స్వదేశీ మేళా ద్వారా సంస్కృతి ప్రజల్లోకి వెళుతుంది : మంత్రి జూపల్లి
స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పీవీ మార్గ్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న స్వదేశీ మేళా ముగింపు కార్యక్రమానికి పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అపారమైన చారిత్రక వైభవాన్ని, ఘనమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని కలిగిన హైదరాబాద్ స్వదేశ్ మేళాకు వేదికగా నిలవడం గర్వంగా ఉందన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలిపారు. తెలంగాణకు వచ్చిన అతిథులకు తమ వంతు సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు అనంతరం మంత్రి జూపల్లి పలు స్టాళ్లను సందర్శించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాల్స్ బాగున్నాయని కితాబునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ హరీశ్ బాబు, భారత్ అభియాన్ ప్రాంత కన్వీనర్ జి.రమేష్ గౌడ్, స్వదేశీ మేళా కన్వీనర్ ఇంద్రసేన్ రెడ్డి, స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత కో కన్వీనర్లు సిద్దుల అశోక్ , ఈశ్వర్ , తదితరులు పాల్గొన్నారు.