షూటర్‌ మను భాకర్‌ విజయం వెనుక భగవద్గీత పాత్ర.. ఏమిటంటే

ప్రతిష్ఠాత్మకమైన ఒలంపిక్స్‌లో రెండో రోజు భారత్‌ పతకంతో మురిసిపోయింది. 140 కోట్ల మంది ఆశల్ని నిజం చేస్తూ 22 సంవత్సరాల హారియాణా షూటర్‌ మను భాకర్‌ కాంస్యం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టోల్‌ ఫైనల్స్‌లో 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో షూటింగ్‌లో దేశానికి పతకం అందించిన తొలి మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించింది. 2012 లో గగన్‌ నారంగ్‌, విజయ్‌ కుమార్‌ తర్వాత షూటింగ్‌లో దేశానికి దక్కిన మరో పతకం ఇదే. మొత్తానికి దేశానికి పతకం అందించిన ఐదో షూటర్‌గా మను భాకర్‌ రికార్డుల్లోకి ఎక్కింది.

లోటు తీరింది.. సంతృప్తిగా వున్నాను…

చివరి ఒలంపిక్స్‌లో తన ప్రదర్శన తనను ఎంతో నిరుత్సాహపరిచిందని, ఆ పరాభవం నుంచి బయటపడేందుకు చాలా సమయమే పట్టిందని గుర్తు చేసుకున్నారు. అందుకే ఇప్పటి ఫలితం ఎంతో తృప్తినిచ్చింది. అలాగే షూటింగ్‌లో మెడల్‌ కోసం దేశం కూడా ఎంతో కాలంగా ఎదిరిచూస్తోందని, దీని ద్వారా ఈ లోటు తీరిందని అమితానందం వ్యక్తం చేశారు. కఠోర శ్రమ ద్వారానే ఇది సాధ్యమైందని, వచ్చేసారి మరింత ఉత్తమ ప్రదర్శన ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే తన వ్యక్తిగత కోచ్‌ జస్పాల్‌ కూడా ఓ ప్రణాళిక ప్రకారం కోచింగ్‌ ఇచ్చారన్నారు. ప్రాక్టీస్‌లో భాగంగా కొన్ని పాయింట్లను లక్ష్యంగా పెట్టుకోమని సూచించారని తెలిపారు.

రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు…

కాంస్యంతో బోణీ చేసినందుకు మను భాకర్‌కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ ఫీట్‌ సాధించిన తొలి మహిళా షూటర్‌గా నిలవడం ఎందరికో ప్రేరణగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫోన్‌ చేసి మరీ మను భాకర్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. శుభాకాంక్షలు మను… మీ గెలుపు వార్తతో దేశం మొత్తం మీ విజయ వైభవంలో మునిగిపోయింది. దేశం గర్వపడేలా చేశారు. షూటింగ్‌లో మెడల్‌ సాధించిన భారత తొలి మహిళగా రికార్డు నెలకొల్పినందుకు అభినందనలు’’ అంటూ మోదీ మాట్లాడారు.

మను భాకర్‌ విజయ రహస్యం వెనుక భగవద్గీత పాత్ర….

2019 మ్యూనిచ్‌ వరల్డ్‌ కప్‌లో నాలుగో స్థానంలో నిలిచి, టోక్యోలో అడుగుపెట్టింది. కానీ… ఇక్కడి మూడు ఈవెంట్లలోనూ కనీసం ఫైనల్‌ కూడా చేరుకోలేకపోయింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌ మధ్యలో పిస్టల్‌ మొరాయించింది. దీంతో 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో ఫైనల్‌ బెర్తు కోల్పోయింది. దాంతో అరంగేట్ర ఒలంపిక్స్‌ ఆమెకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ బాధ నుంచి తేరుకునేందుకు తనకు ఏడాది సమయం పట్టిందన్నారు. ఓ దశలో భాకర్‌ ఈ ఆటలనే వదిలేద్దామని అనుకున్నారు. షూటింగ్‌ అన్న దానిని పక్కన పెట్టేసి, సివిల్స్‌ కోసం ప్రిపేర్‌ అవ్వాలని అనుకున్నారు. కానీ… మానసిక ప్రశాంతత కోసం భగవద్గీత చదవడం ప్రారంభించింది. గీత బోధించిన పద్ధతులు, కర్మ సిద్ధాంతంపై అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా మనస్సు మార్చుకొని, పారిస్‌ ఒలంపిక్స్‌పై ఫోకస్‌ పెట్టింది. తన ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా చూసుకుంటూ ముందుకు సాగింది. ముందుకు సాగుతున్న ప్రతిసారీ భగవద్గీత శ్లోకాలను గుర్తుచేసుకుంటూ ముందుకు సాగింది. ఈ క్రమంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునునికి ఫలితంపై కాకుండా కర్మపై దృష్టిపెట్టమని చెప్పాడని… తానూ అక్షరాలా అదే చేశానని, దీంతో తన ఒత్తిడి పూర్తిగా దూరమైందన్నారు. తన సక్సెస్‌లో భగద్గీతే ప్రధాన పాత్ర పోషించిందని మనూ భాకర్‌ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *