ఇక వ్యవసాయంలోనూ డ్వాక్రా మహిళలకు రాయితీలు.. ఉపాధితో పాటు దిగుబడి
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇప్పటి వరకు కొన్నింటి విషయాల్లోనే రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు చిన్న చిన్న ఉపాధి కార్యక్రమాలు, వ్యాపారం, పిండి వంటలు, ఇళ్లకు ఉపయోగపడే ఉపకరణాలు, ముఖ్యంగా కుట్టు మిషన్లు, కుట్టు శిక్షణ.. ఇలా వీటికి మాత్రమే రుణాలివ్వడం జరుగుతోంది. కానీ… తాజాగా ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయానికి వచ్చింది. వీటన్నింటితో పాటూ వ్యవసాయంలోనూ మహిళలకు తోడ్పాటునివ్వాలని నిర్ణయించింది. మహిళల్లో సాగుపై ఆసక్తి వున్న వారిని గుర్తించి, కూరగాయలు, పూల సాగు చేయించాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. సెర్ఫ్ ద్వారా ఆయా పంటలకు అవసరమైన షేడ్ నెట్స్ ను కూడా రాయితీపై ఇవ్వాలని అనుకుంది. ఇలా చేయడం ద్వారా డ్వాక్రా మహిళలకు మరింత ఊతమివ్వాలని యోచిస్తోంది.
అయితే.. ఈ పథకం అమలుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. జిల్లాకి 450 మందిని గుర్తించారు. అందులో మొదటగా 78 మందికి ఈ యూనిట్లు ఇవ్వనున్నారు. అలాగే సాగుకు అవసరమైన షేడ్ నెట్లను 50 శాతం రాయితీతో ఇస్తారు. ఆదాయం పరిశీలించిన తర్వాత రెండో విడతలో మరో 250 మందికి అవకాశం ఇస్తున్నారు.
అయితే మహిళా రైతులకు షేడ్ నెట్ విధానంలో సాగులో మెళకువులు కూడా నేర్పిస్తారు. ఈ మేరకు ప్రైవేట్ ఏజెన్సీతో కూడా ఒప్పందాలు చేసుకుంది. ఈ సిబ్బందే ఈ మహిళా రైతులను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. సూచనలు కూడా ఇస్తారు. ఇవన్నీ కాదు… పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ సదుపాయం కూడా ఈ సంస్థే నెత్తినెట్టుకుంటుంది. కేవలం ప్రధాన పంటలే కాకుండా ఉద్యాన వన పంటలపై కూడా ఇదే విధంగా ఇవ్వనున్నారు. యూనిట్లు మంజూరైన వారికి రాయితీ రుణాలు మంజూరు కూడా చేస్తారని అధికారులు తెలిపారు.