అమెరికాతో ఒప్పందంతో వ్యవసాయం, పాడి రంగాలకు పూర్తి రక్షణ : పీయూష్ గోయల్
అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నా… వ్యవసాయం, పాడి రంగాల్లో భారత్ తన ప్రయోజనాలను ఏమాత్రం వీడలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దేశంలోని ముఖ్యమైన రంగాల్లో దేనినీ విస్మరించలేదన్నారు. ఈ రంగాలకు పూర్తి రక్షణ వుంటుందన్నారు. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై లోక్ సభలో పీయూష్ గోయల్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దౌత్య సంబంధాలపై ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 140 కోట్ల మంది దేశ ప్రజల ఇంధన భద్రతకు ప్రాధాన్యమిచ్చామన్నారు.
అమెరికాతో ఒప్పందం వల్ల భారత్ లోని తయారీదారులు, ఎగుమతిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బలపడతారని గోయల్ పేర్కొన్నారు. తోలు ఉత్పత్తులు, సేంద్రీ రసాయనాలు, రబ్బరు ఉత్పత్తులు, యంత్రాలు, విమాన తయారీ రంగంలోని కార్మికులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని అన్నారు.