ఆమె అడవిని సృష్టించింది… ఆ అడవే మహిళా సంఘాలకు ఆదాయ వనరుగా మారింది

ఆమె తన సంకల్పంతో ఏకంగా అడవినే సృష్టించింది. ఆ అడవే స్థానికులకు ఓ ముద్ద పెడుతోంది. చుట్టు పక్కల వున్న ఊళ్లకి ఆ అడవే కల్పతరువు. అక్కడ దొరికే పండ్లే వారికి ఆదాయ వనరులు. కానీ.. చెట్లని తమ స్వార్థం కోసం నరికేయరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ అడవిని సృష్టించిన తల్లి చిలకపల్లి అనసూయమ్మ. ఆవిడది మెదక్‌ జిల్లా పస్తాపూర్‌. ఆమె నినాదం ఏమిటంటే… ‘‘చెట్టు తల్లిలాంటిది… దాన్ని పరిరక్షిస్తే అది మనల్ని పరిరక్షిస్తుంది’’ అంటూ అందరికీ నచ్చచెబుతోంది. మొక్కలు, పర్యావరణం కాపాడటం.. తన చిన్నతనం నుంచే వచ్చిందని, అది ఎలా వచ్చిందో మాత్రం తనకు తెలియదన్నారు.

15 సంవత్సరాలకే తాను అమ్మానాన్నలతో కలిసి కూలీకి వెళ్లేదాన్నని, ఆ తరువాతే ఓ నర్సరీలో చేరి మొక్కల పెంపకంపై శిక్షణ తీసుకున్నట్లు వెల్లడిరచారు. అప్పుడే మొక్కలపై తనకు సరైన అవగాహన కలిగిందన్నారు. తాను అవగాహన కల్పించుకొని, పది మందికి అవగాహన కల్పించడం ప్రారంభించానని తెలిపారు. చుట్టు పక్కల వున్న ఊళ్లకి వెళ్లి, మొక్కలు నాటడంపై శిక్షణ కల్పించేది. పొలాల చుట్టూ, ఊరి సరిహద్దుల్లోనూ ప్రజలతో నాటించేవారు. అయితే.. పంటలకు అనుకూలంగా లేని భూములను గుర్తించి, మొక్కలు నాటడం ప్రారంభించారు. ఆమెకు చెట్లు నాటడమే వ్యాపకమై కూర్చుంది.

1993 ప్రాంతంలో సంగారెడ్డి ప్రాంతంలో విపరీతమైన భారీ వర్షాలు కురిసాయి. కొన్ని గ్రామాలు కూడా నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలందరూ తమ ఇళ్లను ఖాళీ చేసి, దగ్గరలో ఉన్న ఎత్తైన కొండలు, రాళ్ల మీదికి చేరుకున్నారు. పంట భూములన్నీ పాడైపోయాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం తగిన సహాయక చర్యలు చేపట్టింది.ఆ సమయంలో అనసూయమ్మ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అక్కడ ఖాళీగా వున్న భూముల్లో, గుట్టపై అధిక సంఖ్యలో మొక్కలు నాటుదామని ఆమె సలహా ఇచ్చారు. ఈమె సలహాకి అందరూ ఘొళ్లుమని నవ్వారు.అయినా.. అనసూయమ్మ వెనక్కి తగ్గితే ఒట్టు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని, పనిచేయడం ప్రారంభించారు. గుంటలు తీయడానికి అనుసూయమ్మనే డబ్బులు వెచ్చించి మరీ.. కూలీలతో పనిచేయించారు.

 

కేవలం మూడు నెలల్లోనే 60 వేల గుంటలు సిద్ధం చేయించారు. వాటిలో మొక్కలు నాటడం, స్థానికులతో నాటించడం ప్రారంభించారు. ఆ ఊళ్లకి వెళ్లడానికి బస్సులు కూడా వుండేవి కావు.కాలి నడకనే వెళ్లారు. దాదాపు 1400 ఎకరాలకు పైగా మొక్కలు నాటించారు. ఇప్పుడే అవే మహా వృక్షాలై.. అందరికీ ఉపయోగపడుతున్నాయి. చింత, వేప, జామ, మామిడి, నేరేడు, టేకు, ఉసిరి, తంగేడు… వంటి చెట్లున్నాయి. ఇప్పుడు ఆ చెట్లు పక్షులకు ఆవాసాలయ్యాయి. ఆ అడవి మీద స్థానికులకే పట్టాలు వచ్చేట్లు ప్రభుత్వాన్ని సైతం ఒప్పించారు. ఇందూరు, హున్నాపూర్‌, సంగాపూర్‌, మలగి, రాఘవాపూర్‌… ఇలా 16 గ్రామాలకు చెందిన మహిళా సంఘాలన్నీ ఆ చెట్ల మీద వచ్చే ఆదాయాన్ని అందుకుంటున్నారు. అనసూయమ్మకు ఐక్యరాజ్య సమితి ‘‘ఈక్వేటర్‌ ప్రైజ్‌’’ బహూకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *