కీర్తి కాంక్షే లేకుండా వందేళ్లుగా పనిచేస్తున్న సంస్థ ఆరెస్సెస్ : జయప్రకాశ్ నారాయణ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్ల చరిత్ర అత్యంత విశిష్టమైందని, ఆధునిక ప్రపంచ చరిత్రలో ఆరెస్సెస్ లాంటి సంస్థ మరొకటి లేనే లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా. జయప్రకాశ్ నారాయణ అన్నారు.’’చేతనా స్రవంతి – నవయుగ భారతి’’ సంయుక్త ఆధ్వర్యంలో ‘‘తెలుగు ప్రాంతాలో ఆర్ఎస్ఎస్’’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. హైదరాబాద్ లోని చైతన్యపురిలోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ డా. జయప్రకాశ్ నారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం కోసం అంకితమై, జీవన పర్యంతం బ్రహ్మచర్యం పుచ్చుకొనే మత గురువులున్న సంస్థలు వున్నాయని, లేకపోతే ఉద్రేకంతో దేశమాత శృంఖలాలను తొలగించడం కోసం తాత్కాలికంగా, ఆవేశంతో త్యాగాలు చేసిన సంస్థలు కూడా వున్నాని, కానీ దీర్ఘకాలం ఓ స్పష్టమైన అవగాహనతో, సుదూరంగా వున్న లక్ష్యం కోసం, తాత్కాలిక ఆవేశం కాకుండా, క్షణికమైన ఉద్రేకం కాకుండా స్పష్టమైన అవగాహనతో, నిశ్శబ్దంగా, అజ్ఞాతంగా, ఏమీ ఆశించకుండా వేలాది మంది ప్రాణాలిచ్చే సంస్థలు 150 ఏళ్లలో లేవని, అలా జరగలేదని అన్నారు. ఒక్క ఆరెస్సెస్ లోనే వుందన్నారు. ఓ పక్క త్యాగనిరతి, దీర్ఘకాల లక్ష్యం, కీర్తికాంక్షతో కాకుండా ఆరెస్సెస్ సేవ చేస్తోందన్నారు. ఓ మహనీయుడు చెప్పినట్లు కీర్తి కాంక్షతో కాకుండా కీర్తి దక్కుతుందా అని కాకుండా లక్ష్యం కోసమే పోరాడేవారితో మహత్కార్యాలు సాధింపజేస్తారని అనేవారని, ఈ మహా తత్వాన్ని పూర్తిగా అంతర్లీనం చేసుకున్న గొప్ప సంస్థ ఆరెస్సెస్ అని కొనియాడారు. నిరపేక్షత, రాగద్వేషాలకు తావులేకుండా పనిచేస్తుందన్నారు. అహింస, సత్యం, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య అనే ఐదు మహా లక్షణాలు మూర్తిగా మూర్తీభవించిన సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అని తెలిపారు. అందుకే జాతి నిరంతరం రుణపడి వుండాలని, రుణపడి వుంటుదన్నారు.ఆరెస్సెస్ నిరంతరం కూడా మన సమాజంలో అంతర్గత సంస్కరణల కోసం పోరాడుతూనే వుందన్నారు.
ఇంత పెద్ద చరిత్ర, సంస్కృతి మన దేశానికి వున్నా… ముక్కలైన సమాజం మనదని, ఈ ముక్కలైన సమాజంలో ఐక్యత సాధించాలని సంఘ్ పనిచేస్తోందని, అలాగే ఈ హైందవ సంప్రదాయంలో ఫలానా శాఖను, సంప్రదాయాన్ని మాత్రమే అనుసరించమని కూడా ఏనాడూ సంఘ్ చెప్పలేదని స్పష్టం చేశారు. హైందవ సంస్కృతిలోనే ‘‘ఏకం సత్ విప్రా: బహుధా: వదంతి’’ అని వుంటుందని, తోచిన రీతిలో సత్యాన్ని వెతుక్కో అని చెప్పిన ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి అని అన్నారు. అలాగే నిరీశ్వరవాది అయిన కణాదుడ్ని, చార్వాకుడ్ని కూడా రుషులుగా చేశామని, బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, భాస్కరుడు, శంకరుడు ఇలా అందరూ గౌరవించదగ్గవారేనన్నారు. భారతీయ సంప్రదాయంలో వున్న ఈ ఔన్నత్యాన్ని బాగా మంది అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ్ దృష్టిలో రాజ్యం అత్యున్నతమైంది కాదని, సమాజమే అత్యున్నతమైందన్న విషయం తనకు అర్థమైందన్నారు.
సమాజంలో వున్న ఆత్మన్యూనతను తొలగించి, ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని అందించేందుకు నిరంతర ప్రయత్నాన్ని సంఘ్ చేస్తోందన్నారు. ఏ సంస్థ అయినా సరే ఉదాత్త లక్ష్యాలతో ప్రారంభమైనా, సందర్భానుసారంగా పరిణామం చెందకపోతే, కాలక్రమేణా ఆ సంస్థ ప్రభావం అంతరిస్తుందని, కానీ.. సంఘ్ నిరంతరం పరిణామం చెందుతోందని ప్రకటించారు. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా సంఘ్ పంచపరివర్తన్ అనే విషయాన్ని పరిచయం చేసిందని, దీనికి ద్వారా సమాజానికి మేలు చూకురుతుందన్నారు. అలాగే మన సమాజంలో విభిన్న దృక్పథాలు, భాషలు, ప్రాంతాలు, కులాలున్న సమాజాన్ని ఏకం చేయడం ఓ అద్భుతమైన యజ్ఞం అని, ఈ యజ్ఞాన్ని శతాబ్దం పాటు నిర్వహించి, కొనసాగిస్తూ, మార్పుకు శ్రీకారం చుడుతున్న సంఘ్ కి మనస్ఫూర్తిగా మనోవాక్కాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.ఈ దేశంలో ఎన్నో అద్భుతమైన పనులు జరిగాయని, మరిన్ని జరగాలన్నారు. ఈ దేశ భవిష్యత్తును కాపాడటంలో మనందరి కర్తవ్యాన్ని చిత్తశుద్ధిగా నిర్వహించాలని జయప్రకాశ్ నారాయణ సూచించారు.