భక్తితో సామాజిక సంస్కరణకు దారులు వేసిన మీరాబాయి
మధ్యయుగంలో భారతీయ సమాజాన్ని సంస్కరించి, సమాయత్తపరచిన భక్తి ఉద్యమానికి విశేష ప్రాధాన్యం ఉంది. మొగలలాయిల నిరంకుశ మతపాలనలో బాధలుపడుతున్న హిందువులను కుల విభేదాలకు అతీతంగా ఏకం చేయడానికి భక్తి ఉద్యమకారులు తీవ్రంగా ప్రయత్నించారు. స్థానిక భాషల్లో, తేలికగా అర్థమయ్యే శైలిలో రచనలు, బోధనలు, పాటలు, భజనలతో మోక్ష సాధనకు భక్తి మార్గాన్ని తాము అవలంబించి.. ప్రజలకు చాటిచెప్పారు. తమ భక్తి మార్గంతో ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించిన వారిలో శంకరా చార్యుడు, కబీర్, గురునానక్, తులసీదాస్, సూరదాస్, అన్నమయ్య వంటివారి జాబితాలో మీరాబాయికి కూడా విశేష స్థానం ఉంది. వీరంతా భగవంతుడిని కీర్తించి తరించినవారే.
రాధాదేవి అవతారంగా పరిగణించే మీరాబాయి గొప్ప సాధువుగా, హిందూ ఆధ్యాత్మిక కవయిత్రిగా, శ్రీకృష్ణుడి ప్రియ భక్తురాలిగా పేరొందింది. 200 మందికి పైగా భక్తుల జీవిత చరిత్రలను బ్రజ భాషలో సంక్షిప్తంగా అందించిన భక్తమాల అనే కవితలో ఆమె గురించి విశేషంగా ప్రస్తావించారు. భక్తి ఉద్యమకారుల్లో ఒకరైన మీరాబాయి జీవితానికి నేటికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆమె 1498 లో రాజస్థాన్ లోని సామంత రాజ్యం అయిన మేర్తాలో ఉన్న చౌకరి అనే గ్రామంలో జన్మించిందని చెబుతారు. ఆ రాజ్య పాలకుడు రావుదుడాజీ చిన్న కుమారుడు రతన్ సింగ్ రంథోర్ కుమార్తె మీరాబాబు. మొఘలులతో పోరాడుతూ ఆమె తండ్రి ఎక్కువ సమయం ఇంటికి దూరంగానే ఉండిపోయాడు. యుద్ధంలో పోరాడుతూ చిన్న వయసులోనే వీరమరణం పొందాడు. మీరాకు ఏడేళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి కూడా మరణించింది.
మేర్తాకు చెందిన రాథోడ్‌లు గొప్ప విష్ణు భక్తులు.చిన్నప్పటి నుంచే మీరా శ్రీకృష్ణుని ఆరాధించడం నేర్చుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఒక యోగి మీరా ఇంటికి వచ్చాడు. ఆయన వద్ద ఒక చక్కటి శ్రీకృష్ణుని విగ్రహం ఉంది. కోట వదిలి వెళ్లే ముందు, ఆయన ఆ విగ్రహాన్ని మీరాకు అప్పగించాడు. నాటినుంచి బాల మీరా ఆ కృష్ణుడి విగ్రహాన్ని అమితంగా ప్రేమించడం ప్రారంభించింది. భర్తకు సేవ చేసిన విధంగానే శ్రీకృష్ణుడి విగ్రహానికి సేవ చేయడం ప్రారంభించింది. కాలంతో పాటుగా మీరాకు తన ప్రభువు పట్ల భక్తి కూడా పెరిగిపోయింది తన భర్త కృష్ణుడే అని ఆమె మనస్ఫూర్తిగా నమ్మేది.
ఇంతలో మీరా తాతగారు మేవాడ్‌లోని చిత్తోడ్ గఢ్‌కు చెందిన రాణా కుంభతో ఆమెకు వివాహం జరిపించారు. మీరా చాలా బాధ్యతాయుతమైన భార్యగా నడుచుకుంది. ఇంటి పనులన్నీ అయిపోయాక రోజూ శ్రీకృష్ణుని గుడికి వెళ్లి పూజలు చేసి, పాడుతూ, నృత్యం చేసేది. క్రమంగా మీరా తన ఆధ్యాత్మిక సాధనకు మరింత సమయం కేటాయించడం ప్రారంభించింది. ఆలయంలో కృష్ణుడి విగ్రహం ముందు గంటల తరబడి నృత్యాలు, పాటలు పాడటంతోనే కాలం గడిపేది. ఆమె పాటలు వినడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు, సామాన్య ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వచ్చేవారు.
అ తర్వాత తన స్వామి నడయాడిన బృందావనానికి మీరా మకాం మార్చింది. ఆనంద పారవశ్యంతో శ్రీకృష్ణుడి ఎదుట ఆడి పాడిరది. సన్యాసిని జీవితాన్ని గడుపుతూ, పద్యాలు రాస్తూ, ఇతర సాధువులతో చర్చలు సాగిస్తూ, కలసి ప్రవచనాలు చేస్తూ, భక్తులతో సంభాషిస్తూ కాలం గడిపేది. ద్వారకలో ఆమె తన చివరి రోజులను గడిపారు. ఇక్కడ 1547లో మీరాబాయి తన శరీరాన్ని వదిలి కృష్ణపరమాత్మ విగ్రహంలో ఐక్యమైపోయిందని చెబుతారు. సాధువు, తత్వవేత్త, ఆధ్యాత్మిక కవయిత్రి, సామాజిక సంస్కర్త కూడా అయిన మీరాబాయితో సరిపోల్చదగిన వారు లేరు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎంతో ఉదాత్తమైన జీవనం గడిపారు.
ఒక యువరాణి అయినా కూడా సుఖాలను, విలాసాలను తృణప్రాయంగా త్యజించింది. భారతదేశంలోని గొప్ప మహిళా సాధువులలో మీరాబాయిని ఒకరిగా పరిగణిస్తారు. ఆమె పాటలు ఇప్పటికీ జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. దసరా సమయంలో రాజస్థాన్ లో ఆమె పేరిట ఇప్పటికీ ఉత్సవాలు నిర్వహిస్తారు. భారతీయుల హృదయాల్లో నేటికీ ఆమె నిలచి ఉన్నారు.