‘‘విశ్వ మాంగళ్య సభ’’ ఆధ్వర్యంలో కన్హా శాంతివనంలో ‘మాతృసంస్కార్ సమాగం’
సంప్రదాయం, ప్రగతి, పరిపక్వతల కలయికగా నిలిచిన మహా ఉత్సవం
వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మాతృమూర్తులకు ‘సప్తమాతృక’ సత్కారం
ఆలోచింపజేసిన సదస్సులు మరియు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
మాతృత్వపు మాధుర్యాన్ని, బాధ్యతను, ఆధునిక కాలంలో దాని ఆవశ్యకతను నొక్కిచెబుతూ విశ్వమాంగల్య వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మాతృసంస్కార్ సమాగం’ కార్యక్రమం శనివారం (ఏప్రిల్ 4) అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ పరిసరాల్లోని కన్హా శాంతివనం వేదికగా రోజంతా జరిగిన ఈ మహా సంగమం మాత్ట్రుత్వపు విలువలకు, భారతీయ సంస్కృతికి అద్దం పట్టింది. వివిధ సదస్సులు, సత్కారాలు, ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలతో ఈ ఉత్సవం దిగ్విజయంగా ముగిసింది.
ఉత్సాహభరితంగా ప్రారంభోత్సవ కార్యక్రమం..
ఈ కార్యక్రమానికి అపోలో హాస్పిటల్స్ ప్రతినిధి డాక్టర్ సంగీతా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోపన్యాసం చేశారు. విశేష అతిథులుగా ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేష్, వ్యాపారవేత్త భగవతి బల్దవా, ప్రముఖ అతిథులుగా డాక్టర్ వృషాలి జోషి, రేఖా ఖండేల్వాల్ , ప్రశాంత్ పాల్గొన్నారు. భాగ్యనగర్ విశ్వమాంగళ్య సభ అధ్యక్షురాలు బి. శ్రుతి కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక ప్రదర్శన (షడ్ ‘భ’కారాలపై ఎగ్జిబిషన్) ప్రారంభంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రముఖులు దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రమ్యశ్రీ ఆలపించిన శక్తిగానం అందరిలో ఉత్సాహాన్ని నింపింది. బి. శృతి సభా ప్రస్తావన అనంతరం, పూజా నరేడి గారు ‘విశ్వమాంగల్య సభ’ (VMS) ఆశయాలను, ఉద్దేశ్యాలను సభికులకు వివరించారు.

ఆలోచింపజేసిన ‘యుగానుకూల మాతృత్వం’, ‘పంచపరివర్తన్’ సదస్సులు:
రెండవ సెషన్‌లో ‘యుగానుకూల మాతృత్వం’ అనే అంశంపై లోతైన చర్చ జరిగింది. ఈ సదస్సులో.. మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణంగా తల్లులు పిల్లల పెంపకంలో అనుసరించాల్సిన విధానాలపై ముఖ్య వక్త వృషాలి గారు, ఇతర వక్తలు అనురాధ, డాక్టర్ సాహితి దిశానిర్దేశం చేశారు. అనంతరం మధ్యాహ్నం జరిగిన మూడవ సెషన్‌లో ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ ‘పంచపరివర్తన్’ (సమాజంలో రావలసిన ఐదు కీలక మార్పులు) అనే అంశంపై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.
ఆదర్శంగా నిలిచిన ఏడుగురు మాతృమూర్తులకు సత్కారం..
ఈ సమాగానికే ప్రత్యేక ఆకర్షణగా ‘సప్తమాతృక సమ్మాన్’ (సత్కార సభ) నిలిచింది. సమాజంలో ఆదర్శంగా నిలిచిన ఏడుగురు మాతృమూర్తులను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. అయితే, ప్రతి మాతృమూర్తిని సత్కరించే ముందు వారి జీవిత ప్రయాణాన్ని, విశేషాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వీడియోల ద్వారా తెరపై ప్రదర్శించడం అందరినీ విశేషంగా ఆకర్షించింది. వేదికపై ఆశీనులైన నళిని, భగవతి, శృతి, జి. అనంత లక్ష్మి తదితరుల చేతుల మీదుగా ఈ సత్కారాలు జరిగాయి. అనంతరం భగవతి బల్దవా, జి. అనంత లక్ష్మి ప్రసంగాలు స్ఫూర్తినిచ్చాయి.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు.. అబ్బురపరిచిన ‘శివకాలీన్ యుద్ధ కళ’..
అర్చన, ప్రియాంక భర్డే బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ అకట్టుకోగా, మహారాష్ట్రలోని వాషిమ్ (Washim) నుంచి వచ్చిన ప్రత్యేక బృందం శివకాలీన యుద్ధ కళను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. వందేమాతరం భావార్థ వివరణతో మొదలైన ఈ సెషన్‌లో, వారి సాహసోపేతమైన ప్రదర్శన సభికులను అబ్బురపరిచింది. చివరగా ఉదయశ్రీ గారి వందేమాతరం భావార్థ వివరణతో ‘మాతృసంస్కార్ సమాగం’ తొలిరోజు విజయవంతంగా ముగిసింది.