రాబోయే 15 ఏళ్లలో 100 కి పైగా ఉపగ్రహాలు ప్రయోగిస్తాం : జితేంద్ర సింగ్

వచ్చే 15 సంవత్సరాలలో 100కు పైగా ఉపగ్రహాలను భారత్ ప్రయోగించనుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. వీటిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక మిషన్లు, ప్రైవేట్ రంగానికి సంబంధించిన శాటిలైట్లు వుంటాయన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భారత రోదసీ రంగానికి సంబంధించిన 15 సంవత్సరాల రోడ్ మ్యాప్ ను ప్రకటించారు. 2040 వరకు, ఆ పైన భారత రోదసీ కార్యక్రమాలకు ఇదే మార్గదర్శనం చేస్తుందని ప్రకటించారు. అంతరిక్షపరిజ్ఞానాన్ని ఆహారం, నీటి భద్రతకు, విపత్తులను ఎదుర్కోడానికి, పర్యావరణ పరిరక్ష, సమ్మిళిత అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు. భారత రోదసీ కార్యక్రమం పరివర్తన దశకి చేరుకుందని, దేశ పురోగతి, సాంకేతిక ఆవిష్కరణలలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.అంతరిక్ష రంగం ఇకపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కే పరిమితం కాదని, వందలాది స్టార్టప్‌లు మరియు ప్రైవేట్ కంపెనీలతో కూడిన డైనమిక్ పర్యావరణ వ్యవస్థగా మారిందని తెలిపారు. అలాగే భారత అంతరిక్ష కార్యక్రమం రాకెట్లు, ఉపగ్రహాలను అధిగమించి, పౌరులకు సాధికారత కల్పించడం, జీవితాలను మెరుగుపరచడం, ఉజ్వల భవిషత్తును రూపొందించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.
అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలకు తలుపులు తెరవడం వల్ల నూతన ఆవిష్కరణలు, వ్యాపారాలు పెరుగుతాయని తెలిపారు. ఒకప్పుడు ఈ రంగం ప్రభుత్వ ప్రాజెక్టులకే పరిమితమై వుండేదని, ఇప్పుడు వందలాది స్టార్టప్ కంపెనీలు గ్రహాంతర పరిశోధనల నుంచి రోజువారీ పాలన వరకూ అనేక అంశాల్లో ఉపయోగపడే వాటిని అభివృద్ధి చేస్తున్నాయని వివరించారు.ఈ యేడాది చివరి లోగా మానవ రహిత గగన్ యాన్ -1 ను ప్రయోగిస్తామని ప్రకటించారు. 2027 లో దేశ తొలి మానవసహిత రోదసీ యాత్రను చేపడతామని పేర్కొన్నారు. 2028 లో చంద్రయాన్ 4, 2035 లో భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణం, 2040 నాటికి చందమామపైకి భారతీయుడ్ని పంపుతామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *