రైతులకో వాట్సాప్ గ్రూప్.. సందేహాలకు జవాబులూ అందులోనే..
రైతుకు సమాచారమే అత్యంత ప్రాధాన్యం. వాతావరణం ఎప్పుడు ఎలా వుంటుందో రైతుకి అత్యంత అవసరం. ఈ అవగాహన లేకుండా రైతులు పంటలు వేసి, నష్టపోతుంటారు. అలాగే అప్పులు కూడా చేస్తుంటారు. దీంతో… మహబూబ్ నగర్ జిల్లా వ్యవసాయ అధికారులు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో వ్యవసాయ అధికారులు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇందులో రైతులను యాడ్ చేస్తూ.. వారికి కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నారు. పంటలకు తెగుళ్లు వస్తే ఏం చేయాలి? పంటల సాగులో పాటించాల్సిన మెళుకువలు… వాతావరణ పరిస్థితులు.. ఇలా అన్నింటినీ అందులో చెబుతున్నారు. దీంతో క్షణాల్లో క్షేత్ర స్థాయిలో వున్న రైతులకు సమాచారం చేరిపోతుంది.
ఈ గ్రూపుల్లో వ్యవసాయంలో యాక్టివ్ గా ఉన్న రైతులు, యువ రైతులను దాదాపు 250 మంది నుంచి 300 మంది వరకు జాయిన్ చేశారు. తద్వారా సదరు రైతులకు పంటల సాగులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తున్నారు. రైతు సాగు చేసిన పంటకు చీడ పీడలు, తెగుళ్లు ఆశించినప్పుడు వాటి నివారణకు ఎలాంటి మందులు వాడాలి.. ఎంత మోతాదులో పిచికారీ చేయాలనే విషయాలను రైతులకు తెలియజేస్తున్నారు.
మొదట రైతులు తమకు వచ్చిన ఇబ్బందులను ఫొటో తీసి, వాట్సాప్ గ్రూపులలో వేస్తున్నారు. ఉదాహరణకు పంటకు ఇబ్బందులు రావడం, తెగులు రావడం వంటివి వస్తే.. వెంటనే వాట్సాప్ లో పోస్ట్ చేసేస్తారు. దీంతో తెగులు నివారణకు ఏఏ మందులు పిచికారి చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను రైతులకు వాట్సాప్ ద్వారానే వ్యవసాయాధికారులు వేగంగా సమాచారం అందజేస్తున్నారు. వ్యవసాయ అధికారులు పంట పొలాల్లోకి రావడం… చెప్పండం అనేది ఆలస్యమవుతుంది. కానీ అప్పటికప్పుడే సమాచారాన్ని వాట్సాప్ లో పంపడం ద్వారా రైతుకి మేలు జరుగుతోంది.
ప్రభుత్వ పథకాలను కూడా గ్రూపుల్లో షేర్ చేస్తున్న అధికారులు
చాలా మంది రైతులకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలపై అవగాహన వుండటం లేదు. దీంతో వ్యవసాయ రంగంలో ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వివరంగా అధికారులు గ్రూపుల్లో పెడుతున్నారు.వాణిజ్య పంటలతోపాటు, హార్టికల్చర్ పంటలకు సంబంధించిన వివరాలను గ్రూపుల్లో పోస్టులు చేస్తున్నారు. చీడపీడలు, తెగుళ్లు తదితర వాటిపై అగ్రికల్చర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అందించే సూచనలు, సలహాలను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తూ రైతుల్లో అవగాహన పెంచుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా మామిడి తోటల రైతులతోకలిపి హార్టికల్చర్ అధికారులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మామిడి రైతులకు పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు.