కలుపు తీతలో కీలక మలుపు… కొత్త కొత్త వీడర్స్ తో రైతులకు ప్రయోజనం

సేద్యంలో కలుపు ప్రధాన సమస్య. దీని నివారణకు రైతులు అధిక వ్యయం చేస్తుంటారు. యంత్ర పరికరాలు అందుబాటులో వున్నా, కలుపు నివారణకు దోకుడు చార వాడుతూనే వున్నారు. పశుగ్రాసం కోసం కూడా ఈ పరికరాన్ని వాడుతున్నారు. ఈ పరికరానికే లీవర్‌ రూలర్‌1 సూత్రం అనుసంధానం చేయడం వల్ల పని వేగంగా సాగుతుంది. కలుపు తీయడానికి, గడ్డి సేకరించడానికి, బరువులు లేపడాఇకి ఈ పరికరం అవసరం అవుతుంది. ఈ పరికరాన్ని రైతులు బాగా వాడుకుంటున్నారు. దీనికి ఒక పొడువు కర్ర లేదా ఐరన్‌ రాడ్‌ని జత చేసినట్లయితే నిలుచుని కూడా కలుపు నివారణ చేసుకోవచ్చు. పని త్వరగా అవుతుంది కాబట్టి కలుపు వ్యయం కూడా తగ్గుతుంది. దీని ధర 300 రూపాయలు వుంటుంది.

1. అయ్యన్న వీడర్‌ : కలుపు నివారణకు వాడే పరికరం. పొలాలకు, ఇంటి పనులకు, టెర్రస్‌ పనులకు, నిమ్మ, బత్తాయి, మామిడి చెట్ల మొదళ్ల దగ్గర కలుపు నివారణకు ఉపకరించడంతో పాటు మట్టిని గుల్ల పరిచే ప్రక్రియ కూడా సాధ్యమవుతుంది. మట్టి గుల్లబారడం వల్ల చెట్టుకు ఆక్సిజన్‌ బాగా అందుతుంది. దీని ధర 100/`

2. అన్నమయ్య వీడర్‌ : ఇది కూడా కలుపు నివారణ పరికరమే. అయ్యన్న వీడర్‌ను మెరుగు పరిచి, అన్నమయ్య వీడర్‌గా తీర్చిదిద్దారు.ఈ పరికరం బేరింగ్‌ సహాయంతో తిరుగుతుంది. శారీరక శ్రమ తక్కువ. ధర 2000/`

3. ఒంగోలు గిత్త : దీనితో నేల సాళ్లలో నెట్టుకుంటూ, కలుపు నివారణతో పాటు మట్టిని గుల్లబర్చుకోవచ్చు. ధర 2,500/`. గోర్రు, గుంటక కూడా చేసుకోవచ్చు. పత్తి, మిరప, టమొటా, వాణిజ్య పంటలలో వాడుకోవచ్చు.

4. రామయ్య వీడర్‌ : తేలికపాటి కలుపు నివారణ పరికరం. ఇంటి పంటలకు, టెర్రస్‌, పంట పొలంలో కలుపు నివారణకు వాడుకోవచ్చు. ధర 1500/`
బహుళ ప్రయోజన సోలార్‌ సిస్టమ్‌

దీనిలో ఎరువులు చల్లే పరికరం ప్రొఫెసర్‌ ముప్పా లక్ష్మణరావు ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించారు. ఈ బహుళ ప్రయోజన పరికరానికి ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కాలేజీ కనెక్ట్‌ ప్రోగ్రామ్‌ 18 లో ద్వితీయ బహుమతితో పాటు 50,000 రూపాయల నగదు పురస్కారం అందింది. సేద్యానికి సంబంధించిన ప్రయోగానికి ద్వితీయ బహుమతి రావడం గర్వకారణం. రాష్ట్ర వ్యాప్తంగా 100 నమూనాలు వివిధ రంగాలలో ప్రదర్శించారు. వాటిలో ఈ పరికరం ద్వితీయ బహుమతి దక్కింది. సహజంగా రైతులు ఎరువులను బుట్టలు లేక ఐరన్‌ బొచ్చల సాయంతో చల్లుతుంటారు. దీనివల్ల అనారోగ్యానికి గురవుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ బహుళ ప్రయోజన పరికరాన్ని తయారు చేశారు. అలాగే కూలీల కొరత అధిగమించడానికి చిన్న రైతులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పరికరంతో ఎకరా పొలంలో గంట నుంచి రెండు గంటల లోపు ఎరువులు చల్లవచ్చు. పైగా ఎరువు సమానంగా విస్తరిస్తుంది. 20 కిలోలు ఒకేసారి పరికరానికి అమర్చిన బుట్టలో వేసుకోవచ్చు. టమాటా, మిరప ఇతర పంటల సాళ్ల మధ్య పోతూంటే ఇది ఎరువు చల్లుతుంది.
బహుళ ప్రయోజన సోలార్‌ సిస్టమ్‌లో ఎరువులు చల్లే పరికరానికి 18 అంగుళాలు వెడల్పు, 50 అంగుళాలు పొడువుతో ఇనుప పైప్‌ల చట్రాన్ని అమర్చి రెండు చక్రాలు ఈ చట్రానికి అనుసంధానం చేయాలి. 15 వోల్టేజ్‌ సోలార్‌ ప్యానల్‌, 12 వీడీసీ మోటార్‌, 12వీ బ్యాటరీ ఒకదానికొకటి అనుసంధానం చేయాలి. 12 వీడీసీ మోటార్‌ పైన ఎరువులు చల్లడానికి ఒక చక్రాకారంలో వుండే ఐరన్‌ ప్లేట్‌ను కూడా మోటారుకు అనుసంధానం చేయాలి. సోలార్‌ పవర్‌తో ఈ చక్రం తిరుగుతుంది. దీనిపైన ప్లాస్టిక్‌ బుట్టను అమర్చాలి. ఎరువులు అందులో పోసి, ఎరువు చక్కగా పడే విధంగా సన్న రంధ్రం చేయాలి. అందువల్ల క్షేత్రంలో నెట్టుకుంటూ పోతుంటే ఎరువులు సమంగా పడతాయి. దీని ధర 7000/`

ఉపయోగాలు :
1. స్త్రీ పురుషులిద్దరూ ఈ పరికరంతో ఎరువులు చల్లవచ్చు.
2. నీరు కూడా చల్లుకోవచ్చు.
3. ఖర్చు తక్కువ
4. ఒకసారి చార్జ్‌ అయ్యాక 5 గంటల బ్యాకప్‌ కరెంట్‌ వినియోగించుకోవచ్చు
5. చిన్న రైతులకు చేదోడు వాదోడుగా వుంటుంది.

శ్రీవరి సాగు లేదా సాళ్ల యాతలో కలుపు తీత పరికరం

శ్రీవరి సాగు లేదా సాళ్ల యాతలో కలుపు తీయడానికి సులువైన పరికరం తయారు చేశాం. వరిలో కలుపు తీయడానికి 4000 నుంచి 5000 ఖర్చు అవుతుంది. బురదలో రైతులు కోనోవీడర్‌తో సాళ్లలో కలుపు తీస్తూ వుంటారు. కోనోవీడర్‌ బరువు 2 నుంచి 3 కేజీల బరువుకు తగ్గించడం వల్ల, బురదలో రైతులు సులభంగా ముందుకు పోతూ కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌ టెక్నాలజీ ఆధారంగా ఈ పరికరం రూపొందింది. ఈ పరికరంలో ప్లాస్టిక్‌ చక్రం మందమైన బేళ్లు వున్న రెండు చక్రాలను 6 అంగుళాల గ్యాప్‌లో బుష్‌ల ద్వారా అమర్చుతారు. ఈ అమరికను 5 అడుగుల రాడ్‌కు అనుసంధానం చేస్తారు. చిన్న పడవ లాంటి అమరికను 7 అంగుళాల వెడల్పులో తయారు చేసి, పరికరానికి అనుసంధానం చేశాం. దీని వల్ల పరికరం బురదలో కూరుకుపోదు. పరికరం వెడల్పు 8 అంగుళాలు. ఇంజను అవసరం లేకుండా ఈ పరికరాన్ని పూర్తిగా పర్యావరణ హితంగా రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *