ఎర్రకోట, తాజ్ మహల్ కూడా మావే అంటారు… వక్ఫ్ బోర్డుపై హైకోర్టు అసహనం

చారిత్రాత్మక బుర్హాన్ పూర్ కోటను వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ తీసుకున్న నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా వక్ఫ్ బోర్డు పక్షాన వకాల్తా తీసుకున్న న్యాయవాదికి చురకలంటించారు. ‘‘రేపు మీరు తాజ్ మహల్ మరియు ఎర్రకోట వంటి అన్ని చారిత్రక భవనాలను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటిస్తారు. తాజ్ మహల్, ఎర్రకోటను కూడా తీసుకోవచ్చు. ఎవరు తిరస్కరిస్తున్నారు?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు. బుర్హాన్ పూర్ లోని మూడు చారిత్రాత్మక భవనాలకి సంబంధించిన హక్కు విషయంలో వివాదం మొదలైంది. హైకోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పక్షానే నిలిచింది.
షా షుజా సమాధి, నాదిర్ షా సమాధి, బీబీ సాహిబ్ మసీదుతో పాటు కోట ప్రాంగణంలో వున్న రాజభవనం కూడా తమదేనంటూ వక్ఫ్ బోర్డు పేర్కొంది. ఇవన్నీ తమ ఆస్తులేనని, ఏఎస్ఐ ని ఖాళీ చేయించాలని వక్ఫ్ బోర్డు కోరడంతో వివాదం రాజుకుంది. దీంతో ఏఎస్ఐ హైకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేసింది. బుర్హాన్ పూర్ లోని 4.448 హెక్టార్ల విస్తీర్ణంలో వున్న ఆస్తి, 1904 నాటి పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టం ప్రకారం రక్షిస్తున్నామని కోర్టు ముందు వాదించింది.అలాగే వీటిని ఏకపక్షంగా వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించలేమని కోర్టులో వాదించింది. దీంతో హైకోర్టు ఏఎస్ఐ పక్షాన నిలిచింది. వక్ఫ్ బోర్డు నోటిఫికేషన్ చెల్లదని, వాదనకు చట్టపరమైన ఆధారాల్లేవని తేల్చి చెప్పింది.
జూలై 26 న జస్టిస్ అహ్లువాలియా నేతఈత్వంలోని బెంచ్ ఈ ఆస్తులన్నీ కూడా 1904 లో చేసిన ఆన్షియెంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ కింద పురాతన కట్టడాలుగా 1913, 1925లో అధికారిక ప్రకటన ద్వారా వీటిని పురాతన కట్టడాలుగా నిర్ధారించారని పేర్కొంది. ఈ చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం ఈ ఆస్తులన్నీ చీఫ్ కమిషనర్ కట్టడిలో వుంటాయి. వీటిని ఈ చీఫ్ కమిషనర్ కట్టడిలోంచి తొలగించినట్లు ఎలాంటి ఆధారాల్లేవని కోర్టు పేర్కొంది. అసలు ఇవన్నీ వక్ఫ్ ఆస్తులని ఎలా అనుకుంటున్నారని నిలదీసింది. వక్ఫ్ బోర్డు న్యాయవాది కోర్టు వారికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో చారిత్రక భవనాలన్నీ మావే అని అంటారని న్యాయమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *