భక్తిమార్గాన్ని చూపిన మధ్వాచార్యులు
శ్రీ మధ్వాచార్యులు 1238వ సంవత్సరం విజయదశమి రోజున కర్ణాటకలోని ఉడుపి సమీపాన ‘పాజక’ అనే కుగ్రామంలో జన్మించారు. శ్రీ మధ్వాచార్యులు ప్రవచించిన ‘ద్వైత వేదాంతం’ ప్రకారం ఆత్మ, పరమాత్మ వేర్వేరు. పరమాత్మ సర్వ స్వతంత్రమైనది, ఆత్మ పరమాత్మ మీద ఆదారపడి ఉంటుంది అని ‘ద్వైతం’ తెలియ జేస్తుంది. యుక్తవయసులో వారు సన్యాసం స్వీకరించి బ్రహ్మ సంప్రదాయానికి చెందిన ‘అచ్యుత ప్రేక్ష’ ను గురువుగా స్వీకరించారు. సనాత ధర్మానికి చెందిన అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసి, ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పారు. సంస్కృతంలో సుమారు ముప్పది ఏడు వ్యాఖ్యానాలను రచించారు. వారు ఆది శంకరుల అద్వైతంతోను, రామానుజుల విశిష్ఠా ద్వైతంతోను విభేదించారు. కాశీ, బెంగాల్, ద్వారక, గోవా, కన్యాకుమారి ఇలా దేశంలోని ప్రముఖ స్థలాలన్నీ పర్యటించారు. 1285 సంవత్సరంలో ద్వారక నుండి తీసుకు వచ్చిన శ్రీ కృష్ణ విగ్రహాన్ని ఉడుపిలో ప్రతిష్ఠించారు.
భక్తి లేని జ్ఞానం, కర్మ నిరర్ధకమని ప్రవచిం చారు. భక్తి ద్వారా పరమాత్మ కటాక్షం సిద్ధిస్తుంది. పరమాత్మ కటాక్షం ద్వారా ఆత్మకి విముక్తి లభిస్తుంది అని బోధించారు. ఉడుపిలో ఎనిమిది మఠాలను స్థాపించారు. దేశం మొత్తంలో ఇరవై నాలుగు మఠాలు స్థాపించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీ మధ్వాచార్యుల వారిని వాయుదేవుడి అంశగా భావిస్తారు. వారి తండ్రి మధ్యగేహభుట్టు, తల్లి వేదవతి. తల్లిదండ్రులు పెట్టిన పేరు ‘‘వాసుదేవ’’ అయినా మధ్వాచార్యులు, పురాణ ప్రజ్ఞ, ఆనంద తీర్థ అనే పేర్లతో కూడ ప్రసిద్ధి చెందారు.
మధ్వాచార్యులవారి నిర్యాణం ఎప్పుడు జరిగింది అనేది ఇతమిద్ధమైన సమయం చరిత్రలో లేదు. అయితే వారి 80వ సంవత్సరంలో 1317 మాఘ మాసం తొమ్మిదవ రోజు ఐతరేయ ఉపనిషత్తు శిష్యులకు బోధించిన తరువాత ఆ ప్రదేశం నుంచి ఆదృశ్యమైన రోజును వారి పుణ్యతిథిగా భావిస్తున్నారు.