భారతసేవకే అంకితమువుదాం

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌ప.పూ. సర్‌ ‌సంఘచాలక్‌ ‌డా. మోహన్‌ ‌భాగవత్‌జీ

విజయదశమి ఉపన్యాసం సంక్షిప్తంగా……

శక్తి(దేవి)ని తొమ్మిది రోజులు పూజించి ఆశ్వయుజ శుక్ల దశమినాడు, ఆ తల్లి విజయం సాధించిననాడు, ఈ విజయదశమిని జరుపు కుంటాం. భౌతిక, ఆధ్యాత్మిక శక్తుల ప్రకటిత రూపమైన అమ్మవారు సకల సంకల్పాలను నెరవేర్చి విజయాన్ని చేకూరుస్తుంది. శక్తి స్వరూపిణి అయిన ఆ దేవి ప్రకటితమవడమంటే స్వచ్చమైన, పవిత్రమైన సంకల్పాలు విజయవంతమవుతాయని, సర్వత్ర సుఖశాంతులు వర్ధిల్లుతాయని అర్ధం.

సంఘ కార్యక్రమాలలో మేధాసంపన్నులు, సమున్నత కార్యాలు సాధించిన మహిళామణులను అతిథులుగా ఆహ్వానించే పద్దతి చాలా కాలంగా ఉంది. శాఖ కార్యపద్దతి అయిన ‘వ్యక్తినిర్మాణం’ రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌, ‌రాష్ట్ర సేవిక సమితులలో వేరువేరుగా సాగుతుంది. మిగిలిన కార్యక్రమాలన్నీ స్త్రీ, పురుషులు కలిసి నిర్వహిస్తారు. భారతీయ సాంప్రదాయంలో ఈ పరస్పర పూరకమైన దృష్టి మొదటి నుండి ఉంది. కానీ ఈ సంప్రదాయం క్రమంగా మరుగున పడి ‘మాతృశక్తి’కి అనేక అవరోధాలు, పరిమితులు ఏర్పడ్డాయి. నిరంతరాయంగా సాగిన విదేశీ దాడుల మూలంగా కొన్ని అనుచిత పద్దతులకు సమ్మతి ఏర్పడి అవి స్థిరపడ్డాయి. జాతీయ పునరుజ్జీవన ప్రారంభం నుండి మన జాతీయ నాయకులు మహిళలపై విధించిన ఈ పరిమితులు, ఆంక్షలను పూర్తిగా తిరస్కరించారు. మహిళా శక్తికి ‘దైవత్వాన్ని’ ఆపాదించి వారిని అక్కడికే పరిమితం చేయడం ఒక ధోరణి అయితే, వారిని కేవలం ఇంటికే పరిమితం చేయడం మరొక ధోరణి. ఈ రెండింటినీ మన నాయకులు తిరస్కరించారు. దానికి బదులు అభివృద్ధి, సాధికారతల కోసం అనుసరించవలసిన విధానాలు, పద్దతులపై దృష్టి పెట్టారు. నిర్ణయాలు తీసుకునే పక్రియలో మహిళలకు కూడా సమాన భాగం కల్పించాలని కోరుకున్నారు.

జాతీయ జాగృతిని ఇప్పుడు సాధారణ ప్రజానీకం కూడా అనుభూతి చెందుతున్నారు. మన ప్రియతమ దేశమైన భారత్‌ అన్ని రంగాలలో చెప్పుకోదగిన ప్రగతిని సాధించి, అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకోవడం మనందరికీ ఆనందాన్ని కలిగించే విషయం. స్వావలంబన సాధించడానికి అవసరమైన విధానాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రపంచ దేశాల్లో భారత్‌ ‌హోదా, ప్రాధాన్యత పెరిగాయి. రక్షణ రంగంలో పూర్తి స్వావలంబన సాధించే విధంగా సాగుతు న్నాము. కరోనా మహమ్మారితో పోరు తరువాత దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకుని అంతకు ముందున్న పటిష్టమైన స్థితికి చేరుకుంటున్నది. ‘కర్తవ్య పథ్‌’ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్ధిక, సాంకేతిక, సాంస్కృతిక పునాదులపై ఆధునిక భారతపు విజయయాత్ర గురించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం మీరు కూడా వినేఉంటారు. ప్రభుత్వపు ఈ స్పష్టమైన దృష్టి అభినందనీయమైనది. అయితే మనమంతా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఈ దిశగా అడుగులు వేయాలి. ‘ఆత్మ నిర్భరత’ మార్గంలో ముందుకు వెళ్లాలంటే జాతిగా మన మౌలిక విలువలు, ఆలోచనలను అర్ధం చేసుకోవాలి.

మన ప్రభుత్వం, పాలనాయంత్రాంగం, ప్రజలు ఈ విలువలను పూర్తిగా అర్ధంచేసుకుని ఆచరించడం చాలా అవసరం. వివిధ సందర్భాలలో పరస్పర విశ్వాసం, సమన్వయమే ప్రధానమవు తాయి. ఆలోచనలో స్పష్టత, లక్ష్యం పట్ల ఏకాభి ప్రాయం, నిష్ట, సంస్కరణకు సిద్ధంగా ఉండడం, పొరపాట్లు జరగకుండా ముందుజాగ్రత్త వహించడం వంటివి చాలా అవసరం. ప్రభుత్వం, పాలనయంత్రాంగం, వివిధ రాజకీయ పార్టీలు, సమాజంలోని వివిధ వర్గాలు భేదాలను పక్కకు పెట్టి కర్తవ్య నిర్వహణ కోసం కలిసికట్టుగా ముందుకు సాగినప్పుడే త్వరితగతిన అభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రభుత్వం, పాలనాయంత్రాంగం, రాజకీయ నాయకులు తమ బాధ్యతలు నిర్వర్తించినట్లే సమాజంలో అందరూ తమతమ బాధ్యతలు నెరవేర్చాలి.

జాతీయ పునరుజ్జీవన పక్రియ సఫలం కావాలంటే అవరోధాలను దాటగలగాలి. ఆ అవరోధాలలో మొదటిది, గతంలో చిక్కుకు పోవడం. వర్తమాన పరిస్థితులకు అనుకూలమైన, సరిపోయిన కొత్త పద్దతులను రూపొందించుకోవాలి. అదేసమయంలో మన అస్తిత్వాన్ని, సంస్కృతిని, జీవన విలువలను తెలియజేసే శాశ్వత విలువలను కాపాడుకోవాలి. అవి కనుమరుగు కాకుండా వాటిని నిరంతరం ఆచరించాలి.

ఇక రెండవ రకం అవరోధాన్ని ఈ దేశపు సమైక్యత, అభివృద్ధులను నాశనం చేయాలనుకునే శక్తులు సృష్టిస్తాయి. తప్పుడు ప్రచారం ద్వారా అసత్య భావాలను వ్యాప్తిచేయడం, హింసను ప్రేరేపించడం, భయోత్పాతాలు సృష్టించడం, ఘర్షణ, సామాజిక అశాంతిని ప్రోత్సహించడం వంటివి ఈ శక్తులు అనుసరించే వ్యూహాలు. అటువంటి శక్తులను మట్టికరిపించడానికి ప్రభుత్వం, పాలనా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలకు మనం సహకారం అందించాలి. సమాజం ఈ విధంగా బలమైన, సక్రియమైన సహకారాన్ని అందించినప్పుడే భద్రత, సమైక్యత సాధ్యపడతాయి.

  మాతృభాషలోనే విద్య అనేది చాలా మంచి, సహేతుకమైన విధానం. నూతన విద్యా విధానం (చీజు)లో ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వం మాతృభాషా విధానాన్ని అమలు చేయాలని కోరే ముందు అసలు మనం కనీసం మన మాతృభాషలోనైనా సంతకం చేస్తున్నామా? మన ఇళ్లపై పెట్టుకుంటున్న పేర్లు మాతృభాషలోనే ఉంటున్నాయా? ఇళ్ళలో జరిగే శుభకార్యాలకు పంచే ఆహ్వానపత్రాలు మన భాషలో ఉంటున్నాయా? అని చూసుకోవాలి.

వైద్య రంగంలో కూడా ప్రభుత్వం మనకు అందుబాటులో ఉన్న అన్ని వైద్య విధానాలను ఒకచోట చేర్చి, ప్రజలకు చవకైనా వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని సంఘం కోరుతోంది. యోగా, ఇతర వ్యాయామ పద్దతులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం తన పాత్రను కొనసాగించాలి. ప్రజలు తమ పాత పద్దతులు, అలవాట్లను వదిలిపెట్టకపోతే ఎలాంటి విధానాన్ని, వ్యవస్థను ప్రవేశపెట్టినా ప్రయోజనం ఏమిటి?

మన రాజ్యాంగంలో రాజకీయ, ఆర్ధిక సమానత్వానికి దారులు పడ్డాయి. కానీ సామాజిక సమానత్వం లేకుండా నిజమైన, శాశ్వతమైన మార్పు సాధ్యం కాదని డా. బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌మనను హెచ్చరించారు. సామాజిక అసమానతకు మూలం మన మనసుల్లో, ఆలోచనల్లో, అలవాట్లలో ఉంది. అందరికీ దేవాలయ ప్రవేశం, నీరు పట్టుకునే ప్రదేశం, ఒకే శ్మశానం వంటివి సాధ్యపడనంత వరకు సామాజిక సమానత్వం కలగానే మిగిలి పోతుంది.

జనాభా విధానాన్ని రూపొందించుకోవాలి. ఆ విధానం అందరికీ వర్తించేదై ఉండాలి. ఆ విధానాన్ని తూచతప్పక పాటించాలనే సంసిద్ధతను, ఆలోచనను కలిగించడానికి పెద్ద ఎత్తున అవ గాహన కార్యక్రమాలను నిర్వహించాలి. అప్పుడు మాత్రమే జనాభా నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఫలితాన్నిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *