మహిళా స్వావలంబన, స్త్రీనిధి రుణాల చెల్లింపుల విషయంలో ఆదర్శంగా నిలుస్తున్న మెట్ పల్లి
మెట్ పల్లి మున్సిపాలిటీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళా సంఘాలు, బ్యాంకుల ద్వారా స్త్రీనిధి రుణాలు పక్కాగా అందిస్తూ మహిళా సాధికారత కోసం విశేషంగా కృషి చేస్తోంది. అంతేకాకుండా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ ముందంజలోనే వుంది. కేవలం స్త్రీనిధి రుణాలు తీసుకోవడమే కాకుండా వాటి చెల్లింపుల్లోనూ తెలంగాణలోనే ముందు వరుసలో నిలిచింది. అక్కడి మహిళా సంఘాలు, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు అందరూ కలిసి విశేషమైన కృషి చేయడంతో రాష్ట్రంలోనే మెట్ పల్లి మున్సిపాలిటీ అవార్డును అందుకుంది. దీంతో అందరి దృష్టి మెట్ పల్లిపై పడింది.
మెట్ పల్లి పట్టణంలోని 26 వార్డుల్లో మొత్తం 9 వేల మంది సభ్యులతో 932 సంఘాలను ఏర్పాటు చేశారు. 33 వార్డు సమాఖ్యలుగా గుర్తించారు. వీటన్నింటికీ పెద్ద సంఘంగా పట్టణ సమాఖ్యను ఏర్పాటు చేశారు.
ఇక్కడున్న మహిళల కోసం 34 నుంచి 40 మంది ఆర్పీలు పనిచేస్తుంటారు. ఓ కోఆర్డినేటర్ సారథ్యంలో సంఘాలను బలోపేతం చేస్తూ మహిళల ఆర్థికాభ్యున్నతికి కృషి జరుగుతోంది. అలాగే ప్రత్యేకంగా వార్డుల్లో సభలను ఏర్పాటు చేసి, ఉపాధిపై మహిళలకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు.
ఒక్కొక్క మహిళలకు 40 వేల మొదలు 3 లక్షల రూపాయల వరకూ స్త్రీనిధి అన్న రుణం అందిస్తున్నారు. వీటి ద్వారా కులవృత్తులు చేసే మహిళలు, ఎంబ్రాయిడరీ కుట్టుశిక్షణ, దుకాణాలు, కిరాణాలు, గిర్నీలు ఇలా రకరకాల వ్యాపారాలను మహిళలు ప్రారంభించి, స్వయం ఉపాధి పొందుతున్నారు.
అయితే.. వీరందరికీ స్త్రీనిధి కింద రుణాలు అందించడంతో పాటు వీటిని చెల్లించే విషయంలోనూ జాగ్రత్తగా వుంటున్నారు. చెల్లింపు ప్రక్రియపై అవగాహన, ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించి, అవగాహన తెస్తున్నారు. ఇలా పక్కాగా, ఓ పథకం ప్రకారం సవ్యంగా నడుస్తుండటంతో మహిళలు ఆర్థికంగా రాణిస్తున్నారు.