గణేష్ ఉత్సవాల ద్వారా తిలక్ ప్రజల్లో స్వాభిమానాన్ని, స్వాతంత్ర పోరాటాన్ని ఎలా రగిల్చారంటే….

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఊరూ, వాడ… ఇలా ప్రతి చోటా వినాయకుడు కొలువుదీరాడు. దీంతో హిందూ సమాజం మొత్తం సంఘటితమైంది. హిందువులందరూ ఓ చోట చేరి, వినాయకుడ్ని వేడుకోవడం జరుగుతోంది.అయితే… వినాయక చవితి ఉత్సవం ఇంతలా సర్వ వ్యాపి, సర్వస్పర్శి కావడానికి ప్రథమ కారకులు లోకమాన్య బాలగంగాధర తిలక్. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వినాయక చవితి ఉత్సవం కొందరు ప్రైవేట్ గా చేసుకుంటున్న మొదట్లో… దీనిని ప్రజల పండుగగా, హిందూ ఐక్య సంఘటనం కోసం మార్చింది కూడా తిలకే. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా హిందువులందరూ ఐకమత్యంగా పోరాడడానికి తిలక్ గణేష్ ఉత్సవాలను ముందుకు తెచ్చారు. ఈ సందర్భంగా ప్రతి వినాయక చవితికి లోకమాన్య తిలక్ కి హిందువులందరూ ధన్యవాదాలు తెలుపుకోవాల్సి వుంటుంది.

 

గణేష్ ఉత్సవాలు భారత స్వాతంత్ర్య పోరాటంతో లోతుగా కలిసిపోయింది. స్వాతంత్ర పోరాటంలో సాంస్కృతిక పునరుజ్జీవనంలా, అత్యంత శక్తిమంతమైన సాధనంగా మార్చడానికి శతధా ప్రయత్నం చేసింది కూడా తిలకే. నిజానికి చాలా కాలం పూర్వం మహారాష్ట్ర ప్రాంతంలో గణపతి ఉత్సవాలు అద్భుతంగా జరిగేవి. అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం కూడా. అయితే… ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే.. బిహార్ లోని మాధేపురా లో కూడా మహారాష్ట్రకి సమానంగా గణేష్ ఉత్సవాలు జరిగేవి చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. 1872 లో పాహి అనే ప్రాంతంలో జన్మించిన మహామహోపాధ్యాయ సర్ గంగానాథ్ ఝా తన ఆత్మకథలో ఈ గణేషుడి ఉత్సవాలను ప్రస్తావించారు. ఝా సంస్కృతం, భారతీయ తత్వశాస్త్రంలో సుప్రసిద్ధ పండితులు.

 

మన సంప్రదాయ లోతులను పరిశీలిస్తే… సనాతన సంప్రదాయంలో గణేషుని పూజకు విశేషమైన స్థానం వుంది. అగ్ని పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, స్కాంద పురాణంతో సహా వివిధ పురాణాలలో గణేషుడి ప్రస్తావనలను మనం చూడొచ్చు. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటుల కాలంలో కూడా ఈ గణేష్ ఉత్సవాలు వున్నాయని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ రాజ వంశాల వారు గణేష్ ఉత్సవాలను బాగా ప్రోత్సహించారు కూడా. అయితే… ఈ పూజా విధానం మరాఠా సామ్రాజ్యం ద్వారా మరింత ముందుకు సాగింది. శివాజీ మహారాజ్ గణపతి ఉత్సవాలకు ప్రముఖంగా ప్రాధాన్యమిచ్చారు.

 

1818 తర్వాత పేష్వాలు తమ ప్రాంతాలపై పట్టు కోల్పోయిన తర్వాత గణేష్ ఉత్సవాలను ఎవరి ఇళ్లల్లో వారు చేసుకుంటూ వుండిపోయారు. కానీ… 1893 లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను సార్వజనీన ఉత్సవాలుగా మార్చారు. ఇలా మార్చడానికి ఆయనకు దాదాపు 75 సంవత్సరాల సమయం పట్టింది. అంతలా శ్రమించి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. బ్రిటీష్ పాలకులపై భారతీయులందరూ పోరాటం చేయడానికి, జాతీయవాద ఆలోచనలకు గణేష్ ఉత్సవాలు ఎంతో ఉపయోగపడ్డాయి.

అయితే.. గణేష్ ఉత్సవాలను సార్వజనీనం చేయడం వెనుక పెద్ద వ్యూహమే వేశారు తిలక్. చాలా ఆలోచనలు, ప్రతీకాత్మకమైనది కూడా వుంది. ఒకానొక సమయంలో బ్రిటీషర్లు బహిరంగ సభలను నిషేధించారు. భారతీయులెవ్వరూ తమ భావ ప్రకటనను చెప్పడానికి పెద్ద పెద్ద సభలను పెట్టొద్దని బ్రిటీషర్లు హుకూం జారీ చేశారు. దీంతో ఈ పరిమితులన్నింటినీ… తొక్కేయడానికి, ఓ మూలన పడేయడానికి, బ్రిటీషర్లను ఎదిరించడానికి లోకమాన్య తిలక్ ఈ గణేష్ ఉత్సవాలను బాగా ఉపయోగించారు. దీంతో భారతీయులలో ఐకమత్యం, గుర్తింపు భావం బాగా పెరిగాయి. సంగీత ఊరేగింపులు, మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు… ఇలా పెద్ద మొత్తంలో నిర్వహింపజేసి, గణేష ఉత్సవాలను తిలక్ ‘‘సంఘటనా కార్యక్రమం’’ గా తీర్చిదిద్దారు.

వీటితో పాటు హిందూ సమాజంలో వున్న కులాల అడ్డుగోడలను తొలగించడానికి కూడా ఈ గణేష్ ఉత్సవాలను ఉపయోగించారు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య వున్న అంతరాలను పూర్తిగా తొలగించేందుకు గణేష్ ఉత్సవాలను ఓ మాధ్యమంగా వాడారు. విశ్వాసం, ఆప్యాయత, ఆత్మన్యూనతా భావాన్ని తొలగించడం కోసం తిలక్ పాటుపడ్డారు. గణేష్ ఉత్సవాల ద్వారా జాతిలో వున్న ‘‘ దేశభక్తి’’ని పెంపొందించడానికి ప్రయత్నాలు చేశారు. ఈ లక్షణాలన్ని కూడా స్వాతంత్ర పోరాటానికి అత్యావశ్యకాలు. ప్రజల్లో వున్న ప్రతిఘటన స్ఫూర్తిని కొనసాగిస్తూనే… ఉత్సవాలలో సామాజిక, రాజకీయ సందేశాలను వినిపించేవారు. గణేష్ నవరాత్రుల మాధ్యమంగా ప్రజలకు దేశం పట్ల ప్రేమ, గర్వంతో పాటు వారి వారి హక్కులు, విధులపై కూడా అవగాహన కల్పించారు.

 

దీంతో తిలక్ వేసిన వ్యూహం గానీ, ఆలోచనలు గానీ అద్భుతమైన ఫలితాలివ్వడం ప్రారంభించాయి. భారత ప్రజలు మరింత దూకుడుతో బ్రిటీషర్స్ తో పోరాడడానికి పనికొచ్చింది. ఈ ఉత్సవాలు స్వయం పాలన, స్వరాజ్, సామాజిక సంస్కరణలు… ఇలా ఎన్నింటికో వేదికయ్యాయి. స్వాతంత్రం గురించి ప్రసంగాలు, ప్రదర్శనలు, చర్చలకు ఇలా ఎంతో ఉపయోగపడింది. ‘‘స్వరాజ్యం నా జన్మహక్కు.. నేను పొందుతాను’’ అని తిలక్ మరింత గర్జనగా చెప్పడానికి ఈ గణేష్ ఉత్సవాలు దోహదపడ్డాయి. అలాగే దేశ ప్రజలందరూ స్వాతంత్రోద్యమంలో మరింత చురుగ్గా పాల్గొనడానికి ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా గణపతి ఉత్సవాలు అంటరానితనం రూపుమాపడానికి, సామాజిక సామరస్యం నెలకొల్పడానికి ఓ వేదికైంది. అయితే.. ఈ ఉత్సవాల సమయంలో మతపరమైన భావాలు ఎక్కువగా వున్నా… అవి అదుపు తప్పకుండా తిలక్ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. అనేక సందర్భాలలో హిందూ – ముస్లిం ఐక్యతను పెంపొందించేందుకు, బ్రిటీషర్స్ వాడే విభజించు – పాలించు అన్న సిద్ధాంతాన్ని తుత్తునీయలు చేసేందుకు తిలక్ ఈ ఉత్సవాల ద్వారా ప్రయత్నాలు చేశారు.

 

ఈ ఉత్సవాలను కేవలం సాంస్కృతిక పునరుజ్జీవనం లాగా మాత్రమే కాకుండా బ్రిటీషర్లకి వ్యతిరేకంగా సామూహికంగా ఉద్యమం చేయడానికి కూడా తిలక్ వాడారు. హిందువుల స్వేచ్ఛ, గుర్తింపు కూడా ఈ ఉత్సవ నిర్వహణ ద్వారా మరింత పెరిగాయి. ఎంత గణేష్ ఉత్సవాలు చేసినా… తిరిగి దేశ స్వాతంత్ర్య సముపార్జనతో మమేకం అయ్యేలా మాత్రమే వ్యూహం రచించాడు తిలక్. దీంతో సామాజిక, రాజకీయ మార్పుకు అత్యంత శక్తిమంతమైన ఉత్ప్రేరకంగా ఈ ఉత్సవాలు నిలిచాయి. అప్పుడు తిలక్ వేసిన బీజాలు… ఇప్పటికీ గణపతి మండపాల రూపంలో, ఊరేగింపులు, కీర్తనలు, భజనల రూపంలో జీవిస్తూనే వుంది. తిలక్ ఆశయం హిందువుల ఐక్యత, స్ఫూర్తిలో ప్రతిధ్వనిస్తూనే వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *