హైదరాబాద్ టీసీఎస్ కార్యాలయం దగ్గర ‘‘మహిళా సురక్షా వేదిక’’ నిరసన
నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.అయితే..దీనిని నిరసిస్తూ ‘‘మహిళా సురక్షా వేదిక’’ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని టీసీఎస్ కార్యాలయం దగ్గర మహిళలు అధిక సంఖ్యలో శాంతియుత ధర్నాకు దిగారు.ఐటీ కారిడార్‌లో హిందూ మహిళా ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులు మరియు ‘లవ్ జిహాద్’ పేరిట సాగుతున్న భావోద్వేగ మోసాలకు వ్యతిరేకంగా వందలాది మంది మహిళలు ఏకమై నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సాఫ్ట్ వేర్ రంగంలో హిందూ మహిళల భద్రతపై మహిళా లోకం అనేక ప్రశ్నలను లేవదీశారు.
సాఫ్ట్ వేర్ కంపెనీలు హిందూ మహిళల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మహిళా లోకం ఈ సందర్భంగా ఆక్షేపించింది. విశాఖ కేసు తీర్పులో 2013 లో సుప్రీం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని, అలాగే POSH చట్టం కూడా అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. దీని ప్రకారం ప్రతి కార్యాలయంలో మహిళలకు రక్షణ కల్పించడం యాజమాన్యాల యొక్క ప్రాథమిక బాధ్యత అని మహిళలు గుర్తు చేశారు. దీనిని అమలు చేయడంలో నాసిక్ టీసీఎస్ ఘోరంగా విఫలమైందని, 2022 నుండే బాధితులు తమకు ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.

అలాగే బాధితులకు అండగా నిలవాల్సిన HR విభాగం ఇంత జరుగుతున్నా నిశ్శబ్దంగానే వుండిపోయిందని, నిందితులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల సంస్థపై వున్న నమ్మకం సడలిపోయిందన్నారు.అలాగే చట్టం ప్రకారం ప్రతి కంపెనీలో తప్పనిసరిగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటూ వుండాలని, ఈ కమిటీ మహిళల ఫిర్యాదులను స్వీకరించి, గరిష్టంగా 90 రోజుల్లోపు విచారణ పూర్తి చేయాలని, కానీ టీసీఎస్ లో ఆ కమిటీ ఉనికే ప్రశ్నార్థకమైందని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులు తమ ప్రతిష్ఠ కోసం వాస్తవాలను తొక్కిపెడుతున్నాయన్న అనుమానాలు తమకు కలుగుతున్నాయని మహిళలు పేర్కొంటున్నారు.
అయితే.. నాసిక్ లోని టీసీఎస్ లో జరిగిన వ్యవహారం అంతా కేవలం ప్రేమ వ్యవహారంగా మాత్రమే చూడలేమని, ఓ పద్ధతి ప్రకారం సాగుతున్న భావోద్వేగ మోసం అని మహిళలు విరుచుకుపడ్డారు.ముఖ్యంగా హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారిని మానసికంగా లొంగదీసుకుని బాధితులుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్ వంటి ఉన్నత రంగాల్లో కూడా ఇలాంటి ‘ట్రాపింగ్’ జరగడం ఆందోళనకరమని అన్నారు.
మరోవైపు మహిళా సురక్షా వేదిక ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను వుంచింది.
1. మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వం కూడా కార్పొరేట్ వేధింపులపై సిట్ నియమించాలి.
2. రాష్ట్రంలోని అన్ని పబ్లిక్ మరియు ప్రైవేట్ కంపెనీలు తమ ICC కమిటీల పనితీరుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలి.
3.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన SHE-BOX వంటి ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థను ప్రతి ఐటీ కంపెనీలో తప్పనిసరి చేయాలి. బాధితులు భయం లేకుండా ఫిర్యాదు చేసే వాతావరణం కల్పించాలి.

అయితే మహిళా భద్రత అనేది కేవలం చట్టం మాత్రమే కాదని, అది సమాజ నైతిక బాధ్యత అని మహిళలు పేర్కొన్నారు.కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల వేటలో మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టకూడదని మహిళలు పేర్కొన్నారు.