సామూహిక ఉత్సవం

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీరాముని జన్మతిథిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. శ్రీ సీతారాముల కళ్యాణము కూడా నవమినాడే జరిగినదని ప్రజల విశ్వాసం.

ప్రజలంతా సిరిసపందలతో, సుఖ సంతోషా లతో, శాంతితో విలసిల్లితే అది రామరాజ్యమని హిందువులు అంటారు. మహాత్మాగాంధీ కూడా స్వాతంత్య్రానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించారు. శ్రీరామ నవమి రోజు ఉదయాన్నే సూర్య భగవానుడుడికి ప్రార్థన చేయటంతో కార్యక్రమం ప్రారంభమౌతుంది. శ్రీరాముడు జన్మించిన మధ్యాహ్న సమయానికి విశేష పూజలు ,  కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి దగ్గరగా వస్తాడు. వేసవి తీవ్రతను తట్టుకోవటానికి భక్తులకు పానకం, వడపప్పు ప్రసాదంగా వితరణ చేస్తారు. శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు. ఇదే వంశంలో దిలీపుడు, రఘువు, ఇక్ష్వాకుడు, హరిశ్చంద్రుడు మొదలైన వారు జన్మించారు. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరుపుతారు.

భద్రాచలంలో రామదాసు నిర్మించిన రామా లయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తన తలమీద పెట్టుకొని తీసుకొస్తారు.

గ్రామాలలో శ్రీరామనవమి రోజున వీధుల్లో కూడా పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. ఇందులో తరతమ భేదాలు లేకుండా అంతా పాల్గొంటారు. ఈ ఉత్సవాల సందర్భంగా హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ వంటివాటి ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అనేక విషయాలు జనసామాన్యానికి తెలుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *