గ్రామసభల నిర్వహణ తీరు – 1
గ్రామసభ శక్తి: భాగం-2
గ్రామసభలు ఎంతటి ముఖ్యమైనవి, ప్రజలను ఎంతటి శక్తివంతం చేస్తాయి, సుప్రీంకోర్టు సైతం గ్రామసభల అధికారాన్ని ఎలా చాటిచెప్పింది.. ఈ వివరాలన్నీ గత సంచికలో ఉదాహరణతో సహా తెలుసుకున్నాము. అసలు ఈ గ్రామసభ ఎలా పని చేస్తుంది, అసలు అది ఏమిటి అనేది ఈ సంచికలో చూద్దాం.
మనది ప్రజాస్వామ్య దేశం. అంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు పాలించే దేశం. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియో గించుకునేందుకు దేశ విదేశాలలో ఉండేవారు కూడా ప్రత్యేకంగా విమానాల్లో రావడం చూస్తే చాలా అనందంగా ఉంటుంది. కానీ కేవలం ఎన్నికల్లో ఓటు వేసి ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపడంతో ప్రజల బాధ్యత పూర్తవుతుంది. ప్రజల ద్వారా గెలిచిన ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమను ఎన్నుకున్న ప్రజల ఆశయాలకు, అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటారన్న నమ్మకం లేదు. చట్టసభల్లో ప్రజలకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతారన్న నమ్మకం కూడా లేదు. కనీసం సభలకు సక్రమంగా హాజరు అవుతారో లేదో నమ్మకం లేదు. ఒకసారి ఓటు వేసాం కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా, అంటే ఐదేళ్ల పాటు ఆ ప్రజాప్రతినిధిని ప్రజలు భరించక తప్పదు.
మరి ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రజా స్వామ్యంలో ప్రజలకు నేరుగా నిర్ణయాలు తీసుకుని, పరిపాలనలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారం లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. కచ్చితంగా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(దీ) ప్రజలకు విశేషమైన అధికారాలు కల్పిస్తోంది. అందుకోసం ఏర్పడినదే ‘గ్రామసభ’.
గ్రామపంచాయితీ స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, పరిపాలనలో పారదర్శకత కలిగిఉండేలా చూడటం గ్రామసభల ప్రధాన ఉద్దేశం. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ వారు ఇటీవల ఇటీవల సంవిత్ ప్రకాశన్ ట్రస్ట్ సహకారంతో విడుదల చేసిన ‘మతం పేరుతో అక్రమాలు – న్యాయపోరాటానికి మార్గాలు’ అనే ఈ పుస్తకంలో గ్రామసభల విశిష్టత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.
గ్రామసభలకున్న అధికారాల గురించి తెలుసు కునే ముందు అసలు గ్రామసభ అంటే ఏమిటో చూద్దాం. గ్రామపంచాయితీ పరిధిలో ఓటుహక్కు కలిగివున్న వ్యక్తులందరినీ కలిపి ‘గ్రామసభ’గా వ్యవహరిస్తాం. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇది ఒక గ్రామపంచాయితీ యొక్క జనరల్ బాడీ అన్నమాట. అసెంబ్లీ, పార్లమెంట్లతో ప్రజాప్రతి నిధులకు ఒక అంశంపై చర్చించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఏవిధంగా ఉంటుందో, తమ పంచాయితీ పరిధిలో జరిగే విషయాలపై చర్చించి అక్కడి అభివృద్ధి, ఆరోగ్యం, భద్రత వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే హక్కు గ్రామసభలకు ఉంటాయి.
గ్రామసభలకు ఆయా మండల, జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై తమ పరిధిలో జరుగు తున్న కార్యక్రమాలు, పెండింగులో ఉన్న పనులు, వాటి వివరాలు ప్రజలకు వివరించాలి. ప్రజలు సందేహాలకు సమాధానాలు ఇవ్వాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథ కాలు ఎలా అమలవుతు న్నాయి, లబ్ధిదారులను ఎలా గుర్తిస్తున్నారు, పంచాయితీకి వస్తున్న నిధులు, వాటిని ఖర్చు చేస్తున్న విధానం, ఆ ఖర్చులకు సంబంధించిన లెక్కలు, ఆడిట్ రిపోర్టులు.. ఇలా అన్ని అంశాలూ ప్రభుత్వ అధికారులు గ్రామసభ సమావేశంలో ప్రజల ముందు ఉంచాలి. అక్కడ ప్రజల సందేహా లకు అధికారులు సమాధానాలు ఇవ్వాలి. ఇప్పుడున్న చట్టాలకు లోబడి, గ్రామం సంక్షేమం కోసం ఏదైనా నూతన కార్యక్రమాలకు, పద్ధతులకు శ్రీకారం చుట్టాలి అనుకుంటే అలాంటి అంశాలను గ్రామసభలో చర్చించి తీర్మానాలు ప్రవేశపెట్టాలి.
అలాగే గ్రామ సమస్యలను గ్రామసభల్లో చర్చించి వాటి పరిష్కారం విషయంలో తీర్మానాలు చేయవచ్చు. ఉదాహరణకు.. రోడ్డుపై చెత్త పారవేసే వారిపై జరిమానా విధించడం, గ్రామంలో మద్య పానం, సిగరెట్, గుట్కాల అమ్మకం నిషేధిం చడం వంటివి. అన్ని ప్రభుత్వాలే చేయాలని లేదు. గ్రామసభలద్వారా ప్రజలకు ఆ అధికారం ఉంది.
– ఏ.ఎస్. సంతోష్