ఐఎస్‌ఐతో నిత్యం అంటకాగే వ్యక్తి కార్యక్రమానికి ఎలా వెళ్తారు? బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌పై జనాగ్రహం

బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. నిత్యం పాకిస్తాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలుండే పాక్‌ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యాపారవేత్త రెహన్‌ సిద్ధిఖీ నిర్వహించే ఓ పెద్ద ఈవెంట్‌కి వెళ్తున్నారు. ఈ కంపెనీకి ప్రచారకర్త మాధురీ దీక్షిత్‌. పాక్‌ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యాపారవేత్త రెహన్‌ సిద్దిఖీ ఆగస్టు మాసంలో తన కంపెనీల ప్రమోషన్‌ కోసం టెక్సాస్‌లో ఓ భారీ ఈవెంట్‌ నిర్వహిస్తున్నాడు. నిత్యం ఐఎస్‌ఐతో సంబంధాలు నెరిపే సిద్దిఖీ సంస్థలన్నింటినీ భారత ప్రభుత్వం నిషేధిత జాబితా (బ్లాక్‌ లిస్టు)లో వుంచింది. అలాంటి సంస్థలు, అలాంటి వ్యక్తులు నిర్వహించే ఈవెంట్‌కి మాధురీ దీక్షిత్‌ వెళ్తుండటంపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారతీయులు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆమె టెక్సాస్‌ ఈవెంట్‌ నుంచి తప్పుకోవాలని నెటిజన్లు, దేశ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

సిద్దిఖీ నేపథ్యమిదీ….

రెహాన్‌ సిద్ధిఖీ యునైటెడ్‌ స్టేట్స్‌లోని దక్షిణాసియా వినోద చిత్ర పరిశ్రమలో ప్రముఖునిగా వున్నాడు. బాలీవుడ్‌ సెలెబ్రెటీల కోసం ఈవెంట్‌లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించే విషయంలో పేరు సంపాదించుకున్నాడు. అయితే… పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆయన ప్రతిష్ఠ బాగా దెబ్బతిన్నది. 2020 సంవత్సరంలో అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి దీనిపై ఓ ప్రకటన చేశారు. సిద్దిఖీని బ్లాక్‌ లిస్టులో వుంచామని, అతనితో ఎవ్వరూ అంటకాగొద్దని బాలీవుడ్‌ ప్రముఖులను బహిరంగా హెచ్చరించారు కూడా. మన దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని, అలాగే అసాంఘిక శక్తులతో జట్టు కట్టడంతో సిద్దిఖీ విషయంలో భారత ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

సిద్దిఖీ నిర్వహించే గ్రాండ్‌ ఈవెంట్‌ విషయంలో మాధురీ దీక్షిత్‌ కీలక ప్రకటన చేయడంతో దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన నిర్ణయాన్ని పున: పరిశీలించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. సిద్దిఖీతో మాధురీ దీక్షిత్‌ సంబంధాలను కొనసాగించడమంటే భారత ప్రభుత్వ చట్టాలను అతిక్రమించడమే అవుతుందని, అలాగే భారత సైన్యాన్ని నిరుత్సాహపరచడమే అవుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు.

మాధురీ దీక్షిత్‌ నిర్ణయంపై రాజకీయ ప్రముఖులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. మొదట్లో సిద్దిఖీని బ్లాక్‌ లిస్టులో చేర్చిన అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. తన వైఖరిలో మార్పు వుంఉడదని, జాతీయ భద్రతను అందరూ దృష్టిలో వుంచుకోవాలన్నారు. అలాగే బాలీవుడ్‌ ప్రముఖులు తమ సంబంధాలను పున:స్సమీక్షించుకోవాలన్నారు. భారత ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో వుంచిన, ఐఎస్‌ఐ సంబంధాలున్నాయని ఆరోపించిన వారితో కలిసి పనిచేయడం అంటే మన భద్రతా దళాలకు మరియు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలకు చాలా నిరుత్సాహపరిచే అంశమని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *