వినాయకుడి పూజలో ఉపయోగించే వాటిలో వున్న ఔషధ గుణాలివీ….
మన సనాతన సంప్రదాయంలో జరుపుకునే ప్రతి పండుగ కూడా ప్రకృతితో మమేకమై వుంటుంది. ప్రతి పండుగా ప్రకృతిలో భాగమే. అంతేకాకుండా సనాతన ధర్మంలో ప్రకృతిని పంచభూతాలుగా ఆరాధించే సంప్రదాయం కూడా మన దగ్గర వుంది. అయితే.. మనం జరుపుకునే వినాయక చవితి పండుగ కూడా ప్రకృతితో మమేకమైందే. వినాయక పూజ సమయంలో మనం ఉపయోగించే ప్రతిదీ ప్రకృతి నుండి సేకరిస్తున్నదే. అసలు వినాయకుడ్ని తయారు చేయడమే చెరువు మట్టితో తయారు చేయడం. అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక… వినాయకుడి పూజలో రకరకాల ఆకులను వాడుతుంటాం. వాటికి ఎన్నో ఔషధ గుణాలు కూడా వుంటాయి. అవన్నీ వినాయకుడికి సమర్పించిన తర్వాత వినాయకుడ్ని నిమజ్జం చేసేస్తాం. అప్పుడు ఈ ‘‘నిర్మాల్యం’’ కూడా చెరువులోనో, వాగులోనో కలిపేస్తాం. దీంతో ఔషధ గుణాల వల్ల ఆ నీరు శుభ్రమవుతుంది. ఇంతకీ మనం వినాయకుడి పూజలో వాడే వాటికి ఏయే ఔషధ గుణాలున్నాయో చూద్దాం….
1.దూర్వాయుగ్మం (గరిక)
వినాయకుడి పూజలో గరిక అత్యంత ప్రధానమైంది. ముక్కు, చర్మ, ఉదర వ్యాధులు, దద్దుర్లను, మూత్రనాళంలో మంటను తగ్గిస్తుంది. మొలల నివారణకు కూడా ఈ గరిక మంచి ఔషధంగా ఉపకరిస్తుంది.
2. మాచీ పత్రం
కంటి, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. దద్దుర్లు, తలనొప్పి, వాతం నొప్పులకు పనిచేస్తుంది.
3.బిల్వ పత్రం (మారేడు)
దీనిని శివునికి కూడా వాడతాం. గణపతికి కూడా వాడతాం. జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీరం నుంచి వచ్చే దుర్గంధాన్ని తగ్గిస్తుంది.
4.బృహతీ పత్రం
దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులు, కంటి వ్యాధులను పూర్తిగా నయం చేస్తుంది.
5. బదరీ పత్రం (రేగు పత్రం)
జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు తగ్గిస్తుంది. చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
6. దత్తూర పత్రం (ఉమ్మెత్త)
నిజానికి ఉమ్మెత్తను విషం లాగా చూస్తారు. పేను కొరుకుడు, ఒంటి నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, రుతు సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
7.ఆపామార్గ పత్రం (ఉత్తరేణి)
పిప్పళ్లు, చెవిపోటు, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాల్లో రాళ్లు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
8. తులసీ:
ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్నుపోటు, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలను తగ్గిస్తుంది. లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం.
9. చూత పత్రం (మామిడాకులు)
దీనిని కూడా లక్ష్మీ స్వరూపంగానే భావిస్తాం. ఇంటికి తోరణంగా కడతాం. క్రిమి కీటకాలను నివారిస్తుంది. రక్త విరోచనాలను, చర్మ వ్యాధులకు ఇది ఔషధం.
10. కరవీర పత్రం :
తేలు కాటు, విష కీటకాల కాట్లు, దురద, కళ్ల సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.
11. విష్ణుక్రాంత పత్రం :
జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గిస్తుంది.
12. దాడిమీ పత్రం :
విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్క నుంచి రక్తం కారడం, గొంతు నొప్పి, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.
13. దేవదారు పత్రం :
అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి వ్యాధులను తగ్గిస్తుంది.
14.జాజీ పత్రం :
వాతం నొప్పులు, జీర్ణాశయ, మలబద్ధకం, నోటి పూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.