ప్రతి భారతీయుడూ తల్లి పేరుతో ఓ మొక్క నాటాలి : నితిన్ గడ్కరీ

ఢిల్లీలోని కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీని కారణంగా సాధారణ ప్రజల ఆయుర్దాయం చాలా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏక్ పెడ్ మా కే నామ్ 2.0’ పేరుతో నిర్వహించిన మొక్కల పెంపకం కార్యక్రమంలో పాల్గొంటూ దీన్ని బట్టే ఢిల్లీలో ఏ స్థాయిలో కాలుష్యం ఉందో అర్థం చేసుకోవాలని, కాలుష్యం ప్రజల ఆరోగ్యం, ఆయుష్షుపై ఎంత హానికరమైన ప్రభావాన్ని చూపుతోందని గుర్తుంచుకోవాలని సూచించారు.

‘ఏక్ పెడ్ మా కే నామ్ 2.0’ ప్రచారం, తల్లులకు హృదయపూర్వక నివాళిని అర్పించినట్లు  అవుతుంది. పర్యావరణ పరిరక్షణకు భారతదేశపు నిబద్ధతలో ఒక అడుగు ముందుకు వేసింది. హర్యానాలోని ఫరీదాబాద్ నుండి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించే 31 కిలోమీటర్ల రహదారి వెంబడి ఈ కార్యక్రమం జరిగింది. మౌలిక సదుపాయాల అభివృద్ధిని హరిత కార్యక్రమాలతో కలపడాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి భారతీయుడు తన తల్లి పేరు మీద ఒక చెట్టును నాటాలి. వ్యక్తిగత నివాళిని పర్యావరణ బాధ్యతతో అనుసంధానించాలి’’అని గడ్కరీ కోరారు.

ఢిల్లీ కాలుష్య సమస్యను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ శిలాజ ఇంధనాల నుంచి వెలువడే వాహన ఉద్గారాలను తగ్గించాల్సిన ఆవశ్యకతను వివరించారు. కాలుష్య సమస్యను పరిష్కరించడం అనేది కేవలం ప్రభుత్వానికో లేదా ఒక విభాగానికో సంబంధించినది కాదని, ఇందులో ప్రజలందరి భాగస్వామ్యం ముఖ్యమని తెలిపారు. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. ఇంధన కాలుష్యాన్ని తగ్గించడానికి ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రోడ్ల నిర్మాణంలో వ్యర్థాలను కూడా ఉపయోగిస్తున్నామని, ఇప్పటికే దాదాపు 80 లక్షల టన్నుల వ్యర్థాలను రోడ్డు ప్రాజెక్టులలో వాడినట్లు పేర్కొన్నారు.

అలాగే, జాతీయ రహదారులపై భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దీని ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి కృషి చేస్తున్నామని చెప్పారు. జాతీయ రహదారుల సంస్థ (ఎన్ హెచ్ ఏ ఐ) కూడా కాలుష్య నివారణకు గణనీయమైన కృషి చేస్తోందని గడ్కరీ వెల్లడించారు. గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేయడంలో చురుకుగా పని చేస్తోందని, 2024-25 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి దాదాపు 67 లక్షల మొక్కలను నాటిందని ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా, జాతీయ రహదారులపై వర్షపు నీటిని సంరక్షించే చర్యల (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్) ద్వారా నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *