ముగిసిన మహా కుంభమేళా… 45 రోజుల పాటు భక్తుల పుణ్య స్నానాలు

ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. చివరి రోజైన మహా శివరాత్రి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హరహర మహాదేవ్ నామస్మరణంతో త్రివేణీ సంగమం ఘాట్లు మార్మోగిపోయాయి. కుంభమేళాలో చివరి అమృత స్నానం ఆచరించేందుకు భక్తులు అర్ధరాత్రి నుంచే ఘాట్ల వద్దకు చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో కలిసి గోరఖ్ పూర్ కంట్రోల్ రూమ్ లో ఉదయం నుంచే ఏర్పాట్లను పర్యవేక్షించారు.

జనవరి 13 న మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. సాధువులు, నాగ సాధువులు, అఖారాలు, సామాన్య భక్తులు, విదేశీయులు కూడా తరలివచ్చి, పుణ్య స్నానాలు ఆచరించారు. 45 రోజుల పాటు మహా కుంభమేళా అంగరంగ వైభవంగా సాగింది. దాదాపు 65 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. మహా కుంభమేళాతో ఆధ్యాత్మికంతో పాటు ఆర్థికంగా కూడా ఆ ప్రాంతం పరిపుష్టమైంది. పాలనా పరంగా కూడా అధికారులు ప్రశస్తంగా పనిచేశారు. తొక్కిసలాట జరగడం అత్యంత దురదృష్టకరమైన సంఘటనే. కానీ.. మహా కుంభం అటు భక్తికీ, ఇటు ఆర్థిక వనరులకు కూడా కేంద్రమైంది.

మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపు 3 లక్షల కోట్లకు పైగా ఏర్పాట్లకు ఖర్చు చేసింది. పరిశ్రమ నిపుణులు, వాణిజ్య సంస్థలు, కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తో సహా ,FMCG మరియు టెక్నాలజీ, స్టార్టప్ ల వరకూ అన్న రంగాలలోని వ్యాపారాల విస్తరణకు మహా కుంభమేళా ఉపయోగపడింది.

మరోవైపు మహాకుంభ్ చరిత్రలో మొదటిసారిగా కృత్రిమ మేధస్సు (AI) ను ఉపయోగించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 1,800 AI ప్రారంభించిన వాటితో సహా 3,000 కెమెరాలను భద్రత కోసం ఉపయోగించారు. అలాగే డ్రోన్లను కూడా వాడారు. తొక్కిసలాట, ఇతర అవాంఛనీయ సంఘటనలను నిరోధించడానికి 60,000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.

మహా కుంభమేళా అధికారికంగా ముగిసినా… ఇప్పటికీ భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో యథావిథిగా అక్కడి ఏర్పాట్లను కొనసాగిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు అధికారులందరూ అత్యంత సమర్థవంతంగా, నిష్ఠతో పనిచేశారని యూపీ ప్రభుత్వం ప్రశంసించింది.కుంభామేళా ముగింపు సందర్భంగా స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఇందుకు 20 క్వింటాళ్ల గులాబీ పూలను వాడారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *