లోక్‌మంథన్ 2024: గ్రామీణ విజ్ఞానానికి అగ్రతాంబూలం

మన భారతదేశంలో నగరీకరణ జరిగినప్పటికీ, మన సంస్కృతి మాత్రం గ్రామీణ ప్రధానంగా విలసిల్లిన బ్రహత్ సభ్యత. ఇందులో ఉన్నత విద్యాభ్యాసం, బోధన ఎక్కువగా అడవులు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహర్షుల ఆశ్రమాలలో జరిగేవి. ఉన్నతమైన జ్ఞానాన్ని పొందేందుకు నగరాల్లోని అత్యున్నత వర్గాలవారు, వారి సంతానం, చివరికి రాజులు, వారి వారసులు కూడా ఈ ఆశ్రమాలకు వెళ్లవలసి ఉండేది.
భారతదేశంలో ఒక విశిష్టమైన ప్రజాస్వామ్య ప్రధాన విజ్ఞానవ్యవస్థ దేశవ్యాప్తంగా అమలులో ఉండేది. అయితే మొదట ఇస్లామిక్ దండయాత్రలు, ఆ తర్వాత క్రైస్తవ దురాక్రమణల కారణంగా… గ్రామీణ ప్రజల కంటే పట్టణవాసులను ఉన్నతులుగా భావించే ఒక వివక్ష క్రమంగా ఏర్పడింది. పట్టణేతర ప్రాంతాలలో నివసించే వారిని చిన్న చూపు చూడడం. గ్రామీణ విజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేసి, పట్టణ-నగర ప్రాంతాల్లోని జ్ఞానం కంటే తక్కువ చేసి చూడడం ప్రారంభమైంది.
శాస్త్రీయం, జానపదం అనే పాశ్చాత్య దేశాల వర్గీకరణను భారత సమాజంపై రుద్ది, పట్టణేతర ప్రాంతాల వారిని, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఏమీ తెలియని జానపదులుగా చూడటం మొదలైంది. శాస్త్రీయం కానిది అనాగరికం అనీ, ఇది తక్కువ స్థాయిది.. అనే మరొక నిర్వచనాన్ని మన సమాజానికి నిర్దేశించారు. దాంతో సామాజిక సామరస్యత, ఆరోగ్యం, సాంకేతికత, ఆహారపు అలవాట్లు, ప్రకృతి ప్రాధాన్యత మొదలైన అనేక అంశాలలో భారతదేశంలో ఉన్న అపారమైన అనుభవం, విజ్ఞానం, విచక్షణలను గణనీయంగా కోల్పోయాం. ఫలితంగా ప్రకృతిని దోచుకోవడం, సమాజంలో సమతూకం దెబ్బతినడం మొదలైంది. ఈ కృత్రిమ విభజనను రూపుమాపి, పట్టణ ప్రాంతాల్లోనే కాక ఇతర ప్రాంతాల్లో నివసించే ప్రజల గొప్ప జ్ఞానం, వివేకం సాంస్కృతిక నైతికతను సమకాలీకరించి, పట్టణవాసులతో అనుసంధానించాలి.
భారతీయతకు ప్రాధాన్యతనిచ్చి, ఆ దిశగా ఆలోచన – ఆచరణ చేసేవారిని ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి, తద్వారా సామాజిక ప్రధాన జీవన స్రవంతి కథనంలో మరుగున పడిన వర్గాలు, సమాజాలకు ఒక స్థానం, ఒక స్వరం ఇవ్వడమన్నది లోక్‌మంథన్ లక్ష్యం. తమ పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన విజ్ఞానాన్ని, వివేకాన్ని వీరు తిరిగి దక్కించుకోవాలి. వారి ఆలోచనా ధార, విశ్వాసాలు, జీవన విధానం, వారి దృక్పథం, అనేక సహస్రాబ్దాలుగా వారి సమాజాన్ని నడిపిన సంస్థలు, వ్యవస్థలకు సంబంధించిన అంశాలను వెలికి తీసుకురావాలని లోక్‌మంథన్ భావిస్తోంది. ఆ కోణంలో, మేధావులు, కళాకారులు, ప్రతి రంగానికి చెందినవారిని ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది లోక్‌మంథన్ ప్రయత్నం. జానపదుల కళలు, జీవనశైలి, పద్ధతులు, సంప్రదాయాలు, సంస్థల వంటివన్నీ… గొప్ప శాస్త్రీయ అంశాలుగా చెప్పుకుంటున్న వాటికి ఏ మాత్రం తక్కువ కాదని ఘంటాపథంగా చూపించేందుకే ఈ బృహత్ కార్యక్రమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *