వివాహ సంస్కారం సమాజ సంక్షేమం కోసం
– హనుమత్ ప్రసాద్
ఒకరు ఇద్దరై, ఇద్దరు పలువురై, నీతి నియమబద్ధ జీవితం కొనసాగించడం కోసం వంశాభివృద్ధి కోసం, సంసార సుఖం వంటివేగాక ఋషి, దేవ, పిత్ర ఋణములను తీర్చుకొనుటకు వివాహం ఒక స్థానం. వివాహంలో దంపతుల బాధ్యత పెరుగుతుంది. కాబట్టి ఇది భారం కాదు, ఇదిక కర్తవ్యం. వివాహం రూపంలో జరిగే తంతు బాదప్తం కాదు, వీటి వెనుక ఒక తత్త్వం ఉంది. 8 రకాల వివాహాలున్నాయి. 1. బ్రాహ్మము, 2. ప్రాజాపత్యము, 3. అర్షము, 4. దైవము, 5. గాంధర్వము, 6. అసురము, 7 రాక్షసము, 8. పైశాచికము. మొదటి నాలుగు వేదవిహితమైనవి, ధర్మబద్ధమైనవి, చివరి నాలుగు నిషిద్ధము. వధూవరులు ఒకరినొకరు ఇష్టపడి చేసుకునేది గాంధర్వం. అసురము అంటే ధనము, కట్నములు ఇచ్చి సంతోషపెట్టి చేసేది. బలవంతంగా చేసేది రాక్షస వివాహం. బ్రహ్మచర్యం పాటిస్తూ విద్యార్జన పూర్తయిన తరువాత వరుడికి వదువు ఆదేశాను సారం సమావర్తన సంస్కారం జరుపుతారు. దీనే స్నాతకమంటారు. వరుడికి వస్త్రం, తలపాగ, గొడుగు, చెప్పులు ఇతర అభరణాలు బహుక రించడమే స్నాతకం.
గురువు ధర్మంగా జీవించడం గురించి చెబుతుడు. ధర్మమార్గంలో జీవించడం కోసం బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్ళేందుకు వివాహం ఒక సాధనం. శుక్లయజుస్సంహితలోనే స్నాతకుని వయస్సు 21 నుంచి 25 వరకూ ఉండాలని చెప్పారు. గాంధర్వం అనగానే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా జరిగే పెళ్లి అని కాదు. ఈ రోజు ప్రేమ వివాహాలు కూడా తల్లిదండ్రుల సంప్రదింపులతోనే జరగడం అవసరం. సినిమాల్లో కూడా ఈ విషయమై యువతను హెచర్చిస్తూన్నారు. దానివల్ల కుటుంబ వ్యవస్థ బలపడే అవకాశం మెరుగ్గా ఉంటుంది.
వివాహం అంటే ‘కన్యాదానం’ అన్నారు. అల్లుడ్ని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి తన కూతురు లక్ష్మిగా అతనికి అర్పించడమే వివాహం. శీలమంతుడ్ని, ఆరోగ్యమంతుడ్ని అల్లుడ్ని చూడమన్నారు. కన్య కూడా ముందు ఆరోగ్య వంతురాలు, శీలవతిని చూడమన్నారు. స్నాతకం తరువాత కాశీకి వెళ్ళి బ్రహ్మచారిగా ఉండి పోతానన్న వరుడ్ని ఆపి కన్య సోదరుడు తన అక్కను ఇచ్చి వివాహం చేస్తామన్న ఆచారం కూడా బంధాల, బంధుత్వాల విలువను తెలిపేదిగా ఉంటుంది. వివాహం విఘ్నేశ్వర పూజతో మొదలవుతుంది. గంగా యమునాది పవిత్ర జలముల సంప్రోక్షణతో మనసు పవిత్రమవుతుంది. తరువాత వధూవరుల రక్షాబంధనం. వివాహమనే పవిత్ర కర్మను చేసేందుకు వరుడు యజ్ఞోపవేదం ధరించండం, తేనే, బెల్లంతో కూడిని పదార్థాన్ని వరుడికివ్వడం (మధుపర్కం), పాపములు నశించి బ్రహ్మలోకంలో నివసించుటకు ప్రతిజ్ఞ చేస్తూ కన్యాదానం చేయుదును. కన్యాదాత చేయు సంకల్పమే మహాసంకల్పం. వధూవరులను బాసికాలు భ్రూమధ్యలో ధరింపచేయడం ద్వారా శరీరంలోని 72 నాడులలో ముఖ్యమైన 14 నాడుల శక్తిపై దృష్టి దోషం తగులకుండా చేస్తాయి. ముహూర్త సమయంలో జీలకర, బెల్లము, ఉసిరిపప్పు కలిపి ముద్దను వధూవరులు ఒకరితలపై ఒకరు పెట్టుకోవడం ద్వారా ఆ ముద్దలాగ ఇరువురి బంధం గట్టిపడాలని భావిస్తారు.
ఆయుష్షు, బలము, అభివృద్ధి అగుటకు చక్కటి సంతానం కోసం వధూవరులు సంసారం చేస్తారు. మంత్రం ద్వారా మంగళ ధారణ చేస్తూ ‘ఓ సౌభాగ్యవతీ! నేను నీకంఠమున, నా జీవన కారణమైన మంగళసూత్రమును కడుతున్నాను. నీవు వంద సంవత్సరాలు జీవించు’ అని వరుడు చెబుతాడు. తలంబ్రాలు ఒకరినొకరు గౌరవించు కునేందుకు సూచన. అన్నం, బలం, వ్రతం, సౌఖ్యం, పశుసంపద, ఋతువుల అనుకూలత వాటి సహాయం కోసం అగ్ని సాక్షిగా వధూవరులు ఏడు అడుగులు వేస్తారు. ధర్మ, అర్థ, కామములకు సంబంధించిన ఏ విషయం తాను తన భార్యను అతిక్రమించనంటూ ‘నాతిచరామి’ అని వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు.