వామపక్షవాదులు, ఉదారవాదులతోనే హిందుత్వానికి ముప్పు : అసోం సీఎం
వామపక్షవాదులు, ఉదారవాదులతోనే హిందూ సమాజానికి అతిపెద్ద ప్రమాదమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. ముస్లింలు, క్రైస్తవులు ఎన్నడూ హిందూ సమాజానికి ప్రమాదం కాదన్నారు. కలకత్తాలో జరిగిన వివేకానంద సమ్మాన్ 2025 కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హిందువులే తమ సమాజాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. వామపక్షాలు, ఉదారవాదులతోనే బెంగాల్ లో హిందుత్వం బలహీనత ప్రారంభమైందని, హిందువులు అంతరించిపోతారని రాహుల్, మమత భావిస్తున్నారని ఆరోపించారు.
‘‘హిందువులు తలుచుకుంటే తమని తాము హిందూ రిపబ్లిక్ లో భాగమని ప్రకటించుకోవచ్చు. కానీ… వారు అందరితో కలివిడిగా వుండాలన్న పంథాను ఎంచుకున్నారు. అందుకే సెక్యులరిస్టుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం హిందువులకు లేనేలేదు’’ అని హిమంత బిస్వశర్మ అన్నారు.