూ పరిసరవాతారాలు పరస్పర ఆధారితముగా ఉంటూ వాటిమధ్య ఒక విడదీయరాని సంబంధం మనకు కనపడుతుంది. మనం ప్రకృతిని సౌహార్థం, సామరస్యం, సహజీవనంతో పాటూ మాతృ భావముతో గౌరవిస్తాము. పర్వతములు, కొండలూ, గుట్టలూ, రాళ్ళు, చెట్లు, చేమలూ, పశువులు, పక్షులు, జలచరములు, మానవులూ.. అందరూ అన్నీ ఈ భూమి మీదనే ఉన్నాయి. ఈ అన్నీ సజీవ, నిర్జీవ సముదాయమంతా కలసి భూమిగా అవతరించినదే.
ఆ భూమి మనకు మాతృ సమానం. అందుకే మనం భూమిని పుడమి తల్లి అంటాము. తెలిసో తిలియకో మన తత్వానికి విరుద్ధమైన దోపిడీ దృష్టికోణాన్ని మన దేశంలో అవలంభించడం జరిగింది. తత్కారణంగా గాలి, నీరు, నేల, అతివేగంగా కలుషితమౌతూ ఉన్నాయి.
ప్రస్తుం భారతదేశంలో 164 హెక్టార్ల భూమి ఎడారులుగా నిస్సారమైన భూమిగా మారుతోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నివేదిక తెలియజేస్తున్నది. అనగా దాదాపు 30 శాతం భూమి దేనికి పనికిరానిదిగా మారుతుంది. ప్రతి సంవత్సరం 15.56 టన్నుల ఆమ్ల క్షారములు భూమిలో పెరుగుచున్నవని భారత వ్యవసాయ విజ్ఞాన సంస్థ పరిశోధనా ఫలితములు వెల్లడిస్తున్నది. ఈ నేపధ్యంలో మన కర్తవ్యం ఏమిటి?
మన భూమిని మనమే పోషించాలి, రక్షించు కోవాలి. గ్రామభారతి తెలంగాణా విభాగం, ఋషి జీవన సమాజం మరొక 20 స్వచ్ఛంద సంస్థలు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపే బాధ్యతను భుజాలపై వేసుకున్నాయి. ఈ మహత్కార్యంపై సంస్థల పని మాత్రమే కాదు, భూమిని సుపోషితం, సుభిక్షం, సుసంపన్నం చేయడం మన అందరి కర్తవ్యం. మీలో ప్రతి ఒక్కరూ ఈ బృహత్కార్యానికి చేయుతనివ్వండి, మనమందరం కలసి ఆరోగ్యవంత మైన భారతావనిని ఆవిష్కరించే కార్యక్రమంలో భాగస్వాములవుతాము.
– ధర్మపాలుడు