మారుమూల ప్రాంతంలో గిరిజనులకు ‘‘అక్షర జ్ఞానం’’ పోస్తున్న మాలతి ముర్ము
బెంగాల్ లోని జిలింగ్ సెరెంగ్ అనే ఓ మారుమూల గ్రామంలో నిశ్శబ్దంగా మార్పు మొదలైంది. కాస్త చదువుకున్న మాలతి ముర్ము అనే గిరిజన మహిళ… అక్కడ చిన్నపాటి విప్లవమే సృష్టిస్తోంది. అదంతా ఆదివాసీ గ్రామమే. కనీసం అక్కడి పిల్లలకు వారి మాతృభాషలోనూ రాయడం రాదు. కానీ.. ఓ 45 మంది పిల్లలను చేరదీసి.. చదువు నేర్పిస్తోంది. మట్టితో కట్టన గోడల మధ్య బోర్డుపై అక్షరాలు నేర్పిస్తోంది. సాదాసీదా గృహిణి, ఇద్దరు పిల్లల తల్లిగా వుంటూనే.. ఇదంతా చేస్తోంది. తానేమీ ఆశించడం లేదని, తన ప్రాంతంలోని పిల్లలకు చదువు రావాలని, వారి బతుకులు బాగుపడాలన్నదే తన స్వార్థమని మాలతి ముర్ము పేర్కొంది. ఇంత చేస్తున్నా.. ఎవ్వరి వద్ద నుంచీ ఒక్క కాసు కూడా తీసుకోవడం లేదు. తన బిడ్డను ఎత్తుకొనే, పాఠాలు చెబుతుంది. అప్పట్లో ఝాన్సీ రాణి తన బిడ్డను భుజానికేసుకొనే యుద్ధం చేసింది. ఇప్పుడు మాలతి ముర్ము బిడ్డును ఎత్తుకొనే పాఠాలు చెబుతోంది.ఇది కేవలం పాఠశాల మాత్రమే కాదు. ఓ మహిళ దృఢ సంకల్పంతో నడుస్తున్న ఉద్యమమే. చదువు విషయంలో, సమాజ స్పృహ విషయంలో ఆశలు వదులుకున్న సమాజానికి తిరిగి ఊపిరి పోస్తోంది మాలతి ముర్ము.

మాలతికి 2019 లో బంకా ముర్ముతో వివాహమైంది. ఆ తర్వాత ఈ గ్రామానికి వచ్చేసింది. అయితే.. తాను ఉపాధ్యాయురాలు కావాలని, ఇక్కడి రూపు రేఖలను మార్చేయాలని ముందస్తు ప్రణాళికతో మాలతి రాలేదు. తన అత్తగారింట్లో సాధారణ గృహిణిగానే వుండాలన్న సంకల్పంతోనే వచ్చింది. కానీ.. అక్కడి వాతావరణం, పాఠశాల లేకపోవడం, పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా, తమ భవిష్యత్తును పాడుచేసుకుంటుండం అన్నీ… తన కళ్ల ముందు మెదిలాయి. అంతేకాకుండా శిథిలావస్థలో వున్న పాఠశాలను చూసి మాలతి మనస్సు తరుక్కుపోయింది. అప్పుడే తనలో ఈ సంకల్పం తన్నుకొచ్చింది. అక్కడి పిల్లలకు పాఠాలు బోధించాలని, ఓ చిన్నపాటి పాఠశాలను నిర్మించాలని నిర్ణయించింది. అందుకు తన భర్త బంకా ముర్ము కూడా బాగా ప్రోత్సహించాడు.
అయితే.. ఇక్కడ ఓ పాఠశాల వుండేదని, కానీ..పిల్లలెవ్వరూ వెళ్లేవారు కాదని, అది శిథిలావస్థలోకి వెళ్లిపోయిందని ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా కోవిడ్ సమయంలో కూడా ఇబ్బందులు రావడంతో మొత్తానికే ఆ పాఠశాలను పట్టించుకున్న నాథుడు లేకుండా పోయాడు.
కానీ.. భార్యా భర్తలిద్దరూ దృఢ సంకల్పంతో వారి ఇంట్లోనే, సొంత స్థలంలోనే మట్టి గోడలతో నిర్మించిన పాఠశాలను ప్రారంభించారు. ఇందుకు గ్రామస్థులు కూడా కాస్త సహాయం చేశారు. భర్త ఓ బోర్డును కూడా సిద్ధం చేసేశాడు. స్కూలు అయితే ప్రారంభం అయ్యింది కానీ.. మొదట్లో ఎవ్వరూ వచ్చేవారే కాదు. కొంత మంది ఈమె పాఠాలు చెప్తుందా? అని సంకోచంగా కూడా వుండేవారు. మరికొంత మంది నవ్వుకునేవారు. కానీ.. ఆమె ఎక్కడా వెనకడుగు వేయనేలేదు. భర్త కూడా బాగా ప్రోత్సహించారు. దాని తర్వాత తన బిడ్డను ఎత్తుకొని ఇల్లిల్లూ తిరుగుతూ ‘‘మీ పిల్లలకు నేను చదువు చెబుతాను. నా దగ్గరికి పంపించండి’’ అని ప్రచారం చేసింది. అయినా చాలా మంది స్పందించలేదు. కొంత మంది విద్యార్థులు మాత్రమే రావడం ప్రారంభించారు. వారికే పాఠాలు ప్రారంభించింది.
కానీ.. ఈ వార్త స్థానికంగా చాలా ప్రచారమైంది. విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారని, అక్షరాలు వస్తున్నాయి మెళ్లిగా గ్రహించడం ప్రారంభించారు. దీంతో ఇప్పుడు ఆమె పాఠశాలకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. పిల్లలకు లక్షణంగా పాఠాలు బోధిస్తోంది. అయితే మొదట్లో వారి మాతృభాషైన సంథాలి మాత్రమే నేర్పించడం ప్రారంభించింది. ఆ తర్వాత బెంగాలీ, ఆంగ్లం బోధించడం ప్రారంభించింది. ప్రస్తుతం 45 మంది విద్యార్థులు ఆమె పాఠశాలలో చదువు అభ్యసిస్తున్నారు. మాతృభాష అయిన సంథాలిలో చదవడం, రాయడం చేస్తున్నారు. అలాగే బెంగాలీ, ఆంగ్లం, సైన్స్ కూడా ముర్ము పిల్లలకు చెబుతోంది.
పాఠశాల తెరిచే ముందు…
పాఠశాలను తెరిచే ప్రతి రోజూ కొన్ని నిమిషాల ముందు మాలతి ముర్ము ఆ ప్రదేశాన్ని కచ్చితంగా పరిశీలిస్తుంది. తరగతి గదులను శుభ్రం చేస్తుంది. చాపలు పరుస్తుంది. చెక్కతో తయారైన బోర్డు సరిగ్గా పనిచేస్తుందో లేదో? అని సరిచూస్తుంది. పాఠశాల సమయాని కల్లా తన బిడ్డను తయారు చేసేస్తుంది. ఆ బిడ్డను కూడా తనతో పాటే పాఠశాలకు తీసుకొచ్చి, అదే క్లాస్ రూమ్ లో ఓ పక్కన పడుకోబెడుతుంది. పిల్లలకు పాఠాలను బోధిస్తుంది. ఇలా ప్రతి రోజూ అన్ని తనిఖీలు జరిగిన తర్వాతే పాఠశాలలో బోధన ప్రారంభమవుతుంది.

ఇప్పుడు పిల్లలకు ఆమే కౌన్సెలర్, గైడ్.. అన్నీ…
ఒకప్పుడు పాఠం చెబుతా.. మీ పిల్లల్ని పంపమంటే ఎవ్వరూ పంపేవారే కాదు. పైగా హేళన చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. అక్కడి పిల్లలకు మాలతి ముర్ముయే కౌన్సెలర్. గైడ్, మెంటర్ అన్నీనూ. తమ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా నిర్మితం అవుతుందని తల్లిదండ్రులు కూడా పూర్తి భరోసాతో వున్నారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా ఆ పాఠశాలకు వెళ్లి, వింటుంటారు. తమ పిల్లలను చూసి మురిసిపోతున్నారు.
విద్యతో అందరూ బాగుపడాలి : మాలతి ముర్ము..
ప్రస్తుతం మారిపోయిన పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతున్నా. నేను ఈ గ్రామానికి వచ్చిన కొత్తలో విద్య లేదని గ్రహించా. వీరందరికీ ఉచితంగా బోధించాలని 2020 లో నిర్ణయించుకున్నా. అందుకు నా ఇంటినే ఎంచుకున్నా. గ్రామస్థుల సహాయంతో మట్టిగోడలతో ఓ తరగతిని సిద్ధ చేశా. అక్కడే పాఠశాల. గ్రామంలోని వారే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వారు కూడా రాబోయే రోజుల్లో ఇక్కడికి రావాలి. విద్యా వెలుగులు అన్ని దిశలా ప్రసారం కావాలి’’
ముర్ము వల్లే ఈ వెలుగులంతా… – సునీతా మండి, గ్రామస్తురాలు.
గ్రామంలో చాలామంది పిల్లలు బడికి వెళ్లరు. కానీ ఇప్పుడు వారంతా మాలతి ట్యూటోరియల్‌కి చాలా ఇష్టంగా వెళుతున్నారు. అక్షరాలు నేర్చుకుంటున్నారు. మాలతి, బంకు ఏ స్వార్థం లేకుండా మా పిల్లల కోసం ఇదంతా చేస్తున్నారు. అందుకే ఈ స్కూలు కోసం మేము ఏమైనా చేస్తాం.