దేవాదాయ శాఖ విద్యా సంస్థల్లో అన్యమతస్థులు వుండొద్దు : హైకోర్టు

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగే విద్యా సంస్థల ఉద్యోగుల విషయంలో మద్రాసు హైకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఈ విద్యా సంస్థల్లో ఇతర మతస్థులను నియమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తమిళనాడు హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధీనంలో కొనసాగుతున్న చెన్నై కొళత్తూర్‌ కపాలీశ్వరర్‌ ఆర్ట్స్, సైన్స్‌ కళాశాలలో పలు ఉద్యోగాల భర్తీకి 2021లో నోటిఫికేషన్‌ వెలువడింది. కార్యాలయ సహాయకుడి పోస్టుకు ముస్లిం మతానికి చెందిన సుహైల్‌ చేసుకున్న దరఖాస్తు నిరాకరణకు గురైంది. దీన్ని సవాలు చేస్తూ ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.
ముస్లిం అనే కారణంతో తనకు ఉద్యోగాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని, హిందువులనే అనుమతిస్తామని చెప్పడం దేవాదాయశాఖ పనులకు మాత్రమే చెల్లుతుందని, విద్యాసంస్థలకు వర్తించబోదని తెలిపారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ వివేక్‌కుమార్‌ సింగ్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. దేవాదాయశాఖ ప్రత్యక్ష ఆధీనంలో కొనసాగే సంస్థల్లో ఇతర మతస్థులను ఉద్యోగంలో చేర్చుకోలేమనే నిబంధన ఉన్నట్లు దేవాదాయశాఖ తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. దేవాదాయశాఖ నిబంధన 10 ప్రకారం హిందూ మతస్థులనే సంబంధిత కళాశాల ఉద్యోగంలో నియమించడానికి సాధ్యపడుతుందని హైకోర్టు తీర్పునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *