”ఆ వాక్యం అనువదించను.. ఉన్నత ఉద్యోగం నాకు వద్దు… ఉపవాసం ఉంటా”

1921 లో తండ్రి మాట కాదనలేని ఓ యువకుడు కలకత్తా నుంచి ఇంగ్లాండుకు వెళ్లాడు. తన కొడుకు ఐసీఎస్‌ పాసై ఉన్నతాధికారి కావాలని ఆ తండ్రి ఆశ. ఆయన కోరుకున్నట్లే ఆ యువకుడు ఐసీఎస్‌లో నాలుగో ర్యాంకు సాధించి, భారత్‌కి తిరిగివచ్చాడు. ఇక్కడ మరో చిన్న పరీక్ష పాసవాల్సి ఉంది. అందులో పాసైతే ఉన్నత అధికారిగా నియమితుడవుతాడు.

ప్రశ్నాపత్రంలో ఒక వ్యాసమిచ్చి అనువదించమని కోరారు.ఆ ప్రశ్నకు జవాబు రాస్తున్నాడు. ఆ వ్యాసంలో చివరి వాక్యం అతడిని ఆపేసింది. దాని అర్థం. ‘‘అనేక మంది భారతీయ సైనికులు నిజాయితీపరులు కాదు’’ అని. ఆ యువకుడు లేచి పరీక్షా పర్యవేక్షకునితో ‘‘సార్‌.. దీన్ని అనువాదం చేయడం కష్టం కాదు. అయితే ఇక్కడ ఇచ్చిన వాక్యాన్ని ఒప్పుకోవడానికి నా ఆత్మసాక్షి సిద్ధంగా లేదు. భారతీయ సైనికులు నిజాయితీపరులు కాదనే వాక్యాన్ని నేను అనువాదం చేస్తే దాన్ని అంగీకరించినట్లవుతుంది. దయచేసి ఈ వాక్యాన్ని మార్చి ఇస్తే నేను అనువాదం చేస్తాను’’ అన్నాడు.

అప్పుడు ఆ అధికారి ‘‘ప్రశ్న పత్రాన్ని రూపొందించింది నేను కాదు. దాన్ని మార్చడానికి నాకు అధికారం లేదు. ఒక్క వాక్యమే కదా… అనువదించు. పరీక్షలో ఉత్తీర్ణుడవుతావు. నీ కోసం ఉన్నత ఉద్యోగం ఎదురుచూస్తోంది’’ అన్నాడు. నేను ఆ పని చేయను అన్నాడు ఆ యువకుడు. కాసేపు ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ వాక్యాన్ని మార్చడానికి ఉన్నతాధికారులు అంగీకరించలేదు. ఆ యువకుడు ‘‘నాకు ఐసీఎస్‌ వద్దు. ఉన్నత ఉద్యోగమూ వద్దు. అవసరమైతే ఉపవాసం వుంటాను. భారతీయులకు అవమానం కలిగించే మాటలు మాత్రం రాయను’’ అని సమాధాన పత్రాన్ని అక్కడే వదిలేసి బయటికి వచ్చాడు. ఆ యువకుడే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *