వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

వక్ఫ్ సవరణ బిల్లును గురువారం లోక్‌సభ ‘అనుకూలంగా’ (అవును) 288 ఓట్లతో, ‘వ్యతిరేకంగా’ (లేదు) 232 ఓట్లతో ఆమోదించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు బుధవారం (ఏప్రిల్ 2) లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025ను ప్రవేశపెట్టగా 12 గంటల చర్చ అనంతరం ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి.

ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల పనితీరును మెరుగుపరచడం, సంక్లిష్టతలను పరిష్కరించడం, పారదర్శకతను నిర్ధారించడం, సాంకేతికత ఆధారిత నిర్వహణను ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. గురువారం రాజ్యసభలో ఈ బిల్లు చర్చకు రానుంది.జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలించి తిరిగి రూపొందించిన బిల్లును ప్రవేశపెట్టిన రిజిజు, ఈ చట్టం మతంతో సంబంధం లేదని, ఆస్తులతో మాత్రమే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025పై దాదాపు 12 గంటల పాటు జరిగిన చర్చకు సమాధానమిస్తూ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిగా ఉన్న రిజిజు, పార్సీల వంటి చిన్న చిన్న మైనారిటీ వర్గాలు కూడా భారతదేశంలో సురక్షితంగా ఉన్నాయని, ఇక్కడి మైనారిటీలందరూ గర్వంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.
“భారతదేశంలో మైనారిటీలు సురక్షితంగా లేరని కొందరు సభ్యులు అన్నారు. ఈ ప్రకటన పూర్తిగా తప్పు. మైనారిటీలకు భారతదేశం కంటే సురక్షితమైన ప్రదేశం మరొకటి లేదు. నేను కూడా మైనారిటీని, మనమందరం ఇక్కడ ఎటువంటి భయం లేకుండా గర్వంతో జీవిస్తున్నాము” అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ వక్ఫ్ సవరణ బిల్లును “రాజ్యాంగ విరుద్ధం” అని పేర్కొనడం పట్ల అభ్యంతరం తెలిపారు. వక్ఫ్ ఆస్తికి సంబంధించిన చట్టం దశాబ్దాలుగా ఉనికిలో ఉందని, కోర్టులు దానిని కొట్టివేయలేదని, అలాంటి పదాలను తేలికగా ఉపయోగించరాదని హితవు చెప్పారు.
లోక్‌సభలో మాట్లాడుతూ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, “బిల్లుపై తమ అభిప్రాయాలను ఉంచుకున్నందుకు అందరు నాయకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను… కొంతమంది నాయకులు బిల్లు రాజ్యాంగ విరుద్ధమని చెబుతున్నారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని వారు ఎలా చెప్పగలరని నేను వారిని అడగాలనుకుంటున్నాను. అది రాజ్యాంగ విరుద్ధమైతే, కోర్టు దానిని ఎందుకు కొట్టివేయలేదు?… రాజ్యాంగ విరుద్ధం వంటి పదాలను ఉపయోగించకూడదు… ప్రతిపక్షాలు పేర్కొన్నట్లుగా బిల్లు రాజ్యాంగానికి విరుద్ధం కాదు… మనం ‘రాజ్యాంగబద్ధం’, ‘రాజ్యాంగ విరుద్ధం’ అనే పదాలను అంత తేలికగా ఉపయోగించకూడదు” అని సూచించారు.
వక్ఫ్‌ బోర్డులో ముస్లింయేతరులను నియమించే ఉద్దేశం లేదని కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌ షా అంతకు ముందు చర్చ సందర్భంగా స్పష్టం చేశారు. వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లులో అలాంటి నిబంధనేది లేదని తేల్చి చెప్పారు. వక్ఫ్‌ బోర్డులో ముస్లింయేతరులను నియమిస్తారనే అసత్య ప్రచారం ద్వారా ముస్లింలను రెచ్చగొడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ముస్లింల మతపరమైన వ్యవహారాలతోపాటు విరాళంగా ఇచ్చిన ఆస్తిలో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. 2013లో యూపీఏ ప్రభుత్వం వక్ఫ్‌ చట్టాన్ని సవరించకుంటే ఇప్పుడు ఈ బిల్లు తేవాల్సిన అవసరం వచ్చేదే కాదని అమిత్‌ షా తెలిపారు.
“దేశంలోని ముస్లింలకు చెబుతున్నా- వక్ఫ్‌ బోర్డులో ఒక్క ముస్లింయేతరుడు కూడా ఉండడు. ఈ చట్టంలో అలాంటి నిబంధనేది లేదు. వక్ఫ్‌ బోర్డు పనేంటి? వక్ఫ్‌ సంపదను అమ్ముకుని తినేవారికి పట్టుకోవాలి. వక్ఫ్‌ పేరుతో ఆస్తులను వందల ఏళ్లు పావులకు కిరాయికి ఇచ్చినవారిని పట్టుకోవాలి. వక్ఫ్‌ ఆదాయం తగ్గుతూ వస్తోంది. వాటిద్వారా మైనార్టీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి. ఇస్లాం ధార్మిక సంస్థలను బలోపేతం చేయాలి” అని అమిత్ షా తెలిపారు.
కాగా, ఓ మతానికి సంబంధించిన వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉప నేత గౌరవ్‌ గొగోయ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ తరఫున వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుపై మాట్లాడిన ఆయన వక్ఫ్‌ బోర్డు భూములపై కేంద్ర ప్రభుత్వం కన్ను వేసిందని విమర్శించారు. వక్ఫ్‌ భూముల తర్వాత ఇతర మైనార్టీల ఆస్తులపై ప్రభుత్వం గురిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత వక్ఫ్‌ చట్టంపై అనుమానాలు రేకెత్తించటమే ప్రభుత్వ లక్ష్యమని గౌరవ్‌ గొగోయ్‌ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *