కాలుష్యం నుంచి నదులను కాపాడుకుందాం : లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 లో వక్తలు
భాగ్యనగర్ లోని శిల్పకళా వేదికగా జరుగుతున్న లోకమంథన్ భాగ్యనగర్ 2024 రెండో రోజూ కొనసాగింది. రెండో రోజు భారతీయ తత్వ చింతన – పర్యావరణ స్పృహపై మేధావులు మాట్లాడారు. ఇందులో భాగంగా పంచతత్వ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ శిప్రా పాఠక్ మాట్లాడుతూ… భారత దేశ నదుల ప్రాశస్త్యం, పర్యావరణ స్పృహపై మాట్లాడారు. ఈ సందర్భంగా నదుల చారిత్రక, సాంస్కృతిక ఔచిత్యాన్ని వివరించారు. భారతీయ నదుల చుట్టూ నాగరికతలు ఎలా అల్లుకున్నాయో, నాగరికతలు ఎలా వృద్ధి పొందయో వివరించారు. అలాగే ఆ నాగరికతల చుట్టూ సామాజిక పరివర్తన ఎలా జరిగిందో కూడా విశ్లేషించారు. అలాగే నీటి వనరులలో పెరుగుతున్న కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులందరూ నదులను సంరక్షించడానికి, కాలుష్యం బారి నుంచి వాటిని కాపాడుకోడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
భగీరథ్ గ్రామ వికాస్ ప్రతిష్ఠాన్ చైర్మన్ ప్రసాద్ వామన్ దేవధర్ గ్రామీణ అభివృద్ధికి అవసరమైన వినూత్న విధానాలపై ప్రసంగించారు. బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా పశువులు, ఆవు ఎరువును పర్యావరణ అనుకూల ఇంధనంగా మార్చుకునే విధానంపై కూలంకషంగా మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు తమ సంస్థ చేస్తున్న విషయాలను పంచుకున్నారు. అలాగే గ్రామీణ సాధికారతకు చేస్తున్న కృషిని వివరించారు. తక్కువ డబ్బులతో గ్రామీణ వాసులకు బయోగ్యాస్ ప్లాంట్లను తాము అందిస్తున్నామని, ఈ అందించే విధానంపై కూడా లోక్ మంథన్ వేదికగా వామన్ దేవధర్ వివరించారు.