వివాహ వ్యవస్థను కాపాడుకుందాం
మనదేశం సనాతనమైనది. మన భారతీ యతలో ప్రకృతి ఆరాధన చెప్పుకోదగినది. దానికి విరుద్ధమైన ఏ కార్యాన్ని చేయకూడదనే భావన అందరిలో ఉంటుంది. ఒకవేళ అలా చేస్తే అది వికృతి, ప్రకృతి హననం, వినాశనానికి దారి తీస్తుంది. అటువంటి పనిని పాపంగా భారతీయులు భావిస్తారు. అందుకనే మన సనాతన సంప్రదా యంలో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా షోడశ సంస్కారాలను మన పెద్దలు ఏర్పరి చారు. ఇక స్త్రీ, పురుష లింగ బేధం ఆధారంగా వారు చేయవలసిన ఉపచారాలు, ఆచరించాల్సిన ఆచారాలు, వ్యవహారాలు శాస్త్రాలు ఎన్నడో తెలియజేశాయి. వాటిల్లో వివాహం అనేది ఒకటి.
మనదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా దృఢమైన, పటిష్టమైన వైవాహిక వ్యవస్థ పరిఢవిల్లుతూ యావత్ ప్రపంచానికే తలమాని కంగా నిలిచింది. శ్రీరాముడు-సీత, శివపార్వతులు, అత్రి అనసూయలు, వశిష్ట-అరుంధతి దంపతులు వేద శాస్త్రాల ద్వారా నిర్వహించబడిన వైవాహిక వ్యవస్థను ఆచరించి లోకానికి ఆదర్శ దంపతులుగా నిలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వైవాహిక వ్యవస్థను హిందూ జీవనంలో ఒకటిగా చేస్తూ వారిని ఆదర్శవంతులుగా స్వీకరిస్తూ వివాహాలు జరుగుతున్నాయి. దానివల్ల కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండి, సమాజంలో ఎలాంటి చీలికలు లేకుండా ఉంటోంది. కానీ ప్రస్తుతం పాశ్చాత్య జీవన ఒరవడి భారతీయ జీవితాలను ప్రభావితం చేస్తుంది. అందులోనూ నకారత్మకంగా ఎక్కువగా ఉంటోంది. అటువంటి నకరాత్మక వికృతుల్లో నుంచి వచ్చింది స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహం అనే వివాదం.
విదేశాల్లో ఇప్పటికే ఈ వికృతి అమలులో ఉంది. ఆ దేశాల్లో పునరుత్పత్తి, మానవ సంబంధాలు కేవలం శారీరక అవసరాలు మాత్రమే అననీ, కామ వాంఛలు తీర్చుకునే భావోద్వేగ సాధనాలుగా వారు భావిస్తారు. కానీ మన భారతీయులు వివాహబంధం అనేది ఓ సృష్టి కార్యంగా భావిస్తారు, ఎంతో పవిత్రంగా చూస్తారు. ఇప్పుడు ఆ దేశాల్లో ఉన్న ఆచారాన్ని మనదేశంలో పెట్టడం ద్వారా మన వైవాహిక వ్యవస్థకి అర్థంలేని పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో కొందరు మన దేశ సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, ప్రకృతి నియమాల పట్ల కనీస అవగాహన లేకుండా స్వలింగ సంపర్కం, వివాహాల గురించి చేస్తున్న వ్యాఖ్యలు శోచనీయం.
ఇప్పటికే పాశ్చాత్య పోకడల కారణంగా క్రమక్రమంగా మన దేశంలో కూడా వైవాహిక వ్యవస్థ నెమ్మదిగా బీటలు పడుతోందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటితరానికి వివాహప్రాశస్థ్యం, స్త్రిపురుష సంబంధాల యొక్క ఔన్నత్యం తెలియకపోవడంతో పాటూ, అంతర్జాల ప్రభావం, మన పురాణ, ఇతిహాసాలపట్ల అవగాహన లేకపోవడం ఇలాంటి కారణాల వల్ల అతి పవిత్రమైన, పటిష్టమైన మన వైవాహిక వ్యవస్థలో బీటలు పడుతున్నాయి. ఇప్పుడు కనుక స్వలింగ వివాహాలు లేదా అటువంటి వికృతులను అనుమతిస్తే వచ్చే దశాబ్ద కాలంలో భారతీయ సాంస్కృతిక, సామాజిక, మానసిక, భౌతిక రూపాలు పూర్తిగా అంతరించి పోయి సంకర జాతులు, కృత్రిమ జననాలు పుట్టుకొచ్చి ప్రకృతి ప్రకోపం భావి తరాలు చవిచూడాల్సి వస్తుందని గ్రహించాలి. ఈ వికృత చేష్టలను హక్కుల పేరుతో సమర్ధిస్తూ చేస్తున్న సాంస్కృతిక హననం మనం నిరోధించాలి. భారతీయ అర్ష ధర్మాన్ని పరిరక్షించి భావి తరాలకు అందించాలసిన బాధ్యత మనపై ఉంది.
– లతాకమలం