భారత్ సమగ్రతను ఎవ్వరూ దెబ్బతీయలేరు : మణిపూర్ సీఎం
ప్రత్యేక క్రైస్తవ దేశం కావాలన్న మిజోరాం సీఎం వ్యాఖ్యలపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా స్పందించారు.దేశంలో అయినా, విదేశాల్లో అయినా భారతదేశం, మణిపూర్ సమగ్రతను ఎవ్వరూ తాకలేరన్నారు. ప్రత్యేక క్రైస్తవ దేశం డిమాండ్ పై తానేమీ వ్యాఖ్యానించదలుచుకోలేదన్నారు. అయితే…. భారత్ బలమైన దేశమని, దాని సమగ్రతను ఎవ్వరూ దెబ్బతీయలేరన్నది మాత్రం కచ్చితంగా చెప్పదల్చుకున్నానని పేర్కొన్నారు. తాను భారతీయుడిగా చాలా గర్వంగా చెప్పుకుంటానని, భారత దేశ ఐక్యత, సమగ్రత కోసం నిలబడతానని ప్రకటించారు.భారత సమగ్రతను ఎవరైతే సవాల్ చేస్తారో వారికి తగిన సమాధానం కూడా చెప్తామని ప్రకటించారు.
తాజాగా సీఎం లాల్దూహోమాకి సంబంధించి ఓ దిగ్భ్రాంతికర వార్త వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ మాసంలో ఆయన అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడున్న మిజోరాం కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘మనమందరమూ ఒకే కుటుంబం. విడివిడిగా వుండొద్దు. ఆ దేవుడి బలంతో ఒక దేశంగా ఏర్పాడాలన్న మన కల నెరవేరుతుంది. నిజమైన దేశానికి సరిహద్దులుండవు. మనల్ని బలవంతంగా విడదీశారు. దీంతో మనం మూడు దేశాల్లోని మూడు విభిన్నమైన ప్రభుత్వాల కింద బతుకుతున్నాం. ఈ అన్యాయాన్ని మనం అంగీకరించొద్దు. ఇంత జరిగినా… మనం ఒకే మట్టిలోంచి వచ్చాం. మనల్ని విడదీయడానికి ప్రయత్నించే ఊసరవెల్లిలు లేరు. ఇది నిజంగా మనకు దేవుడిచ్చిన వరం. ఈ ఏకీకరణ లక్ష్యం కోసం పనిచేద్దాం. దేవుడు మనకు ఏదో రకంగా సాయం చేస్తాడు. బైబిల్ లో చెప్పినట్లు బలం, శక్తి, అధికారంతో కాదు.. స్ఫూర్తితో మీకు అండగా వుంటా అని బైబిల్ లో ఆ దేవుడు చెప్పినట్లు….ఈ కష్టతర ప్రయత్నంలో దేవుడు మనకు అండగా వుంటాడు మంచైనా, చెడైనా మనం ఆయన దగ్గరే ఆశ్రయం పొందుతాం. ఈశాన్య రాష్ట్రాల్లో చర్చిలు ఏర్పాటు చేసిన వివిధ సంస్థలు, అంతర్జాతీయంగా వున్న క్రైస్తవ మిషనరీలు గురించి కూడా సీఎం మాట్లాడారు. ఇన్ని విభిన్న సంస్థలున్నా.. అన్నీ కలిసి NUA (Network for Unity Association) ఏర్పాటు చేశాయి. అందర్నీ కలపాలని చూస్తోంది.’’ అంటూ సీఎం ప్రసంగించారు.