”భారతీయతా భాసురం” జగద్గురు ఆదిశంకరులు

విషమవిషయమార్గే గచ్ఛతోऽనచ్ఛ బుద్ధేః
ప్రతి పదమభిఘాతో మృత్యురప్యేష విద్ధి|
హితసుజనగురూక్త్యా గచ్చతస్స్వస్య యుక్త్యా
ప్రభవతి ఫలసిద్ధిస్సత్యమిత్యేవ విద్ధి||

కల్మష బుద్ధితో క్రూరవిషయమార్గాల్లో వెళుతుండే వాడికి ఈ మృత్యువు ప్రతి అడుగులోనూ దెబ్బకొడుతూంటుందని తెలుసుకో. హితులు, సుజనులు,‌ గురువులు చెప్పిన దానివల్లా, సొంత యుక్తివల్లా వెళ్లేవాళ్లకు ఫల‌ప్రాప్తి అవుతోంది. దీన్నే సత్యంగా తెలుసుకో. ‘ఆది శంకరచార్యులు తమ వివేకచూడామణి 83వ శ్లోకంలో ఈ అద్భుతమైన వ్యక్తీకరణను చేశారు. ఎంతో గొప్పగా చెప్పారు ఆది శంకరాచార్య. తత్త్వాన్నీ , సత్వాన్నీ , సత్యాన్నీ శంకురులు చెప్పిన స్థాయిలో మఱెవ్వరూ చెప్పలేదు. శంకరులు‌ చెప్పినంత‌‌ కవితాత్మకంగా మఱెవరూ చెప్పలేదు.

‘మన జాతి గురువు’ ఆదిశంకరాచార్య. ‘గురు‌’ అన్నది‌ రెండు‌ పదాల కలయిక.‌ “గు”‌అంటే చీకటి. ” రు” అంటే‌ కాంతి. అజ్ఞానపు చీకటిని నిర్మూలించగలిగేది గురువు. కాంతి ప్రతి ఒక్కరికీ తొలి గురువు.‌ కాంతి లేకపోతే మనకు ఏదీ తెలియరాదు. “తమ‌సోమా‌ జ్యోతిర్గమయ” అని అన్నది అందుకే. గురువులు కాంతినిస్తారు.
వ్యాసుడు‌ మన నేలపై తొలి గురువు. ఆదిశంకరాచార్య మహోన్నతమైన, అసదృమైన గురువు. ఒక దశలో‌ ఆధ్యాత్మిక, సామాజిక జ్యోతి ఆదిశంకరాచార్య గురువై ఉండకపోయుంటే వైదిక,‌ సనాతన జాతి లేకుండా పోయుండేది. భారతప్రదేశానికి ప్రకృతి ఉండేది కాదు.

“శంకరుల వంటి మేధ కావాలి‌” అని అన్నారు స్వామి వివేకానంద. అత్యున్నతమైన మేధతో, అనన్యమైన నైజంతో తనకు, తాను అన్నదే లేకుండా బతుకే ఒక పయనంగా, మనుగడను మట్టికి అంకితం చేస్తూ తత్త్వంతో, సత్వంతో సత్యం కోసం సత్యంగా సాగారు శంకరులు. “స్వచ్ఛమైన తాత్త్వికత దృష్ట్యా భారత భూమిపై భగవద్విషయక పరిగణలకు అతీతంగా ఆది శంకరాచార్యుల సిద్ధాంతం అతి ముఖ్యమైంది (లేదా అవసరమైనది), మనోహరమైంది. వారి సిద్ధాంతాలకు వ్యతిరేకమైన వేదాంత ధోరణులూ, సంప్రదాయాలూ వారి సిద్ధాంతంలోని సాహసోపేతమైన గాంభీర్యానికి, విచారణా సూక్ష్మతకు సాటిరావు” అని భారతీయ తత్త్వశాస్త్ర పరిశీలకులైన జర్మనీ దేశపు జార్జ్ టిబో (George Thibaut) ఆది శంకరాచార్య గుఱించి అన్నారు.

ఈ‌ వ్యావహారిక‌‌ శకానికి పూర్వం (BCE) 509లో శంకరులు పుట్టారు అని ప్రధానమైన శంకర మఠాల గురు పరంపర ద్వారానూ, శంకరాచార్యులు స్థాపించిన పీఠాల చరిత్ర ద్వారానూ, సరైన అధ్యయనం ద్వారానూ తెలియవస్తోంది. వారి కాలంలో సనాతన ధర్మానికీ, భారత ప్రదేశానికీ హిందూ పదం ఆపాదించబడలేదు. అందుకే వారి రచనలలో ఎక్కడా హిందూ అన్న పదం మనకు కనిపించదు.‌ మనం చదివినట్లుగా వారి జననం సామాన్య శకం (CE) 788 అయి ఉంటే అప్పటికి హిందూ పదం చలామణిలోకి వచ్చింది కాబట్టి వారి రచనల్లో ఎక్కడైనా హిందూ పదం కనిపించి ఉందేది. 6వ శతాబ్దికి చెందిన న్యాయ‌ సిద్ధాంత తాత్త్వికుడు ఉద్యోతకార. శంకరులు ఈయన ప్రసక్తి చెయ్యలేదు. 5వ శతాబ్దికి చెందిన ప్రముఖ బౌద్ధ‌ పండితుడు దిన్నాగ. దిన్నాగ ప్రసక్తి కూడా శంకరులు చెయ్యలేదు. అంటే శంకరుల కాలం వీళ్లకు పూర్వంది. సామాన్య శకం 700 -750 కాలం నాటి సంస్కృత నాటకకర్త భవభూతి శంకరుల వివర్త వాద ప్రసక్తి చేశాడు. అంటే అప్పకి శంకరులు చాలా పూర్వం వారని తెలుస్తోంది. సామాన్య శకానికి పూర్వం 5వ శతాబ్దికి చెందిన గౌతమ‌ బుద్ధుడి ప్రసక్తి కూడా ఎక్కడా శంకరులు‌ చెయ్యలేదు. శంకరుల కాలానికి ఉన్న వివిధ‌ స్వదేశీ‌ మతాల్లో‌‌‌ బౌద్ధమతం‌ లేదు. అంటే శంకరులు బుద్ధుడి కన్నా పూర్వం వారు అన్నది కూడా స్పష్టమౌతున్నది.

ఆది శంకరాచార్య భారతావనిపై పుట్టి జీవించింది 32 సంవత్సరాలే! శంకరులు వైశాఖ శుక్ల పంచమినాడు కాలడి‌ (ప్రస్తుత కేరళ రాష్ట్రం) గ్రామంలో శివ గురువు,‌ ఆర్యాంబ దంపతులకు జన్మించారు. శంకరులు బాల్యం నుంచే అపూర్వ, అద్వితీయ వ్యక్తిత్వంతో, ధీశక్తితో ఎదిగారు. అనితరసాధ్యమైన మేధతో 16 ఏళ్లకే తమ ఇతర‌ ప్రస్థానత్రయమైన దశోపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు రాసేశారు. నిజానికి భగవద్గీతకు అంతకు ముందే భాష్యాలు ఉన్నా శంకరుల భాష్యం తరువాతే భగవద్గీత వ్యాప్తికి వచ్చింది. ప్రస్థానత్రయాన్ని శంకరులు తమ భాష్యాలతో జనబాహుళ్యంలోకి‌‌ తీసుకువచ్చారు. ఆది శంకారాచార్య వేఱు, వేఱు దేవతలపై 64 స్తోత్రాలూ, 37 ప్రకరణ గ్రంథాలూ రాసి మనకందించారు.

వక్రపు వ్యాఖ్యానాలతోనూ, వక్రపు ధోరణులతోనూ, దోష సంప్రదాయాలతోనూ సనాతన ధర్మం‌‌ అస్తవ్యస్తమైన కాలంలో ఆదిశంకరాచార్యులు వేదప్రతిపాదిత సత్యాన్ని సంస్థాపించడానికి పూనుకుని ఉద్యమించారు. కృతకృత్యులూ అయ్యారు. తాత్త్విక, సామాజిక, ఆధ్యాత్మిక చింతనలతో విశేషంగా కృషిచేశారు వారు. ఆది శంకరాచార్యులు తమ అసమాన బహుముఖ ప్రజ్ఞతో, విప్లవాత్మక ధోరణితో ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న సామాజిక,‌ సైద్ధాంతిక, మత మౌఢ్యంపై తిరుగుబాటు చేసి విజయం‌ సాధించారు. వేద ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతాన్ని మళ్లీ ప్రసరింపజేశారు,‌ ప్రవహింపజేశారు.

ఒక విస్మయకరమైన మేధావి, ఒక జ్ఞాని, ఒక పూజనీయమైన ఆచార్యుడు, ఒక భక్తుడు, ఒక కర్మ యోగి, ఒక వివేకి, ఒక పండితుడు,‌ ఒక దార్శనికుడు, ఒక సంస్కర్త‍‍, ఒక ఆధ్యాత్మిక యోగి, ఒక సిద్ధుడు‍, ఒక‌ మహాకవి. ఒక ముముక్షువు, ఒక మార్మికుడు,‌ ఒక తత్త్వవేత్త, ఒక తార్కికుడు, ఒక‌ అద్వైతి, ఒక భాష్యకారుడు, ఒక ఉద్యమకారుడు, ఒక విప్లవశీలి, ఒక సనాతన ధర్మనిర్మాత ఆది శంకరాచార్య. వారి నుడి‌ తత్త్వానికి బడి, ఆపై సత్యానికి గుడి. మనందఱికీ వారే ఒరవడి. శంకరత్వాన్ని సరిగ్గా‌‌ స్మరించుకుందాం‌‌ ఇదిగో‌‌‌ ఇలా …

“ఏవమాత్మా రణౌ ధ్యానమథనే సతతం‌‌ కృతే / ఉదితాన గతి ర్జ్వాలా సర్వాజ్ఞానేంధనం దహేత్” (ఆత్మబోధ 42వ శ్లోకం) అంటే ఆత్మే ఒక ఆరణి (నిప్పును రగిలించేందుకు ఉపయోగించే జమ్మి చెట్టు‌ కఱ్ఱ)కాగా, నిరంతర ధ్యానమే మథనం కాగా ఆందులోంచి పుట్టిన జ్వాలలో మొత్తం అజ్ఞానం అనే ఇంధనం దహించుకుపోతుంది అని అర్థం.‌ ఎంత అద్భుతంగా చెప్పారు శంకరులు? “సత్యాపి భేదాపగ్మే నాథ్ తవాహం న మామ్ కీనస్త్వమ్ / సాముద్రో హి తరంగః క్వచన్ సముద్రో న తారంగః” (విష్ణుష్టపదీ శ్లోకం 3) అంటే నేను భిన్నత్వానికి లోబడినా నాథా, నేను నీవాణ్ణి. కానీ నువ్వు నా వాడివి కాదు అన్నది‌ నిజం‌. కెరటాలు సముద్రానికి చెందినవి కావచ్చు‌. కానీ సముద్రం కెరటాలకు సంబంధించినది కాదు అని అర్థం. ఇక్కడ శంకరులు ఒక మహోన్నతమైన విషయ వివరణ చేశారు.

“స్వప్నో జాగరణేSలీకః స్వప్నేऽపి నహి జాగరః / ద్వయమేవ లయే నాస్తి లయోऽపి హ్యు భయోర్న చ”(అపరోక్షానుభూతి- శ్లోకం 57) అంటే
మెలకువలో కల లేదు. కలలో మెలకువ లేదు. ఈ‌‌ రెండూ మరణం‌(లయ)లో‌ లేవు. ఈ మరణం మెలకువలోనూ, కలలోనూ లేదు అని అర్థం.‌ అహా, అత్యున్నతమైన విషయాన్ని అసదృశంగా చెప్పారు శంకరులు!

“జ్ఞానం‌ లేకపోతే స్వేచ్ఛ లేదు. అగ్ని లేకపోతే వంట లేనట్లుగా” (ఆత్మబోధ‌- శ్లోకం 2). “విద్య అవిద్యను పోగొడుతుంది‌‌. తేజస్సు మాత్రమే అంధకారాన్ని పోగొట్టగలిగినట్టు”. (ఆత్మబోధ- శ్లోకం 3) “నీళ్లలో బుడగలు పుడతాయి. కాసేపు నీళ్లపై ఆడతాయి. ఆ తరువాత నీళ్లలోనే కలిసిపోతాయి”. (ఆత్మబోధ- శ్లోకం 8) ఈ విధమైన రచనం మనకు కవులు రూమీలోనూ, ఖలీల్ జిబ్రాన్ లోనూ కనిపిస్తుంది. “పైన ఉన్న ఊకను తీసేస్తే బియ్యపు గింజ చక్కగా తెలుస్తుంది”. (ఆత్మబోధ – శ్లోకం16) ఈ చెప్పడం ఎంత సహజంగా ఉందో? ఈ ఉపమానంలో జీవనం కనిపిస్తోంది కదూ? “దీపానికి ఇంకో దీపం అక్కర్లేదు తనే ప్రకాశిస్తుంది కాబట్టి”.(ఆత్మ‌బోధ . శ్లోకం 29) ఈ ధోరణి మనకు కవి రూమీలో కూడా కనిపిస్తుంది‌. “రోగాన్ని ఔషధం ఏ విధంగా పోగొడుతుందో ఆవిధంగా”. (ఆత్మబోధ- శ్లోకం 37) సహజమైన ఉపమ‌‌ ఇది! ఇలాంటివి కవి లావొచు లోనూ కనిపిస్తాయి. “నీళ్లలో నీళ్లు లాగా, ఆకాశంలో‌ ఆకాశం లాగా, తేజస్సులో తేజస్సులాగా” (ఆత్మబోధ- శ్లోకం 53)ఈ అనడం ఎంత గొప్పగా ఉందో కదా?‌ రూమీ, ఖలీల్ జిబ్రాన్, లావొచు వంటి కవుల్లో ఈ ధోరణి ఉంది. “పాలలో వెన్న అంతటా వ్యాపించి ఉంటుంది” (ఆత్మబోధ- శ్లోకం 59) ఇక్కడ “పచ్చిపాలలోన వెన్న పరమాత్ముడు” అని అన్నమయ్య అన్నదానికి మూలం ఇదే. “అగ్నిలో కాలుతున్న ఇనుము అగ్నిలాగానే ప్రకాశించినట్లు” (ఆత్మబోధ-‌శ్లోకం 62) ఈ చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది! ఈ స్థాయి‌‌ మాటలు‌ శంకరులు ఎన్నో అన్నారు.

“ఎవరు నీ భార్య? ఎవరు నీ కొడుకు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నువ్వెవరివి? ఎక్కణ్ణుంచి వచ్చావు? తమ్ముడూ, ఆ విషయం గుఱించి‌ ఇప్పుడు ఆలోచించు. ( 8వ శ్లోకం మోహముద్గరం‌ లేదా భజగోవిందం‌ శ్లోకాలు) కవి‌ ఖలీల్ జిబ్రాన్ “your children are not your chidren” అని అనడానికి వందల ఏళ్ల క్రితమే శంకరులు ఈ మాటలు అన్నారు. “నీ ధనం, నీ పరివారం, నీ యవ్వనం వీటితో గర్వించకు. అవి నిమిషంలో నశిస్తాయి. అవి మాయ. అది తెలుసుకుని బ్రహ్మ‌ పథంలోకి ప్రవేశించు.‌ (11వ శ్లోకం భజగోవింద‌ం‌ శ్లోకాలు) ఇలా అంటూ శంకరులు మనల్ని కదిలిస్తారు.

“ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృ కుక్షౌ స్థితం మాం
విణ్మూత్ర మేధ్య మధ్యేక్కథ యతి‌ నితరాం జాఠరో జాతవేదాః
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం”. (శివాపరాథ క్షమాపణ స్తోత్రం.‌‌ శ్లోకం 1)

అంటే మొదట్లో కర్మ అవసరం వల్ల లేదా కర్మ విస్తరణవల్ల కలుషితమై‌న తల్లి కడుపులో ఉండేవాణ్ని నేను. మలమూత్రాలు, కడుపులోని వేడి, ఇతరమైనవి ఏవైతే ఉన్నయో వాటివల్ల కలిగిన దుఃఖం, వ్యథల్ని ఇతరులు చెప్పడం ఎలా సాధ్యమౌతుంది? అని అర్థం. “గర్భంలోని శిశువు దుఃఖాన్ని , వ్యథను ఎవరు‌ చెప్పగలరు?”‌ ఈ భావన చేసిన‌‌ తొలి కవి, తాత్త్వికులు ఆది‌శంకరాచార్యులే. లావొచు , రూమీ, ఖలీల్ జిబ్రాన్, షేక్స్‌పిఅర్
వంటి కవులెవ్వరూ ఇలాంటి‌ లేదా ఈ‌ స్థాయి చింతన,‌ భావన చెయ్యలేదు. ఇలాంటి‌‌‌ రచన‌‌‌, చింతన ఇది ఒక్కటే!

“దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరలతరంగే” (గంగా స్తోత్రం – శ్లోకం 1) ఆది‌శంకరులు తమ‌ గంగా స్తోత్రంలో గంగా‌‌ నదిని “తరల‌ తరంగే‌” ‌అన్నారు. “తరలం” అంటే కదిలేది, ప్రకాశించేది,‌ అనురాగం ఉన్నది, హారం మధ్యలో ఉండే ప్రధాన రత్నం, వజ్రం అని అర్థాలు. ఒక్క మాటతో గంగా నది గుఱించి చెప్పేశారు. ఇలా ఒక్క మాటతో వస్తువుపై సరైన అవగాహన కలిగించడం ఒక మహాకవి లక్షణం. ఆ గంగా‌ నదిని (వసుధాహారం) “భూమికి‌ హారం” అన్నారు. ఇది శంకరుల భవ్య‌మైన భావుకత.

ప్రశ్నోత్తర రత్నమాలికలో అడగబడ్డ కొన్ని ప్రశ్నలకు శంకరులు ఇచ్చిన‌ జవాబులు మనకు దిశా నిర్దేశం చేస్తాయి.‌

ఏది అన్నిటికన్నా ప్రయోజనకరమైనది?
జవాబు: ధర్మం.
ఏది వాంఛింపదగింది?
జవాబు: స్వ , పర హితం.
శత్రువు ఎవరు?
జవాబు: సోమరితనం.
ఏది దుఃఖం?
జవాబు: ఉత్సాహం‌ లేకపోవడం.
ఏది‌ జాడ్యం?
జవాబు:‌ నేర్చుకున్నది ఆచరించకపోవడం.
ఏది వెలలేనిది?
జవాబు: అవసరం వచ్చినప్పుడు ఇవ్వబడేది. ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది?
జవాబు: సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత.
ఏది దానం?
జవాబు: అకాంక్ష లేనిది.
ఎవరు స్నేహితులు?
జవాబు: పాపాన్ని నివారించే వాళ్లు‌.
ఏది పాతకం?
జవాబు:‌ హింస.
ఎవరు ఎదుగుతారు?
జవాబు: వినయం ఉన్నవాళ్లు.
ఎవరు ప్రత్యక్ష దేవత?
జవాబు: అమ్మ.
వేటిని మనుషులు సంపాదించాలి?
జవాబు: విద్య, ధనం, బలం, కీర్తి , పుణ్యం.
వేటిని కాపాడుకోవాలి?
జవాబు:‌ కీర్తి , పతివ్రత, బుద్ధి.
ఎవరు శూరులు?
జవాబు: భయంతో ఉన్నవాళ్లను రక్షించేవాళ్లు.

ఆది శంకరాచార్యులు తమ సౌందర్యలహరి 75వ శ్లోకంలో తమను తాము “ద్రావిడ శిశు” అని‌ ప్రకటించుకున్నారు. ఆ శ్లోకం:

“తవ స్తన్యం మన్యే తుహినగిరి కన్యే హృదయతః
పయఃపారావారః పరివహతి సారస్వత మివ దయావత్యా దత్తం ద్రవిడశిశు‌రాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానా నుజని‌ కమనీయః కవయితా”.

శంకరులు సామాజిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అంటే వారు ఆర్యులు అయుండాలి కదా? పైగా సంస్కృతంలో రాశారు. సంస్కృతం ద్రావిడుల భాష కాదని కదా మనం‌‌ చదువుకున్నది?. ఇక్కడ ఆర్యులైన శంకరులు సంస్కృతంలో తమను తాము‌ ద్రావిడ శిశు‌‌ అని ప్రకటించుకుంటున్నారు! అదేంటి?‌ నిజమేమిటంటే, “శంకురుల కాలానికి మన దేశంలో ఆర్య‌ ద్రావిడులు అన్నది లేదు”. నిజానికి ఆర్య అన్న జాతి ఎప్పుడూ లేదు. ద్రావిడ అంటే దక్షిణభూభాగానికి సంబంధించిన అని అర్థం. ద్రావిడ అన్నది ప్రదేశాన్ని సూచించేది. ఆర్య అన్నది జాతిని సూచించేది కాదు. అర్య అన్నది గొప్పవాళ్లను సంబోధించే పదం అయ్యా , మహాశయా అన్నట్టుగా. శంకరుల ఈ శ్లోకం వల్ల ఆర్య ద్రావిడ జాతులు అన్నవి నిజం కాని అభూత కల్పనలు అని‌ తెలియవస్తోంది.‌ ఈ శ్లోకానికి‌ అర్థం: హిమగిరి పుత్రికా (పార్వతీ), నీ స్తన్యం హృదయం నుంచి పుట్టినదైన పాల కడలి. సారస్వతం (సరస్వతికి‌ సంబంధించినది) దాని నుంచే ప్రవహిస్తోందని తలుస్తున్నాను (అనుకుంటున్నాను).‌ఆ స్తన్యాన్ని ఈ ద్రవిడ శిశువు తాగి ప్రౌఢ కవులలో కమనీయమైన కవిగా పుట్టాడేమో? అద్భుతమైన భావుకతనూ, రచనా‌ సంవిధానాన్నీ‌ చూపారు ఇక్కడ శంకరులు‌. ఇవాళ ప్రపంచంలో గొప్ప కవిత్వాన్నిచ్చిన కవులుగా ఎక్కువగా చదవబడుతున్న లావొచు, రూమీ, ఖలీల్ జిబ్రాన్, షేక్స్‌పిఅర్ వంటివాళ్ల రచనా సంవిధానం పుష్కలంగా శంకరులలో తొణికిసలాడుతూంటుంది. నిజానికి‌ వీళ్లే కాదు, రవీంద్రనాథ్ టాగోర్, శ్రీశ్రీ , వంటి కవులు కూడా శంకరుల కవితా రచన పరిధిలోని వాళ్లే!

వివేక చూడామణి- ఆది‌ శంకరాచార్య కృతులలో ఈ వివేకచూడామణి అత్యున్నతమైనది. ఈ విషయంగా దీనికి సరిపోలగల రచన విశ్వంలో మఱొకటి లేదు. ప్రస్థానత్రయం తరువాత మన భూమిలో పుట్టిన మహోన్నతమైన రచన ఇది. ఆ‌‌ వివేక చూడామణి (శ్లోకం‌ 63)లో ‌”అజ్ఞాన సర్ప‌దష్టుడైన (శ్రీశ్రీ‌ బాధాసర్ప దష్టులారా,‌ అనడానికి శంకరుల‌‌ ఈ ప్రయోగమే మూలం) వాడికి బ్రహ్మజ్ఞాన ఔషధం తప్పితే వేదాల వల్ల ఏం ప్రయోజనం?, శాస్త్రాలవల్ల ఏం ప్రయోజనం?, మందుల వల్ల ఏం ప్రయోజనం?‌‌ అనీ, (శ్లోకం‌ 64లో) “మందుల పేర్లవల్ల కాదు వాటిని‌ సేవిస్తే తప్ప వ్యాధి పోదు‌‌. స్వానుభవం‌ (అపరోక్షానుభవం) తప్పితే బ్రహ్మం, పేరు (శబ్దం) వల్ల నివృత్తి కాదు” అనీ తెలియజెప్పప్పడం వారి ప్రత్యేకతనూ,‌ ఔన్నత్యాన్నీ , దార్శనికతనూ తెలియజేస్తోంది.

ఆది శంకరాచార్య ఒక సర్వజ్ఞ. “మీకు చెప్పులు కుట్టడం వచ్చా” అని అడిగినప్పుడు శంకరులు చెప్పును రెండుపాదాల మధ్యలో పెట్టకుని సూదిని‌ ముక్కు‌ పక్కభాగంలో రుద్దుకుని చెప్పు కుట్టారట‌. ఇలా సూదిని ముక్కు పక్కన రుద్దడం‌ వృత్తిగా చెప్పులు కుట్టే వాళ్లు చేస్తారు. శంకరులు మడికట్టుకుని కూర్చోలేదు. వీధిలోకి‌ వచ్చి ఉద్యమించారు. వారిని చంపాలని ప్రయత్నాలూ జరిగాయి. అయినా‌ భయపడకుండా సత్యం కోసం‌ పయనించారు, పని చేశారు. “ఆది శంకరాచార్యుల వారికి సాటిరాగల మానవ మూర్తమత్వం ఈ విశ్వంలో మఱొకటి లేనేలేదు”

సామాజిక, తాత్త్విక, భక్తి భావాలతో విశ్వస్థాయి కవి శంకరులు. భారతదేశపు తొలి సామాజిక కవి ఆది శంకరాచార్య. “శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం” అన్న తొలికవి, వైతాళికులూ ఆది శంకరాచార్య. “మాటలు శ్మశానాల వంటి నిఘంటువుల దాటి” అని శ్రీ శ్రీ అనడానికి వందల ఏళ్లకు ముందే శంకరాచార్య ఈ మాటలు అన్నారు. “వ్యాకరణం రక్షించదు, రక్షించదు” అని శంకరులు అన్నాకే శ్రీశ్రీ “వ్యాకరణాల సంకెళ్లు విడిచి” అని అన్నారు. “మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది” అని అనడానికి “భజగోవిందం భజ గోవిందం, గోవిందం భజ” అని శంకరులు అన్నదే తనకు స్ఫూర్తి అని శ్రీ శ్రీ చెప్పారు. ఒక తత్త్వవేత్త, వేదవేత్త, భాష్యకారులు, సంస్కర్త, దార్శనికులు, మార్గదర్శి అయిన ఆది శంకరాచార్య “ఒక మహోన్నతమైన కవి” అన్నది నిజం. పదను, సూటితనం, సాహసం, చొచ్చుకునిపోయే గుణం ఉన్న కవి ఆది శంకరాచార్య.

వారు రాసిన స్తోత్రాలలోనూ, అష్టకాలలోనూ, ప్రకరణాలలోనూ, భాష్యాలలోనూ, మహోన్నతమైన కవిత్వం మెరుస్తూంటుంది. ఉపమ, ఉత్ప్రేక్ష, శబ్దాలంకారాలను వారు అద్భుతంగా ప్రయోగించారు. వారి వాక్య నిర్మాణంలోని లయ, ఛందస్సుల బిగి, వాక్యాంతాలలోని ధ్వని, అద్భుతమైనవి. “సువక్షోజ కుంభాం, సుధాపూర్ణ కుంభాం, ప్రసాదావలంబాం, ప్రపుణ్యావలంబాం…” ఇది య గణాల భుజంగప్రయాత వృత్తం. ఇక్కడ 2 య గణాలను కలిపి వారు “సువక్షోజ కుంభాం , సుధా పూర్ణకుంభాం” అంటూ పాదాన్ని నడిపారు. 3వ య గణానికి శబ్దమైత్రిని పాటించి సౌందర్యాన్ని సాధించారు. బాషపై, చందస్సుపై , శయ్యపై , భావంపై పట్టు ఉన్న ఓ మహాకవి వారు.

“ఏ మనిషీ తనకు తానే చెరసాలను నిర్మించుకోడు ఆపై అందులోకి వెళ్ళడు” అనీ, “ఇసుకలో బావి తవ్వడం లాగా” అనీ శంకరులు అనడం ఖలీల్ జిబ్రాన్ ను గుర్తుకు తెస్తోంది. జిబ్రాన్ కన్నా శంకరులు ఎంతో పూర్వం వారు. “ ఉనికిలో లేని కుండ సూర్యోదయమైనా కనిపించదు” అన్న శంకరుల మాటలు చైనా కవి లావొచును తలపిస్తున్నాయి. గ్రామంలో ఉండే వ్యక్తి గ్రామంలోకి రావాలని తపించడు అడవిలో ఉన్న వ్యక్తి ఎప్పుడెప్పుడు గ్రామంలోకి వద్దామా అని తపించినట్టుగా” అనీ, “సముద్రపు కెరటం అంటాం కానీ కెరటపు సముద్రం అనం” అనీ శంకరుల అన్నప్పుడు జలాలుద్దీన్ రూమీ వంటి కొందరు సూఫీ కవులు మెదులుతారు. ఆ సూఫీ కవుల కన్నా శంకరులు చాల పూర్వం వారు. ఈ శంకరుల మాటలలోని ఇతివృత్తం మనిషే, చింతన సామాజికమే. భారతదేశపు తొలి సామాజిక కవి శంకరులే.

ఆది శంకరాచార్య సామాన్య శకానికి పూర్వం 509-477 కాలం వారని ముఖ్యమైన అధారాలు తెలియజేస్తూండడంవల్ల కాళిదాసు రాసిన శ్యామలా దండకం కన్నా ముందే శంకరులు స్తోత్రాలు రాశారు అన్న విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. స్తోత్రాలు గేయ సాహిత్యానికి సంబంధించినవి. శంకరులు 64 స్తోత్రాలూ, 37కు పైగా ప్రకరణ, భాష్య గ్రంథాలూ, ఇతర రచనలూ రాశారు.

సౌందర్యలహరి, శివానంద లహరి రచనలలో శంకరులు అద్భుతమైన కవనాన్ని అందించారు. సౌందర్యలహరి శిఖరిణి వృత్తాలలో ఉన్న 100 శ్లోకాల రచన. “భక్తీ, కవిత్వమూ పరాకాష్ఠకు చేరి సౌందర్యలహరి అయింది” అని కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి అన్నారు. సౌందర్యలహరిలో భావుకత, వర్ణన, భాష, పదచిత్రాలు, ఉత్ప్రేక్షలు చాల గొప్పవి. “నీ ముఖకాంతి” అనడమూ, చీకట్లను పగవాళ్లతో పోల్చడమూ, పార్వతి కంఠంపై పడిన ముడతలను “షడ్జమ, మధ్యమ, గాంధార గ్రామాల (‘గ్రామం’ అంటే సంగీత స్వరాల సమూహం) కోసం ఏర్పఱిచిన సరిహద్దుల్లా ఉన్నాయి” అనడమూ, పార్వతి స్తన్యాన్ని “ఆమె హృదయపు పాల సముద్రం” అనడమూ,మళ్లీ అదే “సారస్వతంలా ప్రవహిస్తోంది” అనడమూ శంకరులు మహాకవి అన్న సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. సౌందర్యలహరిలో శంకరులు ఇచ్చిన ఉత్ప్రేక్షలు ప్రపంచంలో ఏ కవికీ సాధ్యపడనివి.

శివానందలహరి 100 శ్లోకాల రచన. ‘పరమేశ్వరుడిని కౌగిలించుకుని ఆనందాన్ని పొందాలి’ అని అనుకోవడమూ, నా మనసు తప్ప నీకు ఏమీ ఇవ్వలేను’ అని అనడమూ, బుద్ధిని యంత్రంతో పోల్చడమూ మహాకవిగా శంకరులు శివానందలహరిలో చేశారు. “కారు మబ్బుపై తోచే మెరుపు తీగలా విష్ణువు గుండెపై లక్ష్మి ప్రకాశిస్తోంది” అని అనడంలోనూ, “పెద్ద కలువ పువ్వు పైన ఆడ తుమ్మెదలా విష్ణువు మోముపైన అటూ, ఇటూ ప్రసరిస్తున్న లక్ష్మి కృపా కటాక్షం” అని అనడంలోనూ, (ఈ శైలి అన్నమయ్యలో కనిపిస్తుంది) “లక్ష్మి అనే మేఘం చాతకపక్షి లాంటి పేదవాడినైన నాపై ధన వర్షం కురిపించాలి” అని అనడంలోనూ మహాకవి శంకరులు కనిపిస్తున్నారు. చాతకపక్షి ఆత్మాభిమానం కలది. వాన చినుకులను మాత్రమే తాగి బతుకుతుంది. మరే నీరూ తాగదు. వర్షాకాలం దాటితే దానికి ఆహారం ఉండదు. పేదవాడు కొన్ని రోజులు తిండి తినకుండా గడుపుతాడు కదా. ఇలా ఉపమిస్తూ పేదవాడిని తొలిసారి కావ్యస్థం చేశారు శంకరులు.

“నీ కుశలం అడిగేది నీకు ఊపిరి ఉన్నంత వరకే ఆ తరువాత నీ శవాన్ని చూసి నీ భార్య కూడా భయపడుతుంది” అని శంకరులు చెప్పిన సత్యం వేమనతో పాటు భారతదేశపు ఇతర కవులను కూడా కదిలించింది. “మూర్ఖుడా”, “సోదరా”, వంటి సంబోధనలతో శంకరులు కవితను చెప్పారు. బహుశా ఇలా చెప్పడానికి శంకరులే ఆద్యులేమో?

“జ్ఞానం స్వేచ్ఛకు అధారం” అనీ, వెలిగిన దీపానికి, తన వెలుగును చూపించడానికి మరో దీపం అవసరం లేనట్టుగా” అనీ, నీళ్లలో నీళ్లులాగా, కాంతిలో కాంతిలాగా” అనీ అన్న శంకరుల మాటలు ఖలీల్ జిబ్రాన్, లావొచు భావాలుగానూ వినిపిస్తాయి. “అద్దంలో నగరం ప్రతిబింబించినట్లుగా” అనీ, “అద్దంలో అంతఃపురం లాగా” అనీ శంకరులు అన్నప్పుడు “కొండ అద్దమందు కొంచమై ఉండదా?” అన్న వేమన గుర్తుకొస్తాడు. తగిన కారణాలు చూపిస్తూ “అందువల్ల గురువైన శ్ర్రీ దక్షిణామూర్తికి నా నమస్కారం” అన్న వాక్యం పునరావృతం అయ్యే దక్షిణామూర్తి స్తోత్రం లోని శంకరల శైలి ఈనాటి వఱకూ చాలా మంది కవుల కవితలకు మార్గదర్శకం అయింది. శంకరుల రచనలలో ‘పద పురోగతి’ (word-progression) ప్రతేకంగానూ, ఉన్నతంగానూ ఉంటుంది. అది స్వయంగా చదివి ఆస్వాదించవలసినదే.

“ఈ ప్రపంచపు ఎండమావిలోని నీటి కోసం నాకున్న దాహాన్ని నిరోధించు” అని శంకరులు అన్నది చదివాక రవీంద్రనాథ్ ఠాగూర్ పై ఆ మాటల ప్రభావం ఉందని తెలిసిపోతుంది. ఒక తల్లి ఎంత గొప్పదో చెబుతూ ‘ చెడ్దకొడుకు పుడతాడు కానీ తల్లి చెడ్డదవడం ఉండదు” అన్నారు శంకరులు. ప్రపంచపు సాహిత్యంలో మరెక్కడా ఈ మాటలకు సమానమైవి ఉండవేమో? “వందల రంధ్రాలున్న మట్టి కుండలో దీపాన్ని ఉంచితే ఆ దీపపు కాంతి లోపలా, బయటా ప్రసరిస్తూంటుంది” అని శంకరులన్నారు. ఈ మాటలన్నందుకు లావొచు, ఖలీల్ జిబ్రాన్, సూఫీ కవులందరూ “శంకరులు తమ ఆచార్యులు” అని అనకుండా ఉండలేరేమో?

“గర్భంలో ఉన్న శిశువులోని దుఃఖాన్ని ఎవరు వివరించగలరు?” అని ప్రశ్నించిన తొలికవి శంకరులే. “ఎవరు నీ పుత్రుడు?” అని శంకరులన్నది చదివాక ఖలీల్ జిబ్రాన్ రాసిన “నీ బిడ్డలు బిడ్డలు కారు” అన్నది గుర్తుకొస్తుంది. “సత్యం ఎప్పటికీ అసత్యం కాదు” అనీ అంటూ సార్వకాలిక, సార్వ జనీనిక రచనలను అందించారు శంకరులు. మనకు బాగా తెలిసిన సామెత లాంటి “పునరపి జననం, పునరపి మరణం” అన్నది శంకరులదే. “నీడలా అనుసరించడం” అనడం, “మబ్బు తొలిగిన సూర్యుడిలా” అనడం, “పాలలో వెన్నలా” అనడం, “మహా స్వప్నం” అనడం శంకరులనుంచి వచ్చినవే.
“ఆకలి దాహాలతో ఉన్నప్పుడు బిడ్డ తల్లినే తలుచుకుంటుంది” అనీ, “దుఃఖం చేత అనురాగం అనే తాడు ఖండించబడుతుంది” అనీ అన్న సహజ కవి శంకరులు. “నువ్వు ఎవరివి?”, “ఎవరు నీకు సొంతం?’, “నువ్వు ఏ ప్రదేశం నుంచి వచ్చావు?” వంటి శంకరుల ప్రశ్నలు చాల భారతీయ రచనలలో కనిపిస్తాయి. భారతదేశపు తొలి తత్త్వకవి శంకరులే. భారతదేశపు గొప్ప కవులపై శంకరుల ప్రభావం కనిపిస్తూనే ఉంది.

“వాక్చాతుర్యం, పద ప్రవాహం, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, పాండిత్యం, ఇవన్నీ భుక్తి కోసమే” అనీ, “మందుల పేర్లు ఉచ్చరించడం వల్ల వ్యాధులు నయం కావు” అనీ, “శాస్త్రాన్ని వదిలెయ్” అనీ, కులం, గోత్రం, రూపం, వీటిపై అభిమానాన్ని వదిలెయ్” అనీ అన్న ప్రపంచపు తొలి విప్లవ కవి శంకరులే.

“రాళ్లు, చెట్లు, గడ్డి, ధాన్యం, పొట్టు ఇవన్నీ అగ్నివల్ల కాలిపోతే అవి వాటికి మూలమైన మట్టిగా అయిపోతాయి” అని అన్న మట్టిపై మక్కువ ఉన్న కవి శంకరులు. “చెట్టు నుంచి రాలిన ఆకు కాలువలోనో, నదిలోనో, శివక్షేత్రంలోనో, వాకిట్లోనో, పడితే ఆ చెట్టుకు శుభా శుభాలు వర్తిస్తాయా?” అని అడగడం శంకరులకే చెల్లింది. దేశ, కాలాలకు అతీతమైన భావాలతో, భావనలతో, రచనా సంవిధానంతో ఎప్పటికీ నిలిచి ఉండే విశ్వమహాకవి ఆది శంకరాచార్య.

‘సనాతనత్వ సాకారం ఆది శంకరాచార్యులు; వైదికతకు ఆకారం ఆది శంకరాచార్యులు’.
మన భారతదేశంలో ఆది శంకరాచార్యుల అవతరణం ఒక చారిత్రిక అవసరం. వారు అవతరించి సనాతనత్వానికి ప్రవాహాన్నిచ్చారు. ఆ ప్రవాహం మనందరికీ ఇప్పటికీ, ఎప్పటికీ ఎంతో ప్రయోజనకరం. మనదేశానికి సంబంధించినంత వఱకూ వారే గురువు. ఆదిశంకరుల గురుత్వంలో మనదేశ గమనం మునుముందుకు సాగుతూండాలి.

ఆది శంకరుల విషయంలో కొన్ని విషయాలు తప్పిపోయాయి, కొన్ని తప్పులు నెలకొన్నాయి. ముఖ్యంగా వారి కాలం. వారి కాలం సామాన్య శకం 8వ శతాబ్ది అనడం సరికాదు. సామాన్య శకం 2000 తరువాతి పరిశీలనలు వారి జననం సామాన్య శకానికి పూర్వం 509వ సంవత్సరం అని తెలియజేస్తున్నాయి. 1916లోనే వారి కాలం సా.శ. 509 అని తెలియజేసిన పరిశీలనలు తెలుగులోనే ఉన్నాయి. ఆది శంకరాచార్య కాలం
సామాన్య శకానికి పూర్వం (B.C.E.) 510 అని William Walker Atkinson 1920ల లోనే తన The Philosophies And Religions Of India పుస్తకంలో ప్రపంచానికి తెలియజేశాడు.
ఆది శంకరులు ప్రచ్ఛన్న బౌద్ధులు అని, వారు బౌద్ధాన్ని తిరస్కరించారు అని మనం వింటూంటాం. ఈ రెండూ సరైనవి కావు. వారి రచనల్లో ఎక్కడా బౌద్ధం, బుద్ధుడి ప్రస్తావన లేదు.

ఆది శంకరులను తప్పు పట్టేవాళ్లు ఛండాలుడి ఉదంతాన్ని తీసుకుంటారు. ఆ ఉందంతాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ ఛండాలుడుగా వచ్చింది పరమ శివుడు అని తీసుకోవాల్సి ఉంటుంది. రెండవది, అతి ముఖ్యమైంది- ఆది శంకరులు ఆ సందర్భంలో ఛండాలుడితో ఓడిపోయి, అతడి పాదాలు పట్టుకుని తన తప్పు తెలుసుకున్నారు. ఆదిశంకరుల ఔన్నత్యం అది. సనాతనత్వం నేర్పే సంస్కారం తప్పు తెలుసుకోవడం. ఇవాళ కుసంస్కారం వ్యక్తులు అలా ఆదిశంకరులలా విద్య, విజ్ఞతలతో తమ తమ తప్పుల్ని ఒప్పుకుని దిద్దుకుంటారా? తప్పుల్ని దిద్దుకునే సంస్కారానికీ ఆదిశంకరులే ఆదర్శం.
ఆదిశంకరులను సరిగ్గా చదివి వారిని అర్థం చేసుకోవాలి.

ఆదిశంకరులు అద్భుతాల్నీ చేశారు, ఆకలీ తీర్చారు, కవిత్వాన్నీ చెప్పారు, దైవాన్నీ స్తుతించారు, చెప్పులూ కుట్టారు. వైదికత్వం కోసం దుష్టుల దాడులకూ గురయ్యారు; ప్రాణాల మీదకూ తెచ్చుకున్నారు. శంకరులు వెఱపు లేని వెల్లువై సాగారు. మన సనాతనత్వంపై, సనాతనులపై దాడులు జరిగాయి, జరుగుతున్నాయి… ఆదిశంకరులను ఆదర్శంగా చేసుకుని మనం ఆ దాడులకు వెఱవకుండా మునుముందుకు వెళుతూండాలి.

ఈ భారత(ప్ర)దేశంలో నడయాడిన న భూతో న భవిష్యతి మానవ అత్యద్భుతం ఆదిశంకరాచార్య. భారతీయతా భాసురం ఆదిశంకరాచార్య. ఆది శంకరులు మన మట్టి శక్తి. ఆది శంకరులు మన దేశ యుక్తి. వారిని స్మరించుకుంటూండడం ఈ మట్టి మనుషులు మనుషులుగా బతుకుతూండడం అవుతుంది. శంకరత్వాన్ని, శంకర తత్త్వాన్ని మనం మనకు ప్రయుక్తం చేసుకోవాలి.

ఆదిశంకరులు అన్న మహాశక్తికి,‌ సనాతన అభివ్యక్తికి, ఆధ్యాత్మిక సూర్యుడికి, తాత్త్విక కాంతికి, విశ్వ మహాకవికి, భవ్య సాహిత్యానికి, విశేషనైజానికి, వైశిష్ట్య వైప్లవ్యానికి, ధర్మజ్ఞతకు, దార్శనికతకు ఈ మట్టి మనుషులంగా మనసా, వాచా ఎల్లప్పుడూ ప్రణామం చేస్తూ ఉందాం.

“శంకరత్వం ఒక‌ సుజ్ఞాన సత్వం;
సదా అనుగమించాల్సిన తత్త్వం”.

(ఆది శంకరుల జయంతి సందర్భంగా)

రోచిష్మాన్
9444012279

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *