మహాశివరాత్రి

మహాశివరాత్రి చాంద్రమానం ప్రకారం మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం తెలియ జేస్తోంది. చతుర్దశి రోజు అర్ధరాత్రి లింగోద్భవ కాలంగా పరిగణిస్తారు. పార్వతిదేవి, పరమ శివుడి వివాహాం జరిగిన రోజు కూడా శివరాత్రి అని భావిస్తారు.

వేదాలలోని ‘రుద్రసూక్తం’గా పిలువబడే ప్రత్యేకమైన మంత్రాలను పండితులు పఠిస్తూ ప్రాతఃకాలంలో శివుడికి అభిషేకం చేస్తారు. దీనినే ‘‘రుద్రాభిషేకం’’ అని పిలుస్తారు. శివలింగంతోపాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందు కొంటుంది. పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో ప్రముఖమైనది. ఈ మంత్రంలోని అయిదు అక్షరాలు ‘న’ ‘మ’ ‘శి’ ‘వా’ ‘య’ (ఓం నమశ్శివాయ) భక్తితో పఠిస్తారు.

మహామృత్యుంజయ మంత్రం లేదా త్రయంబక మంత్రము యజుర్వేదంలో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టటానికి జపిప్తారు.

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్ఠివర్థనమ్‌

ఉర్వారుక మివబంధనాత్‌ మృత్యోర్ముక్షీయ మామృతాత్‌

భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో శివరాత్రి రోజున విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేపాల్‌లోని ప్రఖ్యాత పశుపతినాధ దేవాలయం వద్దకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది భక్తులు చేరుకొంటారు. భాగమతి నదిలో స్నానం చేసి శివుడిని ఆరాధిస్తారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు చిట్టగాంగ్‌ ప్రాంతంలోని ‘చంద్రనాధ్‌ థామ్‌’ వద్దకు చేరుకొని శివుడిని ఆరాధిస్తారు.

క్షీరసాగర మధనంలో ఉద్భవించిన హాలాహాలాన్ని శివుడు స్వీకరించి తన కంఠంలో నిలిపాడు. గరళ కంఠుడిగా నిలచి లోకాన్ని రక్షించాడు. మంగళకరుడైన శివుడి ఆరాధన లోక కల్యాణం కోసం ఎన్ని కష్టాలైనా భరించాలని మహాశివరాత్రి పర్వదినం తెలియజేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *