మణిపూర్ లో కుకీ మిలిటెంట్ల దాడులను ఖండించిన ఆరెస్సెస్
మణిపూర్ లో శాంతిభద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మణిపూర్ ప్రాంతం ప్రత్యేకంగా సమావేశమైంది. కౌత్రుక్, ట్రోంగ్ లావోబీ, మోయిరాంగ్ వంటి ప్రాంతాల్లో చెలరేగిన హింసాకాండపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. డ్రోన్లు, రాకెట్లు, క్షిపణులతో సహా అధునాతన ఆయుధాలతో కుకీ మిలిటెంట్లు సాధారణ ప్రజానీకంపై విరుచుకుపడడాన్ని ఆరెస్సెస్ మణిపూర్ శాఖ తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పౌరులపై తీవ్రవాదులు ఇంతటి భారీ ఆయుధాలతో దాడులు చేయడం ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే… ఇక్కడే జరుగుతోందని, సంఘర్షణలో కొత్త కోణాన్ని, భయంకరమైన తీవ్రతను ఇది సూచిస్తోందని ఆరెస్సెస్ పేర్కొంది.
అమాయక ప్రజలపై భారీ భారీ ఆయుధాలను ఉపయోగించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోందని, ప్రపంచ వ్యాప్త ఘర్షణలలో ఈ విపరీత ధోరణి ఎక్కడా కనిపించదని తెలిపింది. మణిపూర్ లో ఎంతటి భయానకర పరిస్థితి వుందో ఇది ఎత్తిచూపిస్తోందని తెలిపింది. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాత్మక చర్యలకు ఉపక్రమించాలని సంఘ్ సూచించింది. ఈ దాడులను, ప్రస్తుత పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించడంలో విఫలమైందంటూ తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది సంఘ్. ఇంత సుదీర్ఘకాల గడిచినా, శాంతి నెలకొనకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సంఘ్ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది. శాంతి నెలకొనడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను వేగిరం చేయాలని, పరిస్థితులు అదుపులోకి తీసుకురావడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆరెస్సెస్ సూచించింది. మణిపూర్ వాసులు చాలా రోజులుగా తీవ్రంగా బాధపడుతున్నారని సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది.