ఘనంగా ప్రారంభమైన అయోధ్య రామ్ లల్లా వార్షికోత్సవాలు

ఉత్తర ప్రదేశ్‌ లోని అయోధ్య రామ్‌లల్లా రామాలయ ప్రథమ వార్షికోత్సవం శనివారం రోజు ఘనంగా ప్రారంభమైంది. ఆలయ అర్చకులు రాముడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాముడ్ని దర్శించుకొని, తన్మయత్వంలో మునిగిపోయారు. ప్రప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రాంలల్లా ఆస్థానాన్ని పూలతో అలంకరించారు.  ఢిల్లీ నుంచి వచ్చిన బంగారం, వెండి తీగలతో ఎంబ్రాయిడరీ చేసిన పీతాంబర వస్త్రాన్ని రాముడికి అలంకరించారు.మహా అలంకారం అనంతరం మధ్యాహ్నం 12:20 గంటలకు స్వామివారికి మహా హారతి నిర్వహించారు. అనంతరం స్వామివారికి 56 వంటకాలతో మహా నైవేద్యాన్ని సమర్పించారు.

ఈ వేడుకల్లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. మహా హారతి అనంతరం హెలిప్యాడ్ నుంచి నేరుగా రామాలయానికి చేరుకొని, వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి రాముల వారికి హారతినిచ్చారు. దర్శనం, పూజల అనంతరం సీఎం యోగి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత నృత్య గోపాల్ దాస్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. తదనంతరం సాధు సంతులతో కలిసి అక్కడే భిక్ష స్వీకరించారు.

రామ్ లల్లా మహాభిషేక్, శ్రింగర్ ఆచారాలు పూజారులచే జరుగుతున్నాయి. అనేక వీడియోలు, దృశ్యాలలో, భక్తులు భజనలు, శ్లోకాలు పఠిస్తూ ఆలయం చుట్టూ గుమిగూడి ఉండటం చూడవచ్చు. ఈ వేడుకను గుర్తుచేసుకునేందుకు, శనివారం అయోధ్యలో మూడు రోజుల పండుగ ప్రారంభమవుతుంది. సుమారు 5వేల మంది కూర్చుని వేడుకలను తిలకించేందుకు వీలుగా అంగద్ తీలా ప్రదేశంలో జర్మన్ హ్యాంగర్ టెంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే సాంస్కృతిక ప్రదర్శనలు, రామ్ కథ ప్రవచనాలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలను వీక్షించవచ్చు.

అయోధ్య‌లో కొత్త నిర్మించిన రామ మందిరంలో రామ్‌ల‌ల్లాను ప్ర‌తిష్టాప‌న చేసి ఏడాది కావొస్తోంది. ఈ నేప‌థ్యంలో తొలి వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని నరేంద్ర మోదీ  దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ అకౌంట్‌లో ఆయ‌న పోస్టు చేస్తూ భార‌తీయ సంస్కృతి, ఆధ్మాత్మిక‌త‌కు గొప్ప వార‌స‌త్వంగా ఈ ఆల‌యం నిలుస్తుంద‌ని తెలిపారు. ఎన్నో శ‌తాబ్ధాల త్యాగాలు, పోరాటాల ద్వారా ఆల‌యాన్ని నిర్మించిన‌ట్లు చెప్పారు. నూతన‌ భార‌త్‌ను నిర్మించే అంశంలో ఈ దివ్య‌, భ‌వ్య అయోధ్య రామాల‌యం దేశ ప్ర‌జ‌ల‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు.

శ్రీరామజన్మభూమి తీర్థ కేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ “జనవరి 11వ తేదీతో అయోధ్య లో రామ మందిరం నిర్మించి ఏడాది పూర్తవుతుంది. గత సంవత్సరం రామ్‌లల్లా ప్రతిష్టోత్సవానికి హాజరు కాలేని భక్తులను ఈ సంవత్సరం ఆహ్వానించాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. దేశం నలుమూలల నుంచి పూజారులు, భక్తులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపాం” అని తెలిపారు.

ఈ మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రామ్ కథ ప్రవచనాలు, రామ్ చరిత మానస్ (మానస్ ప్రవచన్)పై ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రోజూ ఉదయం ప్రసాద పంపిణీ ఉంటుంది. ఇక ఆలయ అలంకరణ పనులు, ఉత్సవ ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయి. 110 మంది ప్రముఖ అతిథులు వార్షికోత్సవానికి హాజరవుతున్నారు. కనీసం ఒక్క రోజు అయినా అయోధ్యను సందర్శించాలని భక్తులను ఈ సందర్భంగా చంపత్ రాయ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *