స్వాతంత్య్రవీరులను స్మరించుకుందాం

విదేశీ పాలన నుండి విముక్తి పొంది, స్వాతం త్య్రాన్ని సాధించిన చారిత్రాత్మక పర్వాన్ని నేడు భారత్‌ ‌మరోసారి గుర్తుచేసుకుంటోంది. ఈ వేడుకల సందర్భంగా ఈ స్వాతంత్య్రాన్ని సంపాదించుకునేందుకు 4శతాబ్దాలపాటు సాగించిన నిరంతర సంఘర్షణ, చేసిన బలిదానాల గురించి గుర్తుచేసుకోవడం కూడా సహజం.

భారత్‌ ఆత్మలో యుగయుగాలుగా ఉన్న ‘స్వ’ అనే భావం సంపూర్ణ శక్తితో ఒక్కసారిగా ప్రకటితమైంది. విదేశీ శక్తులను అడుగడుగునా ఎదుర్కోవలసి వచ్చింది. ఈ శక్తులు దేశపు ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాయి. స్వావలంబనతో కూడిన గ్రామీణ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. ఇలా అన్ని రంగాల్లో, అన్ని వైపులనుంచి విదేశీ శక్తుల దాడి జరిగింది. ఆ దాడిని భారత్‌ ఎదుర్కొంది.

ఒకవైపు దేశంలోని వివిధ సంస్థానాలు, రాజ్యాలు ఆంగ్లేయ దుష్టపాలనను, దమననీతిని ఎదుర్కొంటే, మరోవైపు తమ సహజమైన, సరళమైన జీవన శైలిపై, జీవన విలువలపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా వివిధ గిరిజన జాతులు పోరాటం సాగించాయి. తమ జీవన మూల్యాలను కాపాడుకునేందుకు వాళ్ళు చేసిన పోరాటాన్ని ఆంగ్లేయులు అత్యంత క్రూరంగా అణచివేశారు. దారుణ మారణకాండకు పాల్పడ్డారు. అయినా గిరిజనులు తమ పోరాటం ఆపలేదు. 1857 ప్రధమ స్వతంత్ర సంగ్రామం ఈ పోరాట ఫలితమే. ఇందులో లక్షలాది మంది ప్రాణాలు అర్పించారు.

భారతీయ విద్యావ్యవస్థను నాశనం చేయడానికి విదేశీయులు చేసిన ప్రయత్నాలను విఫలం చేయడం కోసం కాశీ విశ్వవిద్యాలయం, శాంతినికేతన్‌, ‌గుజరాత్‌ ‌విద్యాపీఠం, తిరువన్వెల్లిలో ఎండిటి హిందూ కాలేజీ, దక్కన్‌ ఎడ్యుకేషనల్‌ ‌సొసైటీ, గురుకుల్‌ ‌కంగడి వంటి అనేక సంస్థలు ఉద్భవించాయి, విద్యార్ధుల్లో దేశభక్తి భావాన్ని జాగృతం చేశాయి. జగదీష్‌ ‌చంద్ర బోస్‌, ‌ప్రఫుల్ల చంద్ర రే వంటి శాస్త్రవేత్తలు తమ ప్రతిభ ద్వారా దేశ ప్రజానీకంలో స్వాభిమాన భావాన్ని పెంపొందించారు. అలాగే నందలాల్‌ ‌బోస్‌, అవనీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌, ‌దాదాసాహేబ్‌ ‌ఫాల్కే వంటి కళాకారులు, మాఖన్‌ ‌లాల్‌ ‌వంటి జర్నలిస్ట్‌లు జాతీయభావ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. మహర్షి అరవిందులు, మహర్షి దయానందులు, స్వామి వివేకానంద వంటి వారు ప్రజల్లో ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించి దారి చూపారు.

బెంగాల్‌లో రాజ్‌ ‌నారాయణ్‌ ‌బోస్‌ ‌ద్వారా హిందూ మేళాలు, మహారాష్ట్రలో లోకమాన్య బాలగంగాధర తిలక్‌ ‌ద్వారా గణేశ, శివాజీ ఉత్సవాలు ఈ దేశ సాంస్కృతిక మూలాలను బలోపేతం చేశాయి. అలాగే వెనుకబడిన, బలహీన వర్గాలలో విద్యా వ్యాప్తికి, సామాజిక ఉన్నతికి అనేకమంది సంస్కర్తలు కృషి చేశారు.

సమాజంలోని అన్నీ రంగాలపై మహాత్మా గాంధీ ప్రభావం ఉంది. విదేశాల్లో ఉంటూ భారత స్వాతంత్య్ర సంగ్రామానికి తోడ్పడిన శ్యాంజీ కృష్ణవర్మ, లాలా హరదయాల్‌, ‌మాడమ్‌ ‌కామా వంటి వారు కూడా గుర్తుచేసుకోవలసినవారే. లండన్‌లో ఇండియా హౌస్‌ ‌భారత స్వాతంత్య్ర సంగ్రామ కార్యకలాపాలకు కేంద్రమయింది. స్వాతంత్య్రవీర సావర్కర్‌ ‌వ్రాసిన 1857 ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామ గాధ భారతీయ విప్లవ కారులకు ఎంతో ప్రేరణనిచ్చింది. స్వయంగా భగత్‌ ‌సింగ్‌ ఈ ‌పుస్తకాన్ని ప్రచురించి వేలాది కాపీలు పంచాడంటే దీని ప్రభావం ఎలా ఉండేదో అర్ధమవుతుంది.

దేశమంతటా ఉన్న 4 వందలకు పైగా విప్లవ సంస్థల ద్వారా వేలాదిమంది విప్లవకారులు దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడారు. బెంగాల్‌లోని అటువంటి విప్లవ సంస్థ అనుశీలన సమితిలో పనిచేసిన డా. హెడ్గేవార్‌ ఆ ‌తరువాత లోకమాన్య తిలక్‌ ‌ప్రేరణతో కాంగ్రెస్‌లో చేరారు. మధ్యప్రాంతపు కార్యదర్శిగా కూడా ఎంపికయ్యారు. 1920లో నాగపుర్‌ ‌లో జరిగిన కాంగ్రెస్‌ ‌సమావేశాల యోజన సమితి ప్రముఖ్‌గా కూడా వారు ఉన్నారు. ఆ సమావేశాల్లోనే పూర్ణ స్వరాజ్యం కోరుతూ తీర్మానం ఆమోదించాలని వారు సలహా, సూచన ఇచ్చినా అందుకు అప్పటి కాంగ్రెస్‌ ‌నాయకత్వం సిద్ధపడలేదు. చివరికి ఆ తరువాత ఎనిమిది సంవత్సరాలకు కాంగ్రెస్‌ ఆ ‌తీర్మానాన్ని ఆమోదించింది.

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోనే నేతాజీ సుభాష్‌ ‌చంద్ర బోస్‌ ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌కు నేతృత్వం వహించారు. అప్పుడే మొదటి స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ఈశాన్య భారతంలో కొన్ని ప్రాంతాలను బ్రిటిష్‌ ‌పాలన నుండి విముక్తం చేసింది కూడా. ఎర్ర కోటపై ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌సైనికులపై జరిగిన విచారణ దేశ ప్రజానీకానికి ఆగ్రహం కలిగించింది. దానితోపాటు నౌకాదళంలో భారతీయ సైనికుల తిరుగుబాటు కూడా బ్రిటిష్‌ ‌వారిని బెంబేలెత్తించింది. ఈ దేశాన్ని వదిలి పోవలసిన పరిస్థితి వారికి కల్పించింది.

స్వతంత్ర భానుడు ఉదయించాడుకానీ ఆ సూర్యుడిని విభజన అనే గ్రహణం పట్టుకుంది. అలాంటి క్లిష్ట, కష్ట పరిస్థితుల్లో కూడా భారతీయులు ధైర్యాన్ని కోల్పోలేదు.

‘భారతదేశాన్ని జాగృతపరచాలి. అది ఈ దేశం కోసం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం కోసం, సర్వ మానవాళి కోసం’ అని మహర్షి అరవిందులు అన్నారు. ఆయన మాటలు నిజమయ్యాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామం అనేక దేశాలు కూడా స్వతంత్ర పోరాటాన్ని సాగించడానికి ప్రేరణ అయింది. చివరికి సూర్యుడు అస్తమించని బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం పూర్తిగా కనుమరుగయింది. అన్నీ దేశాలు స్వతంత్రమయ్యాయి.

భారత్‌ ‌ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. నేడు అది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సఫల ప్రజాస్వామ్య వ్యవస్థ. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినవారే ఆ తరువాత దేశ రాజ్యాంగం రూపొందించడంలో కూడా ప్రముఖ పాత్ర వహించారు. అందువల్లనే భారత సాంస్కృతిక పరంపరను గుర్తుచేస్తూ రాజ్యాంగపు మొదటి ప్రతిలో రామరాజ్యానికి చెందిన చిత్రాలు, వ్యాసుడు, బుద్ధుడు, జైనుడు మొదలైన వారి చిత్రాలు కూడా చేర్చారు.

‘స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు’ వేలాది మంది స్వాతంత్య్ర వీరులకు స్మృత్యంజలి కావాలి. వారి వల్లనే మనం ఈనాడు ప్రపంచంలో ప్రముఖ ప్రజాస్వామ్య దేశంగా నిలబడుతున్నాం. దేశ స్వతంత్ర సాధనలో పాలుపంచుకున్న వేలాదిమంది వ్యక్తులు, సంస్థలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అప్పుడే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్చా, స్వాతంత్య్రాల వెనుక ఎంతటి త్యాగాలు, పోరాటం ఉన్నాయో భావితరాలకు అర్ధమవుతుంది, తెలుస్తుంది.

– దత్తాత్రేయ హోసబలే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సర్‌ ‌కార్యవాహ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *