స్వదేశీ జాగరణ్ మంచ్ ‘‘స్వదేశీ మేళా’’కి సంపూర్ణ మద్దతు : మంత్రి శ్రీధర్ బాబు
స్థానిక ఉత్పత్తులను మరియు స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహిస్తూ స్వదేశీ భావజాల విస్తరణ కోసం స్వదేశీ జాగరణ మంచ్ చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయని తెలంగాణ ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. స్వదేశీ మేళా నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను ముందుండి సహకరిస్తానని వారు ఈ సందర్భంగా ప్రకటించారు. స్వదేశీ జాగరణ మంచ్ అధ్వర్యంలో అక్టోబర్ 23 – 27 వరకు హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో జరగబోవు “స్వదేశీ మేళా” యొక్క ప్రీ-లాంచ్ కార్యక్రమం హరిత ప్లాజాలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్వదేశీ జాగరణ మంచ్ దక్షిణ మధ్య క్షేత్ర కన్వీనర్ డా.లింగమూర్తి, 6TV ఛైర్మన్ సురేష్ రెడ్డి స్వదేశీ మేళాకు సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ వికాసం మహిళల స్వావలంబన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దాని ఫలాలు మరింతగా విస్తృతంగా ప్రజలకు చేరడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. స్థానిక ఉత్పత్తుల వినిమయం పెంచడం కోసం స్వదేశీ జాగరణ మంచ్ మరియు ప్రభుత్వం ఒక సప్లై వ్యవస్థను ఏర్పాటు చేస్తే మరింతంగా ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

స్వదేశీ జాగరణ మంచ్ దక్షిణ మధ్య క్షేత్ర కన్వీనర్ డా. సత్తు లింగమూర్తి మాట్లాడుతూ…అక్టోబర్ 23 నుంచి 27 వరకు హైదరాబాద్ లో నిర్వహించే స్వదేశీ మేళాను కూడా అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.