అన్నిటికీ ప్రభుత్వమేనా!
లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఉత్తరప్రదేశ్ వారణాసి దగ్గరలోని సేనాపురికి వెళ్లారు. రైలులో వెళ్ళిన ఆయన స్టేషన్ రాగానే కిందికి దిగడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ప్లాట్‌ఫాం చాలా కిందకు ఉండడంతో అక్కడ దిగడం ఆయనకు చాలా కష్టం అనిపించింది.
ఆయన పడుతున్న ఇబ్బంది చూసిన ఒక మహిళ ‘ఇప్పటికైనా ఈ ప్లాట్‌ఫాం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో మంత్రిగారికి తెలిసి ఉంటుంది’ అంది. ఆ మాటలు శాస్త్రిగారు విన్నారు. వెంటనే సిబ్బందిని పిలిచి ఒక పార, గంప తెప్పించారు. స్వయంగా తానే మట్టి తవ్వి ప్లాట్‌ఫాం మీద వెయ్యడం ప్రారంభించారు. ఇది చూసి నిర్ఘాంతపోయిన రైల్వే సిబ్బంది, చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఆ పనిలోకి దిగారు. మూడు గంటల్లో ప్లాట్ ఫాం ఎత్తు పెరిగింది.
‘చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రభుత్వం మీద ఆధారపడరాదు’ అని శాస్త్రిగారు వారికి చెప్పకనే చెప్పారు.