ఏ దేశంతోనైనా సంబంధాలు నెరిపే స్వేచ్ఛ భారత్ కి వుంది : ఎస్. జైశంకర్
ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు నెరిపే హక్కు, స్వేచ్ఛ భారత్ కు వున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. భారత్ సంబంధాలను వీటో చేసే అధికారం ఏ దేశానికీ లేదని తేల్చి చెప్పారు. ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రష్యాతో బలమైన సంబంధాల కారణంగానే అమెరికా భారత్ మధ్య వుండే వాణిజ్య ఒప్పందం మరింత క్లిష్టంగా మారిందా? అని విలేకరులు ప్రశ్నించగా.. వీలైనంత ఎక్కువ దేశాలతో సహకారాన్ని కొనసాగించడం భారత్ కు ఎంతో కీలకమని విదేశాంగ మంత్రి తెలిపారు. ప్రపంచంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎవరితో సంబంధాలు కొనసాగించాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ భారత్ కు వుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏమి జరిగినా.. భారత్, రష్యా మధ్య బంధం మాత్రం స్థిరంగా కొనసాగుతోందని అన్నారు.