మన D4 యాంటీ డ్రోన్ డ్రోన్ సిస్టమ్ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్
భారత్ దేశీయంగా తయారు చేసిన ఆయుధాలకు ప్రపంచ విపణిలో భారీగా డిమాండ్ పెరిగింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఎక్కువగా దేశీయంగా తయారు చేసిన ఆయుధాలనే వాడి, పాక్ కి ముచ్చెమటలు పోయించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు డీఆర్డీవో తయారు చేసిన D4 యాంటీ డ్రోన్ విజయవంతమైంది. దీంతో దీనికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ వచ్చింది. D4 యాంటీ డ్రోన్ డ్రోన్ సిస్టమ్ ను డీఆర్డీవో అభివృద్ధి చేయగా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) తయారు చేసింది. స్వదేశీ రక్షణ సాంకేతికతతో తయారైన D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ తమకు కావాలని ఇప్పటికే తైవాన్ అధికారికంగా భారత్ ను అడిగింది. ఈ మేరకు సంప్రదింపులు కూడా జరిగాయి. ఈ విషయాన్ని డీఆర్డీవోకి సంబంధించిన ఓ అధికారి ధ్రువీకరించారు.
తైవాన్ సరిహద్దుల దగ్గర ఈ మధ్య తరుచుగా చైనాకి సంబంధించిన డ్రోన్ చొరబాట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నిరోధించడానికి తైవాన్ భారత్ ని సంప్రదించింది. ఈ నేపథ్యంలో భారత దేశ నూతన ఆవిష్కరణలు, రక్షణ తయారీలు, భారత్ అభివృద్ధి చేసిన ఆయుధాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. అలాగే వాటిపై నమ్మకం కూడా ఏర్పడుతోంది.
చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ తరుణంలో కిన్మెన్, మాట్స్ దీవుల వంటి సున్నిత ప్రాంతాల చుట్టూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ దృష్ట్యానే తైవాన్ భారత్ ను సంప్రదించింది. గత కొన్ని సంవత్సరాలుగా, తైవాన్ తన గగనతలం సమీపంలో డ్రోన్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని పేర్కొంటోంది. అయితే.. వీటిని ఎదుర్కోవాలంటే తైవాన్ కి పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. అయినా సరే.. యాంటీ డ్రోన్ పరిష్కారాల కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే డీ4 యాంటీ డ్రోన్ వ్యవస్థ తైవాన్ దృష్టిని ఆకర్షించింది.
యాంటీ డ్రోన్ వ్యవస్థ D4 అంటే…
పశ్చిమ సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ తరచూ ప్రయోగిస్తున్న డ్రోన్ల చొరబాట్లకు భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ‘డ్రోన్-డిటెక్ట్, డెటర్ అండ్ డిస్ట్రాయ్’ (D4) వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకట్ట వేసింది. ఇజ్రాయెల్ తన సరిహద్దుల్లో హమాస్, హౌతీల రాకెట్ దాడులను నిరోధించడానికి వినియోగిస్తున్న ప్రఖ్యాత ‘ఐరన్ డోమ్’ వ్యవస్థకు ఇది దీటుగా నిలుస్తోంది. ఈ అదృశ్య కవచం, పాకిస్థాన్ వినియోగిస్తున్న టర్కిష్ డ్రోన్లతో సహా అనేక వైమానిక చొరబాట్లను విజయవంతంగా నిర్వీర్యం చేసింది. డీ4 యాంటీ డ్రోన్ వ్యవస్థ ద్వారా దేశంలోని కీలక రక్షణ కేంద్రాలను రక్షించుకోవచ్చు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన దాడుల్లో డ్రోన్లను భారీగా వాడారు. డ్రోన్ల దాడిని తిప్పికొట్టేందుకు గగనతల రక్షణ వ్యవస్థనూ బాగా ఉపయోగించారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్లను భారత ఎస్-400, ఆకాశ్ వంటి క్షిపణులు, భారత్ ఎలక్ట్రోనిక్స్ లిమిటెడ్ తయారు చేసిన డీ4 (డ్రోన్ డిటెక్షన్, డెటర్ అండ్ డెస్ట్రాయ్) సిస్టమ్స్ ప్రధాన పాత్ర పోషించాయి.
డీ4లో రాడార్లు, లేజర్లు, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ ప్రధానమైనవి. డీఆర్‌డీవో వీటిని అభివృద్ధి చేసింది. ఆ తర్వాత వీటిని దేశం కోసం భారీ సంఖ్యలో తయారు చేసింది మాత్రం బీఈఎల్. డీ4 సిస్టమ్స్‌కు రాడార్లను బెంగళూరు యూనిట్‌లో తయారు చేశారు. అలాగే, జామర్లను హైదరాబాద్‌లోని యూనిట్ ఉత్పత్తి చేసింది.
ఈ దశ తర్వాత వీటిని ఏపీలోని మచిలీపట్నానికి పంపుతారు. అక్కడి యూనిట్ ఎలక్ట్రో ఆప్టిక్ ఉపకరణాలను తయారు చేసి, రాడార్లు, జామర్లను అనుసంధాస్తుంది. దీంతో డీ4 సిస్టమ్ పూర్తి స్థాయిలో రెడీ అవుతుంది. శత్రుదేశం నుంచి దూసుకొచ్చే డ్రోన్లను మన రాడార్లు చాలా దూరం ఉండగానే గుర్తిస్తాయి.ఆ డ్రోన్లు మరింత ముందుకు వచ్చాక కెమెరాలు, లేజర్ రేంజ్ ఫైండర్ వంటి ఎలక్ట్రో ఆప్టిక్ పరికరాలు ఆ డ్రోన్లను మరింత క్లియర్‌గా గుర్తించి మన సైనికులను అప్రమత్తం చేస్తాయి. దీంతో శత్రు డ్రోన్లను జీపీఎస్ జామింగ్ లేదా లేజర్ ఎక్స్‌పరిమెంట్ ద్వారా కూల్చుతారు.
సాధారణంగా డ్రోన్లను శత్రువుల గగనతలంవైపు పంపేటప్పుడు జీపీఎస్ ద్వారా ప్రోగ్రామ్ చేస్తారు. ఇండియాలో స్థావరాలు ఎక్కడ ఉన్నాయన్న శాటిలైట్ డేటాను డ్రోన్లలో పొందుపరుస్తారు. అనంతరం గూగుల్ మ్యాప్ సాయంతో ఆ డ్రోన్లు లక్ష్యాల వద్దకు చేరుకుని దాడి చేస్తాయి. డ్రోన్లలోని జీపీఎస్ సిగ్నల్‌ను జామ్ చేస్తే డ్రోన్లకు ఎటు వైపు వెళ్లాలో తెలియక తికమకపడి కూలిపోతాయి. లేకపోతే భారత్ ఆ డ్రోన్లపైకి లేజర్‌ను పంపి ధ్వంసం చేస్తుంది. పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్లను కూల్చడంలో డీ4 సిస్టమ్స్ బాగా పనిచేశాయి.