లోక్ మంథన్ వేదికగా ఈ దేశ పునాదులపై మథనం : నంద కుమార్

ఈ నెల 21 నుంచి 24 వ తేదీ వరకూ హైదరాబాద్ శిల్పారామం వేదికగా లోక్ మంథన్ 2024 నిర్వహిస్తున్నామని ‘ప్రజ్ఞాప్రవాహ్‌’ అఖిల భారతీయ సమన్వయకర్త నందకుమార్ ప్రకటించారు. ఈ లోక్ మంథన్ లో జాతీయవాద ఆలోచనాపరులు, మేధావులు, విద్యావేత్తలు, కళాకారులు ఓ చోట సంఘటితమయ్యే వేదిక అని అన్నారు. సమాజంలో తలెత్తే ప్రశ్నలు, ఇబ్బందులపై మేథోమథనం చేస్తామని తెలిపారు. దేశంలో తలెత్తుతున్న తప్పుడు కథనాలను పునర్నిర్మించడం, సరైన కథనాలను ఇవ్వడం, ప్రజలు తమ నాగరిక పాత్రను సమర్థవంతంగా పోషిచండానికి దేశాన్ని సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఈ మంథన్ జరుగుతోందని తెలిపారు.

లోక్ మంథన్ ద్వారా ఈ దేశం యొక్క పునాదులపై మథనం జరుగుతుందని నందకుమార్ తెలిపారు. ఈ మథనం ఏ నిర్దిష్టమైన మతాన్ని, కులాన్నో, స్థానికతనో సూచించదని,అయినా కొందరు తప్పుడు కథనాలు అల్లుతున్నారన్నారు. మన దేశాన్ని కులం, మతం, భాష, ప్రాంతం ఆధారంగా విభజించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయని అన్నారు. తాజాగా ఇవే అంశాలపై పలు వివాదాలు కూడా చెలరేగాయని గుర్తు చేశారు. అయితే ఈ మేధోమథనంలో మాత్రం భారత్ స్వాభావిక ఐక్యతను చర్చిస్తామని ప్రకటించారు. ఈ ఐక్యతకు మరో పునాది ఏదీ లేదని, దేశం మొదటి అంచు నుంచి చివరి అంచు వరకూ విస్తరించి వున్న సాంస్కృతిక సారాంశమేనని స్పష్టం చేశారు. ఈ సాంస్కృతికత దేశంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోందన్నారు.

ఈ కార్యక్రమం ఓ సాంస్కృతిక ఉత్సవమని, మన వారసత్వం, సంప్రదాయాలు, ప్రాచీన విజ్ఞానానికి సంబంధించిన వేడుక. ఈ కార్యక్రమాన్ని ప్రజ్ఞా ప్రవాహ (న్యూఢిల్లీ) మరియు ప్రజ్ఞాభారతి (తెలంగాణ) నిర్వహిస్తున్నాయని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు ఓ చోట చేరి, సమాజంలో వున్న సమస్యలు చర్చిస్తారని, కథనాలను పునర్నిర్మిస్తారని పేర్కొన్నారు.

‘భారత్ మొత్తం వ్యాపించి ఉన్న సాంస్కృతిక ఔన్నత్యమే ఈ ఐకమత్యం వెనుక ఉన్న రహస్యం. ఈ విశిష్టమైన సంస్కృతి.. మొత్తం ప్రపంచం మీదనే తనదైన ప్రభావం చూపించింది. అందువల్లనే ఎన్నో ప్రి-అబ్రాహమిక్ (అబ్రాహమిక్ మతాలకు ముందు ఉన్న) మతాల్లో చేసే పూజలు, పాటించే సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతిని పోలి ఉంటాయి.యాజిదీలు తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి చేసిన పోరాటాలు, తన అనుభవాలను అందరితో పంచుకుంటారు. ఇలా సమయానికి ఎదురెళ్లి నిలబడే సంప్రదాయాల గొప్పతనాన్ని గుర్తుచేయడమే లోకమంథన్ 2024 విశిష్టత’ అని ఆయన చెప్పారు.

‘యూరోపియన్ పరిభాషలో.. ఫోక్ అనే పదాన్ని కేవలం కొన్ని గ్రూపులకు, సంస్కృతులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ ఐడియాలజీలను ఆయా ప్రాంతాలకు చెందిన సహజమైన మూలాలతో వ్యక్తంచెయ్యడం కుదరదు. ఆ విధానాలు దేన్ని వ్యతిరేకిస్తున్నాయో దాన్ని బట్టే వీటిని అర్థం చేసుకుంటారు’ అని వివరించారు. విజ్ఞాన్‌ప్రవాహ్‌ సమన్వయకర్త నందకిశోర్‌ మాట్లాడుతూ మన భవిష్యత్తు, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలు తదితర 13 కీలక అంశాలపై లోక్‌మంథన్‌లో చర్చిస్తామన్నారు. 24న జరిగే ముగింపు కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌భాగవత్‌ ప్రసంగిస్తారని వెల్లడించారు.

 

ఇక లోక్ మంథన్ చైర్మన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ 21వ తేదీన లోక్‌మంథన్‌లో ప్రదర్శనలు, సాంస్కృతిక ఉత్సవాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ప్రారంభమవుతాయని తెలిపారు. 22న వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే మేధోమథన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభిస్తారని, లోక్‌మంథన్‌లో 100కిపైగా కళలు, 1,500 మందికిపైగా కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. 400కుపైగా అరుదైన భారతీయ సంగీత పరికరాలతో వాద్యకచేరి ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో విభజనపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని, కుట్రపూరితమైన ఈ వ్యవహారాలను ఎలా అర్థం చేసుకోవాలన్నదే ఈసారి లోక్‌మంథన్‌ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని బలోపేతం చేసి, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం చూపడమే లక్ష్యం అని కిషన్‌రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *